ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 01, 2020 , 02:10:56

కష్టకాలంలో 110 కోట్లు

కష్టకాలంలో 110 కోట్లు

  • కరోనా సంక్షోభంలోనూ ‘నేతన్నకు చేయూత’
  • లాకిన్‌ పీరియడ్‌ ముందుగా నిధులు తీసుకునే వీలు
  • బతుకమ్మ పండుగకు వారం ముందే చీరెల పంపిణీ 
  • చేనేత వస్ర్తాలకు బ్రాండింగ్‌పై అధికారులు దృష్టి పెట్టాలి 
  • కార్మికుల సంక్షేమ చర్యలపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా సంక్షోభంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేతన్నలను కష్టకాలంలో ఆదుకున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. నేతన్నకు చేయూత పథకానికి సంబంధించిన పొదుపు డబ్బులను నేత కార్మికులు గడువుకు ముందే తీసుకునేలా ప్రభు త్వం ఇచ్చిన వెసులుబాటు వారికి ఎంతో చేయూతను అందించిందన్నారు. సోమవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని రాష్ట్ర హస్తకళాభివృద్ధి సంస్థ  కార్యాలయంలో చేనేత, పవర్‌లూం కార్మికుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నేతన్నకు చేయూత పథకంలో భాగంగా డబ్బులు వెనక్కి తీసుకోవడం ద్వారా రాష్ట్రంలోని సుమారు 25వేల మందికి లబ్ధి చేకూరిందని కేటీఆర్‌ తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రభు త్వం చేనేత కార్మికులు చెల్లించిన పొదుపు మొత్తానికి రెట్టింపు, పవర్‌ లూం కార్మికుల వాటాకు సమానంగా ప్రత్యేక అకౌంట్లలో జమచేసిందని చెప్పారు. మూడేండ్ల లాక్‌ఇన్‌ పీరియడ్‌ ఉండగా, కరోనా నేపథ్యంలో ముందే డబ్బు తీసుకునే వె సులుబాటు కల్పించామన్నారు. చేనేత కార్మికులకు రూ.96.43 కోట్లు, పవర్‌లూం కార్మికులకు రూ.13 కోట్లు మొత్తంగా రూ.110కోట్ల నిధులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. కష్టకాలంలో ప్రభుత్వం తమ పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు అనేకమంది నేరుగా తనకు మెసేజ్‌లు పంపిస్తున్నారని కేటీఆర్‌ చెప్పారు. ఈ పథకాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని కోరుతున్నారని తెలిపారు. 

పండుగకు వారం రోజులు ముందుగానే

బతుకమ్మ చీరెలను పండుగకు కనీసం వారం ముందే పంపిణీ చేయాలని మంత్రి కేటీఆర్‌ అధికారులకు సూచించారు. బతుకమ్మ చీరెలపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ఇప్పటికే చీరెల తయారీ పూర్తి కావచ్చిందని మంత్రి కేటీఆర్‌కు అధికారులు తెలిపారు. కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా పంపిణీ ఉండేలా కలెక్టర్లు ఆదేశాలు జారీచేయాలని మంత్రి సూచించారు. చేనేత వస్ర్తాల కొనుగోలుకు అనేకమంది అసక్తి చూపుతున్నారని కేటీఆర్‌ అన్నారు. టెస్కో వస్ర్తాలకు మరింత బ్రాండింగ్‌ కల్పించే ప్రయత్నాలను వెంటనే ప్రారంభించాలని సూచించారు. హైదరాబాద్‌ నలువైపులా షోరూంలు ఏర్పాటుచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు.

గోల్కొండ షోరూంను సందర్శించిన మంత్రి 

ముషీరాబాద్‌లోని గోల్కొండ హస్తకళ అభివృద్ధి సంస్థ షో రూంను మంత్రి కేటీఆర్‌ సందర్శించారు. చేనేత వస్ర్తాలు, హస్తకళల వస్తువులు, నిర్మల్‌ పెయింటింగ్స్‌ను పరిశీలించారు. షోరూం వెనుక ఉన్న కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ను సందర్శించి అక్కడ కళాకారులతో మాట్లాడి, వారి యోగక్షేమాలను వాకబుచేశారు. సమావేశంలో హస్తకళాభివృద్ధి సంస్థ చైర్మన్‌ బొల్లం సంపత్‌కుమార్‌, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, చేనేత జౌళిశాఖ డైరెక్టర్‌ శైలజా రామయ్యర్‌ తదితరులు పాల్గొన్నారు. logo