బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 17, 2020 , 02:58:59

ఈవోడీబీ సంస్కరణలకు తుది రూపు

ఈవోడీబీ సంస్కరణలకు తుది రూపు

  • త్వరలో మంత్రి కేటీఆర్‌ సమీక్ష 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సులభ వాణిజ్య విధానంలో ఈసారి రాష్ర్టాన్ని అగ్రభాగాన నిలిపేందుకు ప్రభుత్వం మమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో పెట్టుబడులకు మెరుగైన అవకాశాలు ఉండటంతోపాటు, ఈవోడీబీ సంస్కరణల ద్వారా వాటిని మరింతగా ఆకర్షించవచ్చని అంచనా వేసిన కేటీఆర్‌.. ఆ దిశగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. కేంద్ర వాణిజ్యశాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రెడ్‌ (డీపీఐఐటీ) ఈవోడీబీ మార్గదర్శకాలను విడుదల చేసింది. 2020లో 301 సంస్కరణలు అమలుచేయాలని నిర్ణయించారు. ఈ సంస్కరణల అమలులో రాష్ర్టాన్ని ఆగ్రభాగాన నిలిపేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ గత నెలలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అక్టోబర్‌ 15 కల్లా సంస్కరణల అమలును పూర్తిచేయాలని అధికారులకు లక్ష్యం విధించారు. ఈ మేరకు వివిధ శాఖల అధికారులు తమ పరిధిలో సంస్కరణలను పూర్తి చేశారు. మరికొన్ని శాఖలు పూర్తి చేయాల్సి ఉన్నది. ఈ ఏడాది కొత్తగా ఈవోడీబీ పరిధిలోకి వచ్చిన పర్యాటక, ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీసీ), గతేడాది సంస్కరణలను పూర్తిచేయని న్యాయశాఖ సహా వివిధశాఖలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సంస్కరణలు అమలుచేయడమే కాకుండా ఒక్కో సంస్కరణకు కనీసం 30మంది ప్రయోజనం పొందినవారు ఉండాలని ఈవోడీబీలో ఈసారి కొత్త నిబంధన విధించారు. ఈ నేపథ్యంలో సంస్కరణలు త్వరగా పూర్తిచేసి వాటిని పారిశ్రామిక, వ్యాపారవర్గాలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఈ సంస్కరణల ద్వారా ప్రయోజనం పొంది, వాటి గురించి అభిప్రాయం చెప్పే అవకాశం ఉండటంతో వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి పూర్తిగా సంస్కరణలను వినియోగించిన వారి అభిప్రాయాలకనుగుణంగా ర్యాంకులు ప్రకటించనున్నారు. గతనెలలో జరిగిన సమావేశంలో నిర్ధేశించిన లక్ష్యాన్ని ఎన్ని శాఖలు పూర్తి చేశాయి, ఇంకా ఏ శాఖలు పూర్తిచేయాల్సి ఉన్నదనే దానిపై మంత్రి కేటీఆర్‌ త్వరలో సమీక్షించనున్నారు. 

కార్పొరేటర్ల విరాళం @ 9.93 లక్షలు

  • సహాయ చర్యల కోసం సీఎంఆర్‌ఎఫ్‌కు నెల వేతనం వితరణ

భారీవర్షాల నేపథ్యంలో సహాయ చర్యల కోసం జీహెచ్‌ఎంసీ తోడ్పాటునందించింది. కార్పొరేటర్లు తమ ఒకనెల గౌరవ వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. ఈ మేరకు మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ నేతృత్వంలో పలువురు కార్పొరేటర్లు శుక్రవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావును కలిశారు. నెల వేతనం చెక్కును అందజేశారు. మేయర్‌కు రూ.50 వేలు, డిప్యూటీ మేయర్‌కు రూ.25 వేల వేతనం ఉండగా, మిగిలిన 148 మంది కార్పొరేటర్లు,  ఐదుగురు కో-ఆప్షన్‌ సభ్యులకు రూ.ఆరువేల వేతనం అంతా కలిపి రూ.9.93 లక్షల చెక్కును ఇచ్చారు. మరోవైపు, కంటోన్మెంట్‌ బోర్డు సభ్యులు సైతం తమ నాలుగునెలల గౌరవ వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తున్నట్టు ప్రకటించి కార్పొరేటర్లతోపాటే మంత్రి కేటీఆర్‌కు చెక్కును అందజేశారు.


logo