శనివారం 28 మార్చి 2020
Telangana - Mar 05, 2020 , 02:44:48

కరోనాపై జంగ్‌ సైరన్‌

కరోనాపై జంగ్‌ సైరన్‌

కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ప్రాథమికదశలోనే తుంచేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులకు తగిన ఆదేశాలిస్తున్నారు. కొవిడ్‌-19 వ్యాప్తి నిరోధానికి రూ.వంద కోట్లను కేటాయించారు. మంత్రులు, అధికారులను అప్రమత్తంచేశారు. కొవిడ్‌-19ను పారదోలడానికి వైద్య ఆరోగ్యశాఖ, ఐటీ, సైబరాబాద్‌ సెక్యూరిటీసెల్‌ సహా పలు ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో, ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాయి. ప్రజలకు సహకరించడానికి 104 సేవలు అందుబాటులోకి వచ్చాయి. వ్యాధి వ్యాప్తినిరోధంలో ప్రజలు సహకరించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పిలుపునిచ్చారు. తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు.

 • వైరస్‌ నిరోధానికి యుద్ధప్రాతిపదికన చర్యలు
 • గాంధీ హాస్పిటల్‌తోపాటు ప్రైవేటు దవాఖానల్లో ఐసొలేషన్‌ కేంద్రాలు
 • విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు
 • వైరస్‌పై ఆందోళన అవసరంలేదు
 • పుణె నుంచి త్వరలో ఇద్దరి నివేదికలు
 • వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌
 • నిరంతరం అందుబాటులో డయల్‌ 104
 • ఐటీరంగం అప్రమత్తం.. అవసరమైతేనే టెకీల ప్రయాణాలు
 • ప్రత్యేక నోడల్‌ అధికారిగా సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌
 • ఐటీ సిబ్బందికి ఇబ్బంది లేదు
 • సంస్ధలు మూతపడలేదు
 • ఐటీ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. అనుమానిత లక్షణాలున్న 36 మందికి బుధవారం వైద్యపరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. మరోవైపు కరోనా పాజిటివ్‌ బాధితుడు గాంధీ దవాఖానలో కోలుకుంటున్నట్లు వెల్లడించింది. సింగపూర్‌, థాయ్‌లాండ్‌, హాంకాంగ్‌, జపాన్‌, దక్షిణకొరియా, వియత్నాం, మలేసియా, నేపాల్‌, ఇండోనేషియా, ఇరాన్‌, ఇటలీ, అమెరికా, దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న ప్రయాణికులను శంషాబాద్‌ విమానాశ్రయంలో స్క్రీనింగ్‌ చేస్తున్నారు. 


పుణెకు రెండు శాంపిళ్లు

కరోనా లక్షణాలు కనిపించిన ఇద్దరు వ్యక్తుల శాంపిళ్లను ఆరోగ్యశాఖ అధికారులు పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపించారు. నివేదికలు వచ్చిన తర్వాతనే వాస్తవ పరిస్థితి స్పష్టమవుతుందని.. ఈలోపు ఎవరూ ఆందోళనకు గురికావాల్సిన పనిలేదని ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది. ప్రజారవాణాకు సంబంధించి మెట్రోరైళ్లు, బస్సులను పరిశుభ్రంగా ఉంచాలంటూ పురపాలకశాఖమంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా అధికారులను ఆదేశించారు. సిబ్బంది.. బస్సులు, రైళ్లను శుభ్రంగా ఉంచేందుకు చర్యలుచేపట్టారు.  బెంగళూరు ఆర్టీసీ తరహాలో బస్సులను శుభ్రంగా ఉంచాలని రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ డిపో మేనేజర్లను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌-19 పట్ల అవగాహన, వైరస్‌ విస్తరణను అరికట్టడంలో భాగంగా పర్యవేక్షణకు ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేశారు. మంత్రి ఈటల రాజేందర్‌ చైర్మన్‌గా రాష్ట్ర స్థాయి కమిటీ పనిచేస్తుంది.


ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు

క్వారంటైన్‌ నిమిత్తం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా క్యాంపును ఏర్పాటుచేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటి సామర్థ్యం దాదాపు మూడు వందలుగా పేర్కొన్నది. రక్షణశాఖ పరిధిలోని ఆర్మీ, వాయుసేన కేంద్రాల్లో రెండువందల మందికి సరిపడా క్వారంటైన్‌ గదుల్ని ఏర్పాటుచేశారు. రాష్ట్రంలో దాదాపు 331 మంది ప్రయాణికులను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తాజాగా తెలిపింది. అనుమానితులను పరీక్షించేందుకు 12 దవాఖానలను ఎంపికచేశారు. 325 బెడ్లను సిద్ధం చేశారు. 20 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి. 917 పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌, ఎన్‌95 మాస్కులు సిద్ధపరిచామని కేంద్రం ప్రకటించింది. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారాన్ని చేపడుతూ ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. 


ఎక్కడైనా చికిత్స..

