మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 02:59:51

పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం

పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం

  • రహదారుల నిర్వహణపై దృష్టి సారించాలి
  • పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు
  • కరీంనగర్‌, నిజామాబాద్‌ కార్పొరేషన్లపై సమీక్ష

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌, నిజామాబాద్‌ కార్పొరేషన్లలో పారిశుద్ధ్యం, రోడ్ల నిర్వహణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని మున్సిపల్‌ కాంప్లెక్స్‌లో కరీంనగర్‌, నిజామాబాద్‌ కార్పొరేషన్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. కార్పొరేషన్ల పరిధిలోని పౌరుల కనీస అవసరాలను తీర్చడంపై దృష్టి సారించాలని సూచించారు. పట్టణాల్లో శ్మశానవాటికలు, పార్కులు, జంక్షన్లను అభివృద్ధి చేయాలని తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన నిర్మాణాలను  కూల్చివేయాలని పేర్కొన్నారు. 

కరీంనగర్‌, నిజామాబాద్‌ నగరాల వాటర్‌ మ్యాప్‌ను సిద్ధంచేయాలని చెప్పారు. ఈ రెండు కార్పొరేషన్ల వాటర్‌, ఎనర్జీ ఆడిటింగ్‌ను వచ్చే 15 రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. వర్షకాల నేపథ్యంలో ఇంకుడు గుంతల నిర్మాణాలను పెద్దఎత్తున చేపట్టాలన్నారు. నగరాల్లోని ఖాళీ స్థలాలతోపాటు పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు, అవకాశమున్న ప్రతిచోటా వీటిని నిర్మించాలని తెలిపారు. వ్యర్థాల నిర్వహణ పద్ధతులపై సమీక్ష నిర్వహించి ఆనువైన పద్ధతులను అందిపుచ్చుకోవాలని సూచించారు. రెండు నగరాల్లో ఆధునిక జంతు కబేళాలను ఏర్పాటుచేసుకొనే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేయాలని చెప్పారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ అధికారులతోపాటు జిల్లా యంత్రాంగం కరోనా కట్టడి విషయంలో అద్భుతమైన నిబద్ధతను చాటారని ప్రశంసించారు. 

హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమీక్ష తర్వాత స్థానికంగా కార్పొరేషన్లవారీగా ఆయా జిల్లాస్థాయిలో ప్రత్యేక సమావేశాలను నిరంతరం కొనసాగించాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. సీఎం కేసీఆర్‌ హామీ మేరకు నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల కోసం రూ.161 కోట్లు విడుదలచేయాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కోరగా, కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారు. పలు రహదారులు, గృహనిర్మాణాలపై సమీక్షించి పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యేలు సూచించారు. ఈ సమీక్షలో మంత్రి గంగుల కమలాకర్‌, కార్పొరేషన్ల పరిధిలోని ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, గణేశ్‌ గుప్తా, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.   

 కార్పొరేషన్ల పరిధిలోని పౌరుల కనీస అవసరాలను తీర్చడంపై దృష్టి సారించాలి.పట్టణాల్లో శ్మశానవాటికలు, పార్కులు, జంక్షన్లను అభివృద్ధి చేయాలి.  వర్షాకాలం నేపథ్యంలో ఇంకుడు గుంతల నిర్మాణాలను పెద్దఎత్తున చేపట్టాలి.

- కేటీఆర్‌    


logo