శనివారం 30 మే 2020
Telangana - Apr 01, 2020 , 01:58:27

వలస కార్మికులకు భయం వద్దు

వలస కార్మికులకు భయం వద్దు

  • తొమ్మిది లక్షల మంది వలస కార్మికులకు క్యాంపులు 
  • మర్కజ్‌ సందర్శకులు సమాచారం ఇస్తే పరీక్షలు చేయిస్తాం
  • ఈ నెల ఏడో తేదీకల్లా ముగియనున్న స్వీయ గృహనిర్బంధాలు
  • ఆ తర్వాత కరోనా కేసులు ఉండవని ఆశిస్తున్నాం
  • ఏఎన్‌ఐ వార్తాసంస్థతో ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనాపై పోరులో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నదని.. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని.. కరోనా రహిత తెలంగాణే తమ లక్ష్యమని ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు తెలిపారు. వలస కార్మికులు భయపడొద్దని భరోసా ఇచ్చారు. మంగళవారం ఆయన ఏఎన్‌ఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నదన్నారు. తొలుత కొవిడ్‌-19 వ్యాప్తి చెందకుండా లాక్‌డౌన్‌ ద్వారా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొన్నామని, రెండో అంశంగా కరోనా సోకినవారికి చికిత్సను అందజేస్తున్నామన్నారు. 

ఇప్పటికి తెలంగాణలో సుమారు 70 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌ రాగా, చికిత్స తర్వాత వీరిలో 12 మందికి నెగెటివ్‌ వచ్చిందని తెలిపారు. కరోనాతో ఇబ్బందిపడుతున్న వలస కా ర్మికులు, అల్పాదాయ వర్గాలు, నిరుపేదలకు ఆపన్నహస్తం అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. నిజాముద్దీన్‌ ఘటన తర్వాత అప్రమత్తం అయ్యామని, ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్నవారి వివరాలను సేకరిస్తున్నామని.. నిజాముద్దీన్‌ నుంచి వచ్చిన ప్రతిఒక్కరినీ ట్రాక్‌ చేస్తున్నామని చెప్పారు. ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. ఇందుకోసం కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామని తెలిపారు. ఢిల్లీ వెళ్లి వచ్చినవారు తమ సమాచారాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలని సూ చించారు. వీరందరికీ ప్రభుత్వమే పరీక్షలు ని ర్వహిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ సమర్థంగా అమలుచేస్తున్నామన్నారు.

వలస కార్మికులకు దిగులొద్దు

తెలంగాణలో తొమ్మిది లక్షల మంది దాకా వలస కార్మికులు ఉన్నారని.. వీరి కోసం హైదరాబాద్‌లో 170 క్యాంపులను ఏర్పాటుచేసినట్టు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. వారికి ఆరోగ్య పరీక్షలు చేపట్టడంతోపాటు క్యాం పుల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగ్గా నిర్వహిస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వలస కార్మికులకు నిత్యావసర సరుకులను అందజేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో నివసిస్తున్న ఇతర రాష్ర్టాల ప్రజలు దిగులుపడాల్సిన అవసరంలేదని, వారిని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా పరిగణిస్తున్నట్టు సీఎం కేసీఆర్‌ చెప్పారని, అందుకే ప్రతిఒక్కరికీ రూ.500 చొప్పున నగదు అందజేయడమే కాకుండా 12 కిలోల బియ్యం లేదా గోధుమపిండి పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.

వలస కార్మికుల్లో ఒకరకమైన భయం ఏర్పడిందని.. కరోనా వస్తే చనిపోతామనే భయాందోళనలో వీరంతా ఉన్నారని తెలిపారు. ఒకవేళ చనిపోయే పరిస్థితులే వస్తే.. తమ సొంతూర్లలోనే కన్నుమూస్తామనే ఆలోచనాధోరణి వీరిలో పెరిగిందన్నారు. ఇలాంటి ఆలోచనల్ని వారి మనసుల్లో నుంచి తొలిగించే ప్రయత్నం చేస్తున్నామని, కరోనా వచ్చినప్పటికీ చికిత్స ద్వారా నయమవుతుందనే భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. అందుకే, వారు తెలంగాణ నుంచి వెళ్లిపోకుండా చేయడంలో విజయం సాధించామన్నారు. 

పూర్తిస్థాయిలో నిరోధిస్తాం

కరోనాను కట్టడి చేయడానికి తగినంత రక్షణ పరికరాలు తమ వద్ద ఉన్నాయని కేటీఆర్‌ అన్నారు. ఇందుకోసం వ్యూహాత్మక అడుగులు వేస్తున్నామని చెప్పారు. వేల సంఖ్యలో కరోనా బాధితులొచ్చినా ప్రభుత్వమే చికిత్స అందజేస్తుందని తెలిపారు. కేసుల సంఖ్య పెరిగితే ప్రైవేట్‌ దవాఖానల సహకారం తీసుకొంటామని పేర్కొన్నారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సమర్థంగా ఎదుర్కోవడానికి అవసరమయ్యే వ్యక్తిగత రక్షణ పరికరాలతోపాటు డాక్టర్లు, ఆరోగ్య సిబ్బందికి కావాల్సిన ఎన్‌-95 మాస్కులు, వెంటిలేటర్లు తగినంత సంఖ్యలో ఉన్నాయని వెల్లడించారు. అయినా, వీటి అవసరం ఎక్కువగా ఏర్పడితే, డీఆర్డీవో సహా పలు సంస్థల సహకారం తీసుకొంటామన్నారు. 

ఇందుకు సంబంధించి ఇ ప్పటికే పలు సంస్థలతో సంప్రదింపులు జరిపినట్టు చెప్పారు. విదేశీ విమానాలు నగరానికి రావడంలేదు.. పైగా విదేశాల నుంచి వచ్చినవారి స్వీయగృహ నిర్బంధం ఏప్రిల్‌ ఆరో తేదీ తో ముగుస్తుందని తెలిపారు. లాక్‌డౌన్‌ వల్ల ఒకరినుంచి మరొకరికి వైరస్‌ సోకకపోవడం వంటి కారణాల వల్ల ఏప్రిల్‌ ఏడో తేదీకల్లా కరోనా ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణ అవతరించే అవకాశముందన్న ధీమాను కేటీఆర్‌ వ్యక్తంచేశారు. ఒకవేళ, ఇందులో ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉన్నప్పటికీ, కరోనాను పూర్తిస్థాయిలో నిరోధించడానికి తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా శ్రమిస్తుందని చెప్పారు.


logo