కరోనా వ్యాధి నిర్ధారణ గాంధీ దవాఖానలో చేసినప్పటికీ.. చికిత్స మాత్రం ఐసొలేషన్‌ వార్డులున్న ప్రైవేట్‌ దవాఖానల్లో చేయించుకొనేందుకు అనుమతించినట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. వరంగల్‌లో ఐసొలేషన్‌ వార్డును ఏర్పాటుచేస్తున్నామన్నారు. మాదాపూర్‌ మైండ్‌స్పేస్‌లోని 20వ భవనంలో డీఎంఎస్‌ సంస్థ ఉద్యోగినికి కరోనా వచ్చినట్లు వార్తలు రావడంతో ప్రభుత సూచనల మేరకు.. సంస్థ అధికారులు తక్షణ చర్యలకు పూనుకొన్నారు. సిబ్బందిని ఖాళీచేయించి.. భవనాన్ని పూర్తిగా శుభ్రపరిచారు. 


ఐటీ సంస్థలు అప్రమత్తం

కొవిడ్‌-19 వ్యాప్తి నిరోధంపై హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. ఇంటెల్‌ కంపెనీ ఉద్యోగికి కరోనా లక్షణాలు ఉన్నట్లు కనిపించడంతో ఆ ఉద్యోగిని ప్రత్యేక పరిశీలనలో ఉంచామని సంస్థ తెలిపింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఉద్యోగులను ఇంటివద్ద నుంచే పనిచేయాలని పలు కంపెనీలు సూచించాయి. ఉద్యోగుల ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతోపాటు.. కార్యాలయాల్లో పరిశుభ్ర వాతావరణం ఉండేలా చర్యలు చేపట్టాయి. కార్యాలయాలకు వచ్చే  ఉద్యోగులను పలు సంస్థలు స్క్రీనింగ్‌టెస్టులు చేస్తున్నాయి. ఉద్యోగులు అత్యవసరమనుకొంటేనే ప్రయాణాలు చేయాలని తన ఉద్యోగులకు ట్విట్టర్‌ సంస్థ సూచించింది. ప్రయాణాలకు దూరంగా ఉండాలని టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ కూడా తమ ఉద్యోగులను కోరాయి. ఢిల్లీ జెఎన్‌యూలో బయో మెట్రిక్‌ హాజరు పట్టికను రద్దుచేసి సాధారణ అటెండెన్స్‌ రిజిస్టర్‌ను ఏర్పాటుచేశారు. 


మైండ్‌స్పేస్‌లో ఆందోళన

హైదరాబాద్‌లోని రహేజా మైండ్‌స్పేస్‌లోని డీఎస్‌ఎం ఐటీ కంపెనీకి చెందిన ఉద్యోగినికి కరోనా లక్షణాలు కనిపించడంతో తెలంగాణ ఐటీశాఖ, సొసైటీ ఫర్‌ సైబర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్సీఎస్సీ) అప్రమత్తమయ్యాయి. డీఎస్‌ఎం కంపెనీకి చెందిన ఉద్యోగినికి కరోనా లక్షణాలుండటంతో ఆమె శాంపిల్‌ను పుణెకు పంపించారు. అక్కడినుంచి నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టత వస్తుందని ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు తెలిపారు. బాధిత ఉద్యోగిని గత నెల 28 నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ ఉద్యోగిని కుటుంబ సభ్యులు కూడా క్షేమంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులందరూ ఇంటినుంచే పనిచేయాలని డీఎస్‌ఎం సూచించింది. 


ఆందోళన చెందాల్సిన పనిలేదు

కరోనా గురించి భయపడాల్సిన అవసరంలేదు. ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ప్రజలు సమూహంగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి. 

- కృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎస్సీఎస్సీ


విదేశీ ప్రయాణాల్లో శ్రద్ధ అవసరం

ఐటీ రంగంలోనే ఎక్కువగా విదేశీ క్లయింట్లతో సమావేశాలు, ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. టెకీలకు మాస్కులు, ఇతర అత్యవసర వైద్యసేవలను అందించాలని ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ను కోరాం.  

- సందీప్‌కుమార్‌ మక్తాలా, టీటా గ్లోబల్‌ ప్రెసిడెంట్‌


పరిశుభ్రంగా మెట్రో, ఆర్టీసీ బస్సులు 

 • ట్విట్టర్‌ ద్వారా అధికారులకు మంత్రి  కేటీఆర్‌ సూచన


కరోనా వైరస్‌ విస్తరణను అరికట్టేందుకు మెట్రోరైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో ప్రతిరోజు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని మంత్రి కే తారకరామారావు అధికారులకు సూచించారు. బస్సులలోపల శుభ్రంగా ఉంచాలని బెంగళూరులోని అన్ని డిపోలకు ఆ రాష్ట్ర ఆర్టీసీ సర్క్యులర్‌ జారీచేసింది. బస్సుల డోర్లను, చేతులు ఉంచే ఆర్మ్‌రెస్ట్‌లను క్లోరిన్‌ ఆధారిత క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయిస్తున్నది. దీనిపై ట్విట్టర్‌ ద్వారా స్పందించిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ మెట్రోరైళ్లలోనూ ఈ విధమైన చర్యలు తీసుకోవాలని మెట్రో రైల్‌ ఎండీకి సూచించారు. అలాగే బస్సుల్లో పరిశుభ్రత పాటించేవిధంగా టీఎస్‌ ఆర్టీసీకి ఆదేశాలు జారీచేయాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.


