గురువారం 28 జనవరి 2021
Telangana - Dec 05, 2020 , 16:27:09

కొంపల్లిలో ఐటీ పార్క్ భూసేక‌ర‌ణ‌కు కేటీఆర్ ఆదేశం‌

కొంపల్లిలో ఐటీ పార్క్ భూసేక‌ర‌ణ‌కు కేటీఆర్ ఆదేశం‌

హైదరాబాద్‌ : ఐటీ పరిశ్రమలను నగరంలోని ఇతర ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించడంపై మంత్రి కేటీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. పరిశ్రమలు, ఐటీశాఖలపై ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ శనివారం భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఇప్పటికే మహబూబ్‌నగర్‌, వరంగల్‌, ఖమ్మం నగరాలకు ఐటీ పరిశ్రమల విస్తరణకు ముమ్మర ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వరంగల్‌లో ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. రెండో దశలో మరిన్ని ఐటీ కంపెనీలు వరంగల్‌ నగరంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఒకటి రెండు ప్రముఖ కంపెనీలు త్వరలోనే వరంగల్‌ నగరానికి వస్తాయన్నారు. ఆయా కంపెనీలతో తెలంగాణ ఐటీ శాఖ చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.

 గ్రోత్‌ ఇన్‌ డిస్‌పర్షన్‌ పాలసీకి మంచి స్పందన లభిస్తోందని కేటీఆర్‌ అన్నారు. నాచారం, ఉప్పల్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాలో ఐటీ పార్క్‌ల నిర్మాణంపై సమావేశంలో మంత్రి చర్చించారు. ఐటీ పార్క్‌ల నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించాలని సీఎస్‌ సోమేష్‌కుమార్‌కు ఫోన్‌ చేసి కోరారు. కొంపల్లిలో ఐటీ పార్క్‌ నిర్మాణానికి భూసేకరణ చేయాలని టీఎస్‌ఐఐసీ ఎండీకి ఆదేశాలు జారీచేశారు. అదేవిధంగా మహబూబ్‌నగర్‌ జిల్లా దివిటిపల్లి ప్రాంతంలో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. ఈసారి ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో తెలంగాణ మంచి ర్యాంకింగ్‌ సాధించాలని కేటీఆర్‌ పేర్కొన్నారు. 


logo