సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 15, 2020 , 18:59:32

వికారాబాద్‌ జిల్లాలోని మున్సిపాలిటీలపై కేటీఆర్‌ సమీక్ష

వికారాబాద్‌ జిల్లాలోని మున్సిపాలిటీలపై కేటీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌ : వికారాబాద్‌ జిల్లాలోని మున్సిపాలిటీలపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీతో పాటు పురపాలక కమిషనర్లు హాజరయ్యారు. గతవారం కోస్గి, కొడంగల్‌ మున్సిపాలిటీపైన చర్చించిన కేటీఆర్‌.. నేడు వికారాబాద్‌, తాండూర్‌, పరిగి మున్సిపాలిటీలపై సుదీర్ఘరంగా చర్చించారు. 

ఈ మూడు మున్సిపాలిటీల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మంత్రి తెలుసుకున్నారు. మున్సిపాలిటీల్లో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్లను కేటీఆర్‌ ఆదేశించారు. ఆయా పట్టణాల ఆదాయ వనరులు, ఖర్చు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని కేటీఆర్‌.. వికారాబాద్‌ జిల్లా ప్రజాప్రతినిధులను కోరారు. వికారాబాద్‌, తాండూర్‌, పరిగి పట్టణాల్లో పార్కులు, ఫుట్‌పాత్‌లు, రోడ్లు, టాయిలెట్ల నిర్మాణం, స్మశాన వాటికల నిర్మాణ పనులకు సంబంధించి కేటీఆర్‌ పలు సూచనలు చేశారు. 

ఈ సమావేశంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి, వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌ రెడ్డి, మున్సిపాలిటీల చైర్‌పర్సన్లు, జిల్లా కలెక్టర్‌, పురపాలక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


logo