సోమవారం 13 జూలై 2020
Telangana - Feb 05, 2020 , 19:07:57

మెట్రో మూడో కారిడార్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి కేటీఆర్ సమీక్ష..

మెట్రో మూడో కారిడార్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి కేటీఆర్ సమీక్ష..

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈనెల 7వ తేదీన ప్రారంభించనున్న జేబీఎస్-ఎంజిబీఎస్ మెట్రోరైలు కారిడార్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రగతిభవన్ లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతురామ్మోహాన్, హైదరాబాద్ మెట్రోరైల్, జీహెచ్ ఎంసీ, పురపాలక శాఖ అధికారులు, నగర పోలీస్ కమీషనర్, ఎల్ అండ్ టీ ప్రతినిధులు హజరయ్యారు. 7వ తేదీన ముఖ్యమంత్రి ప్రారంభించే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలనీ, ఇందుకోసం తీసుకునే చర్యలపైన వారు చర్చించారు. ఆ రోజు జరిగే కార్యక్రమంలో కారిడార్ పరిధిలోని ప్రజాప్రతినిధులతోపాటు, నగర ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కార్యక్రమం సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మెట్రో అధికారులను మంత్రి అదేశించారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ (పిపిపి) మెట్రోరైల్ ప్రాజెక్టనీ, దీని నిర్మాణంలో అందుకున్న మైలురాళ్లు, అవార్డుల వంటి అంశాలను ప్రజలకు తెలియజేయాలని ఈసందర్భంగా మంత్రి అధికారులకు సూచించారు. మూడో మెట్రో కారిడార్ ప్రారంభంతో హైదారాబాద్ మెట్రో రైల్.. దేశంలోనే  రెండవ అతిపెద్ద మెట్రో నెట్ వర్క్ గా అవతరిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. మెట్రోరైల్ ప్రాజెక్టు తాలూకు సమగ్ర వివరాలు, ప్రస్తుతం మెట్రోరైల్ ద్వారా ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, గణాంకాలతో కూడిన వివరాలు సిద్దంగా ఉంచాలని మంత్రి మెట్రో అధికారులను ఆదేశించారు.


logo