మాస్కుతో హీరో ప్రభాస్‌


తాను నటిస్తున్న తాజా చిత్రం షెడ్యూల్‌ యూరప్‌లో జరుగుతుండటంతో బుధవారం అక్కడికి వెళ్లేందుకు ముఖానికి మాస్కుతో శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చిన సినీహీరో ప్రభాస్‌


36 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు

కరోనా వ్యాధి నియంత్రణలో భాగంగా అనుమానిత లక్షణాలున్న 36 మందికి బుధవారం వైద్యపరీక్షలు చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక బులెటిన్‌ ద్వారా వెల్లడించింది. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇప్పటివరకు 18,667 మందికి థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేశామని తెలిపింది. బుధవారం ఒక్కరోజే 4,123 మందికి ఎయిర్‌పోర్టులో థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశామని, 87 మంది ప్రయాణికులు స్వచ్ఛందంగా వచ్చి పరీక్షలు చేయించుకున్నారని పేర్కొంది. ఇప్పటివరకు కొవిడ్‌-19 అనుమానిత లక్షణాలున్న 193 మందికి వ్యాధినిర్ధారణ పరీక్షలు చేయగా అందులో ఒక్క పాజిటివ్‌ కేసు నమోదైందని, 149 మందికి వ్యాధి లక్షణాల్లేవని తేలిందని తెలిపింది. కాగా 43 మందికి సంబంధించిన నివేదికలు రావాల్సి ఉందని పేర్కొంది.


15 నాటి అమిత్‌షా సభ రద్దు

కరోనా (కోవిడ్‌-19) వైరస్‌తో మనిషిని మనిషి తాకాలంటే భయపడుతున్నారు. దీంతో ప్రజలు సామూహిక వేడుకలు, సంబరాలకు దూరంగా ఉంటున్నారు. నలుగురిలో కలిసి మాట్లాడటానికి జంకుతున్నారు. పలువురు శుభకార్యాలకు కూడా హాజరుకావడం లేదు. ప్రధాని మోదీ హోలీ వంటి సామూహిక ఉత్సవాలకు దూరంగా ఉండాలని పిలుపునివ్వగా.. రాజకీయపార్టీలు బహిరంగసభలను రద్దు చేసుకుంటున్నాయి. సీఏఏకు అనుకూలంగా బీజేపీ ఈనెల15న ఎల్బీ స్టేడియంలో జరుపతలపెట్టిన బహిరంగసభను రద్దుచేసుకున్నది. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరుకావాల్సి ఉన్నది. ఇదేతీరులో సెలబ్రిటీలు తమ కార్యక్రమాలను రద్దు చేసుకుని ఇండ్లకే పరిమితమవుతున్నారు. కొన్ని ఐటీ కంపెనీలు, కార్యాలయాలు సెలవులను ప్రకటిస్తున్నాయి.


ఇవీ వాస్తవాలు

 • చైనా సహా ప్రపంచవ్యాప్తంగా లక్షమందికిపైగా వైరస్‌తో బాధపడుతున్నారు.
 • మృత్యువాత పడింది 3% లోపే. 
 • వైరస్‌కు గురైనవారిలో 5% మందికే దాని ప్రభావం తీవ్రంగా ఉన్నది.
 • వైరస్‌కు గురైన వ్యక్తి ఆరోగ్యవంతులకు రెండు మీటర్ల దగ్గరగా ఉంటేనే వైరస్‌ సోకుతుంది. 
 • అదికూడా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికే అంటుతుంది.
 • వ్యాధిగ్రస్థుడు తుమ్మినా, దగ్గినా నోటినుంచి వెలువడే తుంపర్లే ప్రమాదకరం.
 • తుంపర్లలోని వైరస్‌ 12 గంటల తర్వాత దానికదే నిర్జీవమవుతుంది.
 • కరోనా వైరస్‌ కణాలు చాలా పెద్దవి. సుమారు 400-500 మైక్రో సైజులో కలిగి ఉంటాయి. ఏ మాస్క్‌ వాడినా కరోనా దరిచేరదు. 
 • ఈ వైరస్‌ గాలిలో ఉండిపోదు. వెంటనే నేలని చేరుతుంది.  గాలి ద్వారా వ్యాపించదు.
 • కరోనా వైరస్‌ దుస్తుల మీద 9 గంటలు మాత్రమే ఉంటుంది. దుస్తులు ఉతికినా, లేదా ఎండలో రెండు గంటలు ఆరేసినా కరోనా వైరస్‌ను అరికట్టినట్టే.
 • ఈ వైరస్‌ చేతులపై 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. స్పిరిట్‌ ఆధారిత స్టెరిలైజర్‌ని ఎప్పుడూ వెంట ఉంచుకోవడం మంచిది.  
 • కరోనా వైరస్‌ 37 డిగ్రీల పైబడిన ఉష్ణోగ్రతలో బతుకలేదు.logo