గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 02:20:30

ప్రపంచానికి మన ప్రత్యేకతలు

ప్రపంచానికి మన ప్రత్యేకతలు

  • భౌగోళిక గుర్తింపు పొందిన వివరాలతో ఈ-బుక్‌ 
  • ఆవిష్కరించిన మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు
  • 15 రకాల వస్తువులు, ఆహార, వస్ర్తాల సమగ్ర సమాచారం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ హలీం.. బనగానపల్లె మామిడి పండ్లు.. సిద్దిపేట గొల్లభామ చీరె.. నిర్మల్‌ ఫర్నిచర్‌.. చేర్యాల పెయింటింగ్‌.. పెంబర్తి మెటల్‌ క్రాఫ్ట్‌.. తదితర తెలంగాణలోని 15 భౌగోళిక గుర్తింపు (జీఐ) పొందిన వస్తువులు, ఆహార, వస్ర్తాల ప్రత్యేకతలు ప్రపంచానికి మరింత పరిచయం కానున్నాయి. రాష్ట్రంలో జీఐ పొందిన వస్తువులు, ఆహార, వస్ర్తాల సమగ్ర వివరాలతో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఈ-బుక్‌ను రూపొందించాయి. ఈ-బుక్‌ను శనివారం ప్రగతిభవన్‌లో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ఆవిష్కరించారు.

ఇలాంటి పుస్తకాల ద్వారా తెలంగాణ ప్రాంత హస్త, చేనేత, ఇతర కళాకారులు తయారుచేసే వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని సీఐఐ తెలంగాణశాఖ డైరెక్టర్‌ సుభాజిత్‌ సాహా తెలిపారు. విదేశాలు, ఇతర రాష్ర్టాలనుంచి తెలంగాణకు వచ్చే పర్యాటకులు.. ఆయా వస్తువులు తయారుచేసే ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పారు. తెలంగాణలో ఉన్న ప్రత్యేకతలను ప్రపంచానికి తెలిపేందుకు ఈ-బుక్‌ ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు. కళలను ప్రోత్సహించడానికి, కళాకారుల కృషిని గుర్తించడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు. జీఐ ఉన్న వాటికి మార్కెటింగ్‌, ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తుందని.. తెలంగాణలో ప్రతి జిల్లాకు ఒకటిచొప్పున జీఐ పొందేలా కృషిచేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఐటీ పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, చేనేత, జౌళిశాఖ డైరెక్టర్‌ శైలజారామయ్యర్‌ తదితరులు పాల్గొన్నారు.


భౌగోళిక గుర్తింపు అంటే..

ఒక ప్రాంతానికి చెందిన ఉత్పత్తులకు ఇచ్చే గుర్తింపును భౌగోళిక గుర్తింపు అంటారు. ఒక్కో ప్రాంతంలో తయారయ్యే లేదా ఉత్పత్తి అయ్యే కొన్ని వస్తువులకు సహజంగా ఓ నాణ్యత ఉంటుంది. అదే దాని ప్రత్యేకత. ఈ విశిష్టతను దృష్టిలో ఉంచుకుని ‘ది జియోగ్రాఫికల్‌ ఇండికేషన్స్‌ ఆఫ్‌ గూడ్స్‌(రిజిస్ట్రేషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ చట్టం)’-1999ని తీసుకొచ్చారు. దీనిప్రకారం భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తులను వారి అనుమతి లేకుండా ఇతరులు తయారుచేసేందుకు అవకాశం ఉండదు. ఎవరైనా వ్యక్తులు తాము ఉత్పత్తి చేస్తున్న వస్తువుల ప్రత్యేకతలను తెలుపుతూ జీఐ చట్టం ప్రకారం రాతపూర్వకంగా రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకోవాలి. 

రాష్ట్రంలో భౌగోళిక గుర్తింపు పొందినవి

1. ఆదిలాబాద్‌ డోక్రా: ఆదిలాబాద్‌ జిల్లాలోని ఓజ్‌ జాతికి చెందిన గిరిజనులు అతుకుల్లేకుండా లోహపు బొమ్మలు తయారుచేసే కళ డోక్రా. 

2. బనగానపల్లె మామిడిపండ్లు: మామిడిపండ్లలో రారాజుగా పిలిచే వీటిని ఖమ్మం, మహబూబ్‌నగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌లో పండిస్తారు.

3. చేర్యాల చిత్రకళ: సిద్దిపేట జిల్లా చేర్యాల చిత్రకళకు 5వేల ఏండ్లకుపైగా చరిత్ర ఉన్నది. ఇతివృత్తం ఆధారంగా బొమ్మలు వేస్తారు.

4. గద్వాల చీరెలు: చేతితో నేయడం, అంచులను ప్రత్యేకంగా జోడించడం గద్వాల చీరెల ప్రత్యేకత. దీనికి 200 ఏండ్లకుపైగా చరిత్ర ఉన్నది. 

5. నారాయణపేట చేనేత వస్ర్తాలు: చీరెకు రెండువైపులా అంచు ఉండటం నారాయణపేట చేనేత వస్ర్తాల ప్రత్యేకత.

6. హైదరాబాద్‌హలీం: పోషకవిలువలుండే ఈ హలీంకు విశ్వఖ్యాతి ఉన్నది. 

7. నిర్మల్‌ ఫర్నిచర్‌: టేకుతో రూపాలు, ఫర్నిచర్‌పై డిజైన్‌లు వీటి ప్రత్యేకత.

8. నిర్మల్‌ చిత్రకళ: స్థానిక రంగులతో వేసే అద్భుత చిత్రకళ

9. నిర్మల్‌ బొమ్మలు: ఇవి పోనికి అనే కలపతో తయారవుతాయి. 

10. పెంబర్తి విగ్రహాలు: జనగామ జిల్లా పెంబర్తిలో 5వేల ఏండ్లనాటి కళ. 

11. పోచంపల్లి ఇక్కత్‌: వస్ర్తాలు నేసేందుకు ముందే రంగులు వేయడం నల్లగొండ జిల్లా పోచంపల్లి ఇక్కత్‌ ప్రత్యేకత. 

12. సిద్దిపేట గొల్లభామ: చీరె అంచులో పాలకుండను తలపై మోస్తున్న మహిళల చిత్రాలను నేయడం గొల్లభామ ప్రత్యేకత. 

13. కరీంనగర్‌ సిల్వర్‌ పిలిగ్రీ: వెండితీగతో విగ్రహాల తయారీ. 

14. వరంగల్‌ తివాచీ: స్థానికతను, ఆధునికతను కలబోసి తయారుచేసే తివాచీలు వందల ఏండ్లుగా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 

15. పుట్టపాక తెలియా రుమాలు: నల్లగొండ జిల్లా పుట్టపాకలోని తయారయ్యే ఈ రుమాలు విడివిడి ముక్కలను ఒక్కదగ్గర అతికించినట్టు కనిపించినా.. ఎక్కడా అతుకు కనిపించకపోవడం ప్రత్యేకత.


logo