శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 11, 2020 , 15:29:23

ద‌క్షిణ కొరియా పెట్టుబ‌డుల‌కు స్వాగ‌తం : మ‌ంత్రి కేటీఆర్

ద‌క్షిణ కొరియా పెట్టుబ‌డుల‌కు స్వాగ‌తం : మ‌ంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : ఇండియా - కొరియా బిజినెస్ ఫోరం స‌ద‌స్సులో ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో ద‌క్షిణ కొరియా పారిశ్రామిక వ‌ర్గాలు, భార‌త్ - కొరియా రాయ‌బారులు, ప‌లు రాష్ర్టాల ఆర్థిక శాఖ మంత్రులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ర్టంలో ద‌క్షిణ కొరియా పెట్టుబ‌డుల‌కు స్వాగ‌తం ప‌లుకుతామ‌ని తెలిపారు. తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చే ద‌క్షిణ కొరియా పెట్టుబ‌డిదారుల‌కు రాష్ర్ట ప్ర‌భుత్వం త‌ర‌పున‌ సంపూర్ణ స‌హ‌కారం అందిస్తామ‌‌ని స్ప‌ష్టం చేశారు. ద‌క్షిణ కొరియకు చెందిన పారిశ్రామిక వ‌ర్గాలు, ప‌లు కంపెనీల ప్ర‌తినిధుల‌కు తెలంగాణ రాష్ర్టంలోని పెట్టుబ‌డి అవ‌కాశాల గురించి కేటీఆర్ వివ‌రించారు. తెలంగాణ‌లో నీటి కొర‌త లేదు.. అన్ని రంగాల‌కు 24 గంట‌ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామ‌ని తెలిపారు. వినూత్న పారిశ్రామిక విధానాల‌తో తెలంగాణ ప్ర‌భుత్వం ముందుకెళ్తుంద‌న్నారు. టీఎస్ ఐపాస్ విధానానికి పెట్టుబ‌డిదారుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తుంద‌ని గుర్తు చేశారు. గ‌త ఆరేళ్ల‌లో సుమారు 30 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా పెట్టుబడులు తెలంగాణ‌కు వ‌చ్చాయ‌ని తెలిపారు. తెలంగాణ పారిశ్రామిక విధానాలు న‌చ్చి అనేక ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత కంపెనీలు హైద‌రాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చాయ‌ని తెలిపారు. 

ఇప్పటికే కొరియా కంపెనీకి చెందిన ప్రపంచ ప్రఖ్యాత టెక్స్‌టైల్స్ దిగ్గజ కంపెనీ యంగ్వన్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన విషయాన్ని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. ఇప్పటికే తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న మెడికల్ డివైస్ పార్క్ ద్వారా కొరియాలోని గంగ్ వన్ టెక్ పార్క్‌తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నామ‌ని తెలిపారు. దీంతోపాటు హ్యుండై కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నారు.    

ఇందుకోసం కొరియా పారిశ్రామిక వర్గాలు, కంపెనీలు ముందుకు వస్తే తెలంగాణ లో ప్రత్యేకంగా తెలంగాణ- కొరియా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తామని ఈ దిశగా తమ సహకారం అందించాలని ఇరు దేశాల రాయబారులతో, కొరియా పారిశ్రామిక వర్గాలను మంత్రి కేటీఆర్ కోరారు. 

ఇలాంటి డెడికేటెడ్ కొరియా పార్క్ ఏర్పాటు చేయడం ద్వారా కొరియా నుంచి భారత్‌లోకి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలకు అన్ని రకాల సౌకర్యాలను ఒకేచోట అత్యంత సులువుగా అందించేందుకు వీలు కలుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో సమర్థవంతమైన నాయకత్వంతో పాటు పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉన్నదని స్ప‌ష్టం చేశారు. తెలంగాణలో నీటి కొరత లేదని, 24 గంటల విద్యుత్ అందుబాటులో ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలియజేశారు. కొరియా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే వారికి అవసరమైన మానవ వనరులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సొంత ఖర్చులతో శిక్షణ ఇప్పించి నాణ్యమైన మానవ వనరులను అందుబాటులో ఉంచుతామని కేటీఆర్ తెలిపారు.