మేయర్ బరాబర్ టీఆర్ఎస్దే

- జీహెచ్ఎంసీ ఎన్నికల రోడ్‌షోల్లో మంత్రి కేటీఆర్ ధీమా
- సొమ్ము మాది.. సోకు మీదా?..
- మా ఆఠాణాతో మీ దగ్గర అభివృద్ధా?..
- అమిత్షాజీ సమాధానం చెప్పగలరా
- పైసా తీసుకురాని కిషన్‌రెడ్డిని నిలదీయాలి..
- తాగునీటి సమస్యను పట్టించుకున్ననేత కేసీఆర్
- ఎన్నికలయ్యాక అర్హులందరికీ 10వేల వరదసాయం..
- బీజేపీ వాళ్లు దమ్ముంటే 25వేలు సాయం ఇప్పించాలి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సొమ్ము మాది.. సోకు మీదా? తెలంగాణ నుంచి వసూలుచేసిన రూపాయిలో ఆఠాణా ఇచ్చి మిగిలిన ఆఠాణాతో బీజేపీ రాష్ర్టాల్లో అభివృద్ధి చేస్తారా? అని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు కేంద్రంపై మండిపడ్డారు. అమిత్షాజీ దీనికి సమాధానం చెప్పగలరా అని నిలదీశారు. కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో చెప్పే లెక్కలు తప్పయితే ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు. పక్కరాష్ర్టాలకు రోజుల్లోనే నిధులిచ్చి.. తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖరాస్తే మాత్రం.. ఎనిమిది వారాలైనా ఎందుకు జవాబివ్వడం లేదని ధ్వజమెత్తారు.
కరోనాకష్టంలో, వరదల సమయంలో జనంవెంట ఉన్నది టీఆర్ఎస్ అని.. ఇప్పుడు బీజేపీ నేతలు ఓట్లు, సీట్ల కోసం కుట్రలు, కుతంత్రాలతో విషం చిమ్మేందుకు వస్తున్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్‌లో తాగునీటి కష్టాలను తీర్చేందుకు విజన్ఉన్న సీఎంగా కేసీఆర్ గండిపేటకు రెట్టింపు సామర్థ్యంతో కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మిస్తున్నారని తెలిపారు. కరోనా కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకొనేందుకు మ్యానిఫెస్టోలో వరాల జల్లుతో పెద్ద మనుసు చాటుకున్నారని కొనియాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆర్కేపురం అష్టలక్ష్మి దేవాలయం చౌరస్తా, మన్సూరాబాద్, వనస్థలిపురం రైతుబజార్, కర్మన్‌ఘాట్, పీఅండ్‌టీ కాలనీల్లో రోడ్‌షోలలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల కేటీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
రూపాయి కడితే ఇచ్చింది ఆఠాణా..
ఆరేండ్లలో తెలంగాణ ప్రజలు కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్లు పన్ను కడితే.. కేంద్రం నుంచి తిరిగిఇచ్చింది రూ.1.40 లక్షల కోట్లు. అంటే మనం రూపాయి కడితే.. ఆఠాణా మాత్రమే తిరిగిచ్చింది. అంటే ఎవరు ఎవరికి ఇచ్చినట్టు? మిగిలిన ఆఠాణాను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమపార్టీ పాలిత రాష్ర్టాల్లో అభివృద్ధి చేసుకుంటున్నది. సొమ్మొకరిది.. సోకొకరిదిగా వ్యవహరిస్తున్నది. తెలంగాణలాంటి ఐదారు రాష్ర్టాలు దేశంలోని వెనుకబడిన రాష్ర్టాలను సాకుతున్నాయి. నేను చెప్పిన ఈ లెక్కలు తప్పైతే ఏ శిక్షకైనా సిద్ధం.. చట్టబద్ధంగా రావాల్సింది కాకుండా ఒక్కరూపాయి అయినా ఎక్కువ ఇచ్చిందా? సమాధానం చెప్పండి అమిత్షాజీ.
