బుధవారం 20 జనవరి 2021
Telangana - Nov 26, 2020 , 19:10:51

నిలువ నీడలేని కుటుంబానికి మంత్రి కేటీఆర్‌ ఆపన్నహస్తం

నిలువ నీడలేని కుటుంబానికి మంత్రి కేటీఆర్‌ ఆపన్నహస్తం

సిరిసిల్ల : నిలువ నీడలేని నిరుపేద కుటుంబం.. పెద్దదిక్కునూ కోల్పోయి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తుండగా మంత్రి కేటీఆర్ భరోసాగా నిలిచారు. డబుల్‌ బెడ్రూం మంజూరు చేసి ఆ కుటుంబానికి పెద్దన్నగా మారారు. వీర్నపల్లి మండలం మద్దిమల్ల గ్రామానికి చెందిన ఇస్కిల్ల రాజయ్యది నిరుపేద కుటుంబం. భార్య జ్యోతి, తల్లి ఆగవ్వ, అర్చన, నవ్య, అరవింద్ ముగ్గురు పిల్లలతో పూరి గుడిసెలో ఉంటున్నాడు.

రెండునెలల క్రితం అనారోగ్యానికి గురై రాజయ్య చికిత్స పొందుతూ ఈ నెల 21న  మృతి చెందాడు. ఇల్లు కూడా లేకపోవడంతో టెంట్ ఏర్పాటు చేసి అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ చలించిపోయి బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. వెంటనే డబుల్‌ బెడ్రూం మంజూరు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ గురువారం బాధిత కుటుంబానికి డబుల్‌ బెడ్రూం మంజూరు చేస్తూ ఉత్తర్వులు అందజేశారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్‌, కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు.


logo