శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 09, 2020 , 20:14:22

హైదరాబాద్‌లో రోడ్ల నిర్మాణంపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌లో రోడ్ల నిర్మాణంపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌ :  నగరంలో వివిధ ప్రాజెక్టుల కింద చేపడుతున్న రోడ్ల నిర్మాణం, విస్తరణ పనులపై పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రగతి భవన్లో గురువారం అధికారులతో సమీక్షించారు. జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులతోపాటు కమిషనర్, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, నగర మేయర్ బొంతు రామ్మోహన్ హాజరయ్యారు. ప్రస్తుతం ఎస్సార్డీపీ పనులు వేగంగా కొనసాగుతున్నాయని త్వరలో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నగరంలో రోడ్ల విస్తరణ, నిర్మాణం చేపట్టాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు.

నగరాన్ని నాలుగుజోన్లుగా విభజించి ఒక్కో జోన్లో ప్రస్తుతం ఉన్న రోడ్లతోపాటు భవిష్యత్తులో నిర్మించాల్సినవి, విస్తరించాల్సినవి గుర్తించి నివేదిక అందించాలని ఆదేశించారు. నివేదికలో ప్రస్తుత రోడ్లతోపాటు భవిష్యత్తులో ఏర్పడే జంక్షన్లు, బస్‌ బేలు, టాయిలెట్ల ప్రతిపాదనలు ఉండాలన్నారు. రోడ్డు నిర్మాణ కన్సల్టెంట్లు, సంస్థతో కలిసి నెలరోజుల్లోగా ప్రాథమిక నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. నగరంలోని ప్రతి వంద ఫీట్లరోడ్ల వెంట మొక్కలు పెంచాలని కమిషనర్ లోకేశ్‌కుమార్‌ను ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న గ్రిడ్ రోడ్లు, రేడియల్ రోడ్లు, మిస్సింగ్, లింకు రోడ్ల నిర్మాణ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొదటి దశలో చేపట్టిన 23 లింకు రోడ్ల నిర్మాణం ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం చేపట్టిన సీఆర్ఎంపీ రోడ్ల నిర్వహణ సత్ఫలితాలను ఇస్తున్నదని పేర్కొన్నారు. జూన్లో అధిక వర్షపాతం నమోదైనా రోడ్లకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా రాలేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. 


logo