నాడు గండిపేట.. నేడు కేశవాపూర్
రూ.2 వేల కోట్లు ఖర్చుచేసి శివారు ప్రాంతానికి తాగునీళ్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది. హైదరాబాద్‌లో తాగునీటి కోసం 1920లో గండిపేట రిజర్వాయర్‌ను కడితే.. వందేండ్ల తర్వాత అంతకుడబుల్గా శామీర్‌పేట మండలంలో కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో 2050 దాకా తాగునీటికి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. హైదరాబాద్‌లో స్వచ్ఛ ఆటోలతో రోజుకు ఆరువేల టన్నులకుపైగా చెత్త సేకరిస్తున్నాం. దేశంలో ఢిల్లీ తర్వాత జవహర్‌నగర్‌లో రెండో ది చెత్తనుంచి విద్యుత్ తయారుచేసే ప్లాంట్‌ను తయారుచేసుకున్నం. ఈ ఆరేండ్లలో లొల్లిలేని ప్రశాంత వాతావరణం హైదరాబాద్‌లో ఉన్నది. చీమచిటుక్కుమ న్నా తెలిసేలా 5 లక్షల సీసీ కెమెరాలు పెట్టుకున్నాం. దమ్ము న్న నాయకుడు కేసీఆర్‌ను చూసే మన హైదరాబాద్‌కు అమెజాన్, ఆపిల్, గూగుల్, ఫేస్బుక్ తరలివచ్చాయి.
మంచి మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్
పేద ప్రజలు కష్టంలో ఉన్నారని, వాళ్లను ఆదుకోవాలని జీహెచ్ఎంసీ మ్యానిఫెస్టోలో ఎన్నో రాయితీలు ఇచ్చిన మంచి మనసున్న సీఎం కేసీఆర్. నాయీబ్రహ్మణులు కరోనా సమయంలో ఇబ్బందులు పడ్డారని వారికి విద్యుత్ చార్జీలు మాఫీచేశారు. ఆటోలు, ఇతరులకు వాహనాల పన్ను రద్దుచేశారు. పేదల బస్తీలో 20వేల లీటర్ల నీటి వినియోగానికి బిల్లు కట్టే అవసరంలేదు. పైసా తీసుకోకుండా డబుల్బెడ్రూం ఇండ్లు.మీకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చే బాకీ ఉన్నది. అవికూడా ఇస్తాం. ప్రైవేటుకు దీటుగా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నాం. పైసా తీసుకోకుండా పేదోళ్లకు నాణ్యమైన ఇండ్లు అందజేస్తాం. మొత్తం 111 జాగల్ల ఇండ్లు కడుతున్నాం. కరోనా రావడంతో పనులు ఆగిపోయాయి. లేకుంటే పూర్తయ్యేవి. పనులు ఆగిపోతే కూడా మోసం చేస్తున్నం అని ప్రచారం చేస్తున్నరు. అసలు బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు ప్రజలకు ఇలాంటివి చేయాలన్న ఆలోచనలు ఎప్పుడన్నా వచ్చాయా? జాగా చూపెట్టినా ఇల్లు కట్టించే జిమ్మేదార్ నాది. ఇండ్లలోకి వర్షపు నీళ్లు రాకుండా ఎస్సార్డీపీ మాదిరిగానే.. ఎస్ఎన్డీపీ ద్వారా చేస్తాం.
ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు కావాలే
రాష్ట్ర విభజన తర్వాత రాష్ర్టానికి జాతీయ విద్యాసంస్థలు కావాలని కేంద్రాన్ని అడిగినం. ఒక్కటీ రాలేదు. ఐఐఎం రాలేదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఇవ్వలేదు. ఇంకా ఐదారు అడిగినా ఇవ్వలే. అన్నదమ్ము ల్ల ఉన్న మన మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నా రు. మనకు కావాల్సింది ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు. ఆగం చేస్తే ఆగమాగమయ్యేందుకు ఇది అహ్మదాబాద్ కాదు.. హుషారైన హైదరాబాద్ యాది పెట్టుకోండి.
