బుధవారం 15 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 18:42:55

నల్లగొండ జిల్లాలోని పురపాలక సంఘాలపై కేటీఆర్‌ సమీక్ష

నల్లగొండ జిల్లాలోని పురపాలక సంఘాలపై కేటీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌ : నల్లగొండ జిల్లాలోని పురపాలక సంఘాలపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశానికి మంత్రి జగదీశ్‌ రెడ్డి, నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, పురపాలక సంఘాల చైర్‌పర్సన్లు, కమిషనర్లు, జిల్లా కలెక్టర్‌తో పాటు అడిషనల్‌ కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌.. పురపాలక సంఘాల పరిధిలోని పట్టణాల్లో రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి కనీస అవసరాలపై ప్రధాన దృష్టి సారించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు.

మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. వర్షాకాలం నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన భవనాలను కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. శిథిల భవనాలు కూలి ప్రమాదాలు జరిగితే ఛైర్మన్లు, కమిషనర్లదే బాధ్యత అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడమే లక్ష్యంగా పురపాలన కొనసాగాలని చెప్పారు. రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. కొత్త పురపాలక చట్టం నిర్దేశించిన విధులను కచ్చితంగా అమలు చేయాలన్నారు. నల్లగొండ, మిర్యాలగూడ పట్టణాల్లో కొనసాగుతున్న భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తి చేసే దిశగా సహకరిస్తామని తెలిపారు. పురపాలికలు స్వచ్ఛ వాహనాలను సమకూర్చుకునే అంశాన్ని పరిశీలించాలని మంత్రి సూచించారు. పట్టణాల్లో మరుగుదొడ్లు, బస్‌బేల నిర్మాణం వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ఈ నెల 29న నల్లగొండ జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటించనున్నారు.   


logo