సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 01:46:19

అవసరాలకు తగ్గట్టు సిబ్బంది

అవసరాలకు తగ్గట్టు సిబ్బంది

  • మున్సిపాలిటీల్లో ఖాళీల భర్తీపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పెరుగుతున్న పట్టణీకరణ, పట్టణాల భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని కేటాయిస్తామని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. మున్సిపాలిటీల్లో ఖాళీల భర్తీపై మంగళవారం తన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.  పట్టణాల్లో మార్పు లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నదని పేర్కొన్నారు. ఇప్పుడున్న సిబ్బందిని క్రమబద్ధీకరించి, తర్వాత అవసరాలమేరకు కొత్త సిబ్బందిని నియమిస్తామని వివరించారు. ఇంజినీరింగ్‌, మౌలిక సదుపాయాల విభాగాలకు ఖాళీల భర్తీలో అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. పరిపాలన వికేంద్రీకరణ స్ఫూర్తిమేరకు ప్రజలకు పాలన ఫలాలు అందాలని చెప్పారు.

కొత్త పురపాలక చట్టం నియమ, నిబంధనల మేరకు ప్రజలకు మరింత సౌకర్యవంతమైన పాలన అందించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. హైదరాబాద్‌, ఔటర్‌ రింగ్‌రోడ్డు పరిసర మున్సిపాలిటీలు, జిల్లా కేంద్రాల్లో సిబ్బంది అవసరం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అందుకు తగిన ప్రణాళికలు సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో మున్సిపల్‌ వ్యవహారాలు, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


logo