టీఆర్ఎస్తోనే అభివృద్ధి
హస్తినాపురంలో ఐదేండ్లలో రోడ్లు, సీసీ కెమెరాలు, కమ్యునిటీహాళ్లు, థీమ్ పార్కులు, పుట్‌పాత్‌లు, బస్తీ దవాఖానలు, జిమ్ములు, ట్రాన్స్ఫార్మర్లు ఇలా మొత్తం రూ.215 కోట్లతో పనిచేశాం. ప్రతి డివిజన్‌లోనూ ఈ విధంగా పని జరిగింది. టీఆర్ఎస్ వచ్చాక నగరం ప్రకాశవంతమైంది. సురక్షితమైంది. ఏ గల్లీకి పోయినా సీసీ కెమెరాలు, ఎల్ఈడీ లైట్లు కనిపిస్తాయి. ఎల్బీనగర్ నియోజకవర్గం గతంలో ఎట్లా ఉండేదో గుర్తుతెచ్చెకోండి. ఎల్బీనగర్ చౌరస్తాలో ఇరుక్కుంటే బయటకురావడానికి అరగంట పట్టేది. ఇప్పుడు ఎన్ని ఫ్లైఓవర్లు వచ్చాయో, ఎన్ని అండర్‌పాస్‌లు వచ్చాయో చూడండి. బైరామల్‌గూడ చౌరస్తా ఎట్లా ఉందో చూడండి.
బీజేపీ, కాంగ్రెస్ నేతలను నిలదీయండి
కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఓటు అడిగేటందుకు వస్తే హైదరాబాద్ నగరానికి ఏంచేసిండ్రో నిలదీసి అడగండి. ‘కేంద్రంలో ఆరేండ్లుగా అధికారంలో ఉండి, హైదరాబాద్‌కు మీరు పైసా పనిచేసిన్రా’ అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని అడగాలి. దమ్ముంటే కేంద్రం నుంచి డబ్బులు తెచ్చి ఓట్లు అడుగు అని నిలదీయండి. ముఖ్యమంత్రి కేసీఆర్ వరద సాయంకోసం ఢిల్లీకి ఉత్తరంరాసి ఎనిమిది వారాలైనా ఇంతవరకు ఉలుకుపలుకూలేదు. బీజేపీవాళ్లకు ఏం చేసిండ్రో చెప్పేటందుకు విషయం లేకనే విషం చిమ్ముతున్నరు.బండ్ల మీద నలుగురు పోండి, మేము చలాన్లు కడుతమంటూ మతిలేకుండా మాట్లాడుతున్నరు. మతం పేరుతో హైదరాబాద్‌లో హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నరు. మన జాగ్రత్తగా ఉండాలి.
వరదసాయం 25 వేలిస్తే.. మీరు చెప్పింది చేస్తా
బీజేపీకి మంత్రి కేటీఆర్ సవాల్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లోని ప్రతి వరద బాధిత కుటుంబానికి రూ.25,000 ఇవ్వాలని పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు బీజేపీకి సవాల్ విసిరారు. బీజేపీ నాయకులు వాగ్దానం చేసినట్లుగా.. కేంద్రం నుంచి నిధులు రాబట్టి బాధితులను ఆదుకోగలిగితే తాము చప్పట్లు కొట్టి అభినందిస్తామని చెప్పారు. వారిని సత్కరిస్తామని లేదా వారు చెప్పినట్టు చేస్తామని కేటీఆర్ సోమవారం ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
బయటకు రండి.. ఓటెయ్యండి
మనసులో అభిమానం పెట్టుకొని టీఆర్ఎస్ గెలిస్తెనే బాగుంటది, హైదరాబాద్ పచ్చగుంటనే బాగుంటదనుకుంటూ ఓటేయ్యకుండా ఇంట్లోనే ఉంటే లాభం లేదు. హైదరాబాద్‌కు ఓ బదనాం ఉన్నది. ఊర్లల్లో 90శాతం పోలింగ్ అయితే.. ఇక్కడ 40 శాతమే అయితది. ఎవరికైతే హైదరాబాద్ మీద ప్రేమ ఉన్నదో.. ఎవరైతే నిజమైన హైదరాబాదీలో బయటకు రండి.. ఓటెయ్యండి. ప్రగతికి, అభివృద్ధికి, పురోగతికి ఓటేయండి. డిసెంబర్ 1న ఓటేసి బల్దియా మీద గులాబీ జెండా ఎగురేసేలా ఆశీర్వదించండి. అభివృద్ధి కావాలనుకుంటే కారు గుర్తుకు ఓటేయండి.
