బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Aug 15, 2020 , 19:12:42

సూర్యాపేట పద్మశాలీల సమస్యలపై స్పందించిన కేటీఆర్

సూర్యాపేట పద్మశాలీల సమస్యలపై స్పందించిన కేటీఆర్

సిరిసిల్ల : మంత్రి కేటీఆర్ పర్యటన ఉందంటే చాలు చాలా మంది తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు. కేటీఆర్ దృష్టికి సమస్య తీసుకెళ్తే సాధ్యమైనంత వరకు పరిష్కారం అవుతుందనే దీమా ప్రజల్లో ఉన్నది. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో త్రివర్ణ పతాకం ఎగురవేసి వెళ్తుండగా.. ఓ దివ్యాంగ వృద్ధురాలి ఆవేదన మంత్రి కేటీఆర్ ను వెంటనే స్పందించేలా చేసింది.

జెండా ఎగురవేసి వెళ్తున్న క్రమంలో దివ్యాంగ వృద్దురాలు పులి విజయమ్మ (60).. కేటీఆర్ సారూ.. అంటూ గట్టిగా పిలువడంతో ఆమె వద్దకు వెళ్లిన మంత్రి.. సమస్యలేంటని ఆరాతీశారు. పెన్షన్ వస్తుందా? ఇళ్లు ఉందా? అని ప్రశ్నించగా.. సార్ తనకేమీ వద్దు.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని మా పద్మశాలి కులస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారని మా అల్లుడు చెప్పిండు, అక్కడ మగ్గాలు నడవక పస్తులుంటున్నారని, సిరిసిల్లలో పద్మశాలీలను ఆదుకుంటున్నట్లుగా వారిని కూడా ఆదుకోవాలని కోరింది. తన గురించి కాకుండా ఇతర జిల్లాకు చెందిన వారి సమస్యలను ఏకరువు పెట్టడంతో ఆశ్చర్యానికి గురైన మంత్రి కేటీఆర్.. వెంటనే తన పీఏను పిలిచి సూర్యాపేట కలెక్టర్ తో మాట్లాడి మానుపురం గ్రామంలోని పద్మశాలిల స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని సూచించారు. దాంతో సూర్యాపేట జిల్లాకు చెందిన అధికారులు తిరుమలగిరి మండలానికి క్యూకట్టి అక్కడి పద్మశాలిల సమస్యలపై నివేదిక తయారుచేసే పనిలో పడ్డారు.

ఇదే సమయంలో దివ్యాంగ వృద్దురాలు అద్దె ఇంట్లో ఉంటున్న విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. ఆమె ఇంటికి వెళ్లి స్థితిగతులను ఆరాతీయాలని స్థానిక తాసిల్దార్ కు సూచించారు. దాంతో తాసిల్దార్ అంజన్న విజయమ్మ రెవెన్యూ సిబ్బందితో కలిసి ఆమె ఇంటికి వెళ్లి పరిశీలించారు. విజయమ్మ సమస్యలపై మంత్రికి నివేదించి ఆయన సూచనల మేరకు తగిన న్యాయం చేస్తామని రెవెన్యూ అధికారులు చెప్పారు. దివ్యాంగ వృద్దురాలు విజయమ్మ తన గురించి కాకుండా పొరుగు జిల్లాలోని తన కులస్తుల బాగు గురించి మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి.. మంత్రి కేటీఆర్ తో పాటు అక్కడున్న అధికారులు, నాయకుల మనుసుల్ని గెలుచుకున్నారు. తోటి వారి గురించి విజయమ్మ మాదిరిగా అందరూ స్పందిస్తే సమాజం బాగుపడుతుందని పలువురు ఆమెను అభినందిస్తున్నారు. తాజావార్తలు


logo