శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 10, 2020 , 01:48:06

ప్రతి ఆదివారం పదినిమిషాలు

ప్రతి ఆదివారం పదినిమిషాలు

  • సీజనల్‌ వ్యాధుల నివారణకు కార్యక్రమం
  • ఇండ్లలోనే దోమల నివారణ.. ప్రజాప్రతినిధులదే కీలకపాత్ర
  • కరోనాతో సహజీవనమే.. వ్యాక్సిన్‌ వచ్చేదాకా ఇదే పరిస్థితి
  • నగరాలు, పట్టణాల్లో సరి-బేసి విధానం అమలు మంచిదే
  • మున్సిపల్‌ కమిషనర్లతో సమీక్షలో మంత్రి కే తారకరామారావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దోమల వల్ల వ్యాపించే వ్యాధుల నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఆదివారం నుంచి పురపాలక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖమంత్రి కే తారకరామారావు చెప్పా రు. ప్రతి ఆదివారం ‘పది గంటలకు  పది నిమిషాలు’ పేరిట ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ ఇండ్లలోనే దోమల నివారణకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను కలుపుకొనిపోవాలని మున్సిపల్‌ కమిషనర్లను మంత్రి ఆదేశించారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు స్ఫూర్తిగా నిలువాలని కేటీఆర్‌ కోరారు. రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల కమిషనర్లు, అడిషనల్‌ కలెక్టర్లతో శనివారం మంత్రి కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. 

వైరస్‌తో సహజీవనం తప్పదు

కరోనా వ్యాధి ఇప్పుడప్పుడే మనల్ని వదిలిపోయే అవకాశం లేదని, దానిని నిర్మూలించే వ్యాక్సిన్‌ వచ్చేంతవరకూ వైరస్‌తో సహజీవనం చేయకతప్పదని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. రాష్ట్రంలో దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత కరోనావ్యాప్తికి ఆస్కారం ఉంటుందని, అందువల్ల ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న మున్సిపల్‌ కమిషనర్లను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఇదేస్ఫూర్తితో భవిష్యత్తులో కూడా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణాల్లో ప్రవేశపెట్టిన సరి-బేసి విధానంలో భాగంగా దుకాణాల నిర్వహణను కమిషనర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. మాస్కులు, శానిటైజర్ల వినియోగం, భౌతికదూరం పాటించడంలాంటివి కొనసాగించాల్సిన బాధ్యత కమిషనర్లదేనని చెప్పారు. కరోనాను అరికట్టే వ్యాక్సిన్‌ వచ్చేంతవరకూ ఆ మహమ్మారితో సహజీవనం చేయాల్సిన పరిస్థితి నెలకొందని, అందుకు అనుగుణంగా ముందుజాగ్రత్త చర్యలపై దృష్టి పెట్టాలని మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు.


మాన్సూన్‌ యాక్షన్‌ ప్లాన్‌

కరోనా కట్టడికి మాన్సూన్‌ యాక్షన్‌ ప్లాన్‌ను ఆరోగ్యశాఖతో కలిసి మున్సిపల్‌శాఖ శనివారం విడుదల చేసిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ ప్రణాళికపై సమీక్షించిన మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. సీజనల్‌ క్యాలెండర్‌ ఆధారంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలంలో వచ్చే డెంగ్యూ వంటి వ్యాధుల నివారణకు తగినచర్యలు తీసుకోవాలని చెప్పారు. గతంలో వారానికోసారి యాంటీ లార్వా యాక్టివిటీస్‌ కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాన్ని మళ్లీ ఆదివారంనుంచి ప్రారంభించాలని మంత్రి కోరారు. 

కమిషనర్లదే ఆ బాధ్యత

ప్రతి పట్టణంలో మురుగు కాలువలను శుభ్రంచేసి ఆ చెత్తను తరలించే విధంగా ఇప్పట్నుంచే ప్రణాళికలు రూపొందించి, పనులు మొదలుపెట్టాలని మున్సిపల్‌ కమిషనర్లను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. ప్రతి పట్టణంలో మ్యాన్‌హోల్‌ మరమ్మతులు పూర్తిచేయాలని సూచించారు. పారిశుద్ధ్య సిబ్బంది రక్షణ కవచాలు, మాస్కులు, గ్లౌజులు లేకుండా పనిచేయరాదని స్పష్టంచేశారు. పారిశుద్ధ్య కార్మికులు రక్షణ పరికరాలు లేకుండా కనిపిస్తే మున్సిపల్‌ కమిషనర్లనే బాధ్యులను చేస్తామని మంత్రి హెచ్చరించారు. పారిశుద్ధ్య కార్మికులకు వారానికోసారి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయాలన్నారు. ఇప్పటిదాకా పట్టణాలకు పట్టణ ప్రగతి ద్వారా రూ.830 కోట్లను విడుదల చేశామని వెల్లడించారు. ఈ నిధులతో చేపట్టిన కార్యక్రమాలపై నివేదికను రూపొందించి మున్సిపల్‌శాఖ ఉన్నతాధికారులకు ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే ప్రమాదమున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ ప్రతి ఆదివారం పదినిమిషాలపాటు విధిగా ఇల్లు, పరిసర ప్రాంతాల్లో  నిల్వనీటిని తొలిగించి శుభ్రంచేసుకోవాలని పురపాలకశాఖ డైరెక్టర్‌ సత్యనారాయణ శనివారం విజ్ఞప్తిచేశారు. ఇలా అందరూచేస్తే పట్టణాలన్నీ దోమలు లేకుండా కళకళలాడుతాయన్నారు.


logo