ఎంఐఎంను ఓడగొట్టేది మేమే
ఎంఐఎంకు మాకు సంబంధం ఉన్నదని ప్రచారం చేస్తున్నారు. ఎంఐఎంకు మేయర్ పదవి ఇస్తారని అంటున్నరు. మేం ఎక్కువ సీట్లు గెలిచి వారికెందుకు మేయర్ కట్టపెడుతం. బరాబర్‌గా మేయర్ పీఠంపై టీఆర్ఎస్ కూర్చుంటుంది. ఐదేండ్లు పాలిస్తుంది. గత ఎన్నికల్లో పాతబస్తీలో ఎంఐఎంను ఓడగొట్టింది మేం. ఈసారి కూడా ఓడగొడతాం. ఏకంగా 10-12 సీట్లు గెలిచి చూపిస్తాం.
ఇస్తమంటే వద్దంటమా!
కరోనా కష్టమొస్తే కంటైన్మెంట్ జోన్లలో తిరిగింది మనం. వరదలు వస్తే మోకాలులోతు నీళ్లలో తిరుగుతూ అండగా ఉన్నది మనం. భయపడి ఇండ్లలో ఉన్నోళ్లు ఇప్పుడొచ్చి ఓటు అడుగుతున్నరు. వరదసాయం కింద రూ.10 వేలు ఇస్తుంటే అడ్డుపడిన బీజేపీవాళ్లు ఇప్పుడు రూ.25 వేలు ఇస్తామని దొంగ మాటలు చెప్తున్నరు. వాళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్నరు. ప్రజలకు సాయంచేస్తామంటే ఎవరు అడ్డుకొంటరు. రూ.25 వేలు ఇవ్వాలని నేనూ అడుగుతున్నా. కానీ, ఓట్లేయించుకుని పోతరు. అర్హులందరికీ డిసెంబర్ 4 తర్వాత వరదసాయమిస్తాం.
మేం పక్కా లోకల్
‘వోకల్ ఫర్ లోకల్' అని ప్రధాని మోదీ చెప్తున్నరు. నేనూ అదే చెప్తున్నా.. తెలంగాణలో పక్కా లోకల్ పార్టీ టీఆర్ఎస్. ఢిల్లీ నుంచి వచ్చే టూరిస్టులు బీజేపీ వాళ్లు. హైదరాబాద్‌లో గుజరాత్ గులాంలు కావాల్నా? హైదరాబాద్ గులాబీలు కావాల్నా? కరోనా కష్టంలో, వరద నీళ్లలో మీ వెంట నడిచేవాళ్లు కావాల్నా? ఢిల్లీవీధుల్లో ఊరేగేటోళ్లు కావాల్నా? ఓటర్లూ.. మీరే ఆలోచించండి.
- మంత్రి కేటీఆర్
తాజావార్తలు
- రేపు సర్వార్థ సంక్షేమ సమితి 28వ వార్షికోత్సవాలు
- కేంద్ర బడ్జెట్ కోసం ప్రత్యేక మొబైల్ యాప్
- బెస్ట్ సెల్లింగ్ మారుతి ‘స్విఫ్ట్’
- రైతుల ట్రాక్టర్ పరేడ్‌కు అనుమతి
- ఇక నుంచి వీళ్లూ పన్నుకట్టాల్సిందే...?
- కంబోడియాలో క్రేజీ ‘బీరు యోగా’!
- చెన్నైలోనే ఐపీఎల్ -2021 వేలం!
- వాట్సాప్ కు ధీటుగా సిగ్నల్ ఫీచర్స్...!
- బైడెన్ జీ! మీ నిబద్ధత అమెరికా విలువలకు ప్రతిబింబం!!
- పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం : మంత్రి కేటీఆర్