మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 14, 2020 , 03:56:23

ప్రతివారం గ్రీన్‌ఫ్రైడే

ప్రతివారం గ్రీన్‌ఫ్రైడే

  • ప్రతి పట్టణం పచ్చగా మారాలి
  • 85 శాతం మొక్కలను కాపాడాలి
  • దోమల నివారణ మొక్కలు నాటాలి
  • స్మృతివనాల ఏర్పాటుకు కార్యాచరణ
  • పుర బడ్జెట్‌లో 10శాతం కేటాయింపు
  • హరితహారం పై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హరితహారం కార్యక్రమంలో భాగంగా అన్ని పట్టణాల్లో ప్రతిశుక్రవారాన్ని గ్రీన్‌ ఫ్రైడేగా పాటించాలని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు విజ్ఞప్తిచేశారు. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న ఆరో విడుత హరితహారంలో పురపాలకశాఖ అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు, ప్రజలు చురుగ్గా పాల్గొనాలని ఆదేశించారు. మున్సిపాలిటీ చైర్మన్లు, మేయర్లు, కమిషనర్లు, జిల్లా అదనపు కలెక్టర్లతో మంత్రి కేటీఆర్‌ శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్‌ చట్టంమేరకు పురపాలికల బడ్జెట్‌లో పదిశాతం నిధులను హరితపట్టణాలుగా మార్చేందుకు వినియోగించాలని సూచించారు. చెట్లను నాటడంతోపాటు వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా పురపాలకశాఖ, కమిషనర్లు, మేయర్లు, చైర్మన్లు, చైర్‌పర్సన్లదే అని చెప్పారు. నాటిన చెట్లలో కనీసం 85శాతం కాపాడాలని కేటీఆర్‌ స్పష్టంచేశారు. ప్రతి శుక్రవారం ‘గ్రీన్‌ఫ్రైడే’గా పాటించి నాటిన చెట్లను సంరక్షించేందుకు ప్రయత్నించాలని చెప్పారు. ఇందుకోసం అవసరమైన నీటి వనరులను సమకూర్చుకోవాలని తెలిపారు. చెత్తను డంప్‌చేసే యార్డులవద్ద సువాసనలు వెదజల్లే మొక్కలు నాటేందుకు ప్రయత్నించాలని చెప్పారు. పట్టణాల్లో మొక్కలను సాధ్యమైనంత ఎత్తయిన ప్రదేశాల్లో నాటడం ద్వారా వాటిని సంరక్షించడం సునాయాసమవుతుందని మంత్రి సూచించారు.

దోమలను తరిమే మొక్కలు నాటాలి

హరితహారంలో దోమలను తరిమే ‘మస్కిటో రిపెల్లెంట్‌' మొక్కలను నాటాలని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. పట్టణాల్లోని ఖాళీ ప్రదేశాల్లో ఒక ట్రీ పార్కును ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం 90 పట్టణాలకు సమీపంలో అటవీ బ్లాకులు ఉన్నాయని, వాటిలో చెట్లు నాటాలని చెప్పారు. గ్రీన్‌ బడ్జెట్‌ వినియోగంపై భవిష్యత్తులో సమీక్ష ఉంటుందని తెలిపారు. అందువల్ల హరితహారం కార్యక్రమాన్ని లేదా గ్రీన్‌ బడ్జెట్‌ను చిన్నచూపు చూడరాదని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. ప్రతి పట్టణంలో స్మృతివనాల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. హరితహారం కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు మున్సిపల్‌శాఖ డైరెక్టరేట్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించి, నిరంతరం సమీక్షించాలని సూచించారు.

రూ.1000 కోట్ల మేరకు నిధులు

గతానికి భిన్నంగా ప్రతినెలా ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులను ప్రభుత్వం నేరుగా పురపాలికలకు అందిస్తున్నదని, ఇప్పటివరకు సుమారు రూ.1000 కోట్ల నిధులు ఇచ్చామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ సహా అన్ని కార్పొరేషన్లకు ప్రతినెల రూ.148 కోట్ల చొప్పున నేరుగా అందిస్తున్నామని చెప్పారు. ఈ నిధులతో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. వానకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్‌ వ్యాధుల నివారణకు కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. ఈ సీజన్‌ మొత్తం సాధారణంగా చేసే పారిశుద్ధ్యం కంటే అదనంగా నాలుగు రెట్లు ఎక్కువ కార్యక్రమాలను చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ పనుల్లో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రయత్నించాలని చెప్పారు. ఇందులో భాగంగానే ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాల పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నామని మంత్రి గుర్తుచేశారు. ఈ ఆదివారం జరిగే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు సహా ప్రతి    ఒక్కరూ పాల్గొనాలని కోరారు. వానకాలంలోనే కాకుండా మురికి కాల్వలు, వాననీటి కాల్వల పూడికతీత పనులను నిరంతరం కొనసాగించాలని సూచించారు. వానకాలంలో నీళ్లు నిలిచిపోయే ప్రాంతాలు, వాటర్‌ లాగింగ్‌ పాయింట్లు, మ్యాన్‌హోళ్ల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటుచేయాలని ఆదేశాలు జారీచేశారు. 

ఇల్లందు చైర్మన్‌, కమిషనర్‌కు ప్రశంస

ఇల్లందు మున్సిపల్‌ చైర్మన్‌ దమ్మలపాటి వెంకటేశ్వరరావును, కమిషనర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రత్యేకంగా ప్రశంసించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించిన తీరుపైన వారు పూర్తి వివరాలతో ఒక నివేదికను రూపొందించి మంత్రికి పంపించారు. ఈ సందర్భంగా వారు చేసిన ప్రయత్నానికి అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్‌, ఇదే తీరున ప్రతి పట్టణం తాము చేపట్టిన కార్యక్రమాలపై ఒక నివేదికను రూపొందించాలన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టడానికి ముందు, ఆ తర్వాత పరిస్థితులపై నివేదికను రూపొందించడం ద్వారా ప్రభుత్వం చేసిన పనులు ప్రజలకు తెలుస్తాయని మంత్రి అభిప్రాయపడ్డారు.

పట్టణ హరితహారం ప్రత్యేకాధికారిగా వెంకటేశ్‌?

రెండుమూడ్రోజుల్లో అధికారిక ఉత్తర్వులు!

రాష్ట్ర ప్రభుత్వం పట్టణ హరితహారం కార్యక్రమం పర్యవేక్షణ కోసం ప్రత్యేకాధికారిగా వెంకటేశ్‌ను నియమించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అటవీశాఖలో డీఎఫ్‌వోగా పనిచేస్తున్న ఈయనకు బాధ్యతలు అప్పగించనున్నట్టు సమాచారం. దీనిపై రెండు, మూడ్రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నది. పట్టణ హరితహారానికి ప్రత్యేకాధికారిని నియమించాలన్న మంత్రి కేటీఆర్‌ సూచనలకు ప్రభుత్వం స్పందించి ఈ మేరకు నిర్ణయించిందని సమాచారం. ఈ నెల 20నుంచి పురపాలికల్లో ప్రారంభమయ్యే హరితహారంపై ప్రత్యేకాధికారి ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు. పట్టణాధికారులకు నిత్యం అందుబాటులో ఉంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నారు. పట్టణాల్లోని నర్సరీలు, పార్కుల అభివృద్ధి తదితరవాటిపై దృష్టిసారిస్తారు. పట్టణ ప్రాంతాలను హరితమయం చేసేందుకు ఆయన ప్రణాళికలను రూపొందించనున్నారు. 


logo