ఆదివారం 06 డిసెంబర్ 2020
Telangana - Nov 21, 2020 , 01:38:32

ఆరేండ్లలో 67,351 కోట్లు

ఆరేండ్లలో 67,351 కోట్లు

  • హైదరాబాద్‌కు అంతర్జాతీయ సొబగుల కోసం ఖర్చు   
  • సకల సౌకర్యాలతో అంతర్జాతీయ నగరంగా అవతరణ
  • గతంలో ఎన్నడూ లేనంత శ్రద్ధతో నగరం అభివృద్ధి  
  • హైదరాబాద్‌ ప్రగతి నివేదికను విడుదల చేసిన కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: స్వరాష్ట్రంలో రాజధాని హైదరాబాద్‌ నగర ఖ్యాతి విశ్వవ్యాప్తమవుతున్నది. భాగ్యనగరాన్ని విశ్వనగరంగా మలచడానికి తొలి అడుగు విజయవంతంగా పడింది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అక్షరాలా రూ.67, 351.16 కోట్లను ఖర్చుచేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ ఇంత భారీ స్థాయిలో నిధులను ప్రభుత్వాలు హైదరాబాద్‌ కోసం ఖర్చు చేయలేదు. భారీ, మాధ్యమిక, చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు, సేవల సంస్థలకు వేదిక అయిన హైదరాబాద్‌ ఆర్థిక వ్యవస్థ అక్షరాలా 74 బిలయన్‌ డాలర్లు. గడిచిన ఆరేండ్లలో హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధిపై పురపాలక శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రగతి నివేదికను శుక్రవారం విడుదల చేశారు. ఆ విశేషాలు కేటీఆర్‌ మాటల్లోనే..  

మన మెట్రో.. ప్రపంచంలోనే అతిపెద్దది

పబ్లిక్‌ ప్రైవేటు పార్టనర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో హైదరాబాద్‌ నగరంలో నిర్మించిన మెట్రోరైల్‌ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద మెట్రో నెట్‌వర్క్‌లలో ఒకటి. 72 కిలోమీటర్ల పొడవు 66 స్టేషన్లతో నిర్మించిన ఈ వ్యవస్థకు మొత్తం రూ. 17,290.31 కోట్లు ఖర్చు చేశాం. అలాగే రూ.16,622.63 కోట్లతో వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రణాళిక (ఎస్సార్డీపీ), నమూనా రహదారి కారిడార్లు, అనుసంధాన రోడ్లు, సమగ్ర రహదారి నిర్వహణ కార్యక్రమం (సీఆర్‌ఎంపీ), హైవే ట్రాఫిక్‌ నిర్వహణ వ్యవస్థ (హెచ్‌టీఎంఎస్‌), ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టు (ఓఆర్‌ఆర్‌)లతో ప్రధాన రద్దీ ప్రాంతాలను సిగ్నల్‌ ఫ్రీగా మార్చాం. వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రణాళికలో భాగంగా రూ. 8,410 కోట్లతో ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించాం. దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్‌ వంతెన ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ట్రా డోస్డ్‌ కేబుల్‌ బ్రిడ్జి. దీని పొడవు 233.85 మీటర్లు. ఎస్సార్డీపీలో భాగంగా 9 ఫ్లై ఓవర్లు, 4 అండర్‌పాస్‌లు, 3 రోడ్డు ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేశారు. స్వచ్ఛ హైదరాబాద్‌ కోసం రూ.1716.33 కోట్లను ఖర్చు చేశాం. 

విపత్తుల నిర్వహణ కోసం

విపత్తు నిర్వహణ కోసం ప్రత్యేకంగా రూ.15 కోట్లను వెచ్చించి డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. విపత్తుల సమయంలో సహాయ చర్యల కోసం 360 మంది సిబ్బంది పని చేస్తున్నారు. గ్రీన్‌ హైదరాబాద్‌లో భాగంగా రూ.332.70 కోట్లతో హెచ్‌ఎండీఏ పరిధిలో 807 లక్షల మొక్కలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో 486 లక్షల మొక్కలను నాటాం.రూ.250 కోట్లతో 934 పార్కులు నిర్మించాం. ఔటర్‌ రింగ్‌ రోడ్డును 3,309.71 కోట్లతో పూర్తిచేశాం. తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి కోసం ప్రభుత్వం రూ.14,175.30 కోట్లు ఖర్చు చేశాం. 

దిగజారుడు మాటలు మానుకో 

  • బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్‌ హితవు

బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని, సీఎం కేసీఆర్‌పై నిఘా ఉంచాలని బండి చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ‘ముఖ్యమంత్రికి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే నిరాధారమైన ఆరోపణ ద్వారా మీరు ఎంత దిగజారిపోయారో అర్థమవుతున్నది. దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలి’ అని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులు ఎంత అసంబద్ధమైన, అశాస్త్రీయమైన, హాస్యాస్పదమైన ఆరోపణలు చేసినా తాము పట్టించుకోబోమని స్పష్టంచేశారు. బీజేపీ ఎంత దిగజారుడు రాజకీయాలు చేసినా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు మాత్రం హుందాగా ఎన్నికలను ఎదుర్కొంటారని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

ప్రపంచ స్థాయి శాంతిభద్రతలు...

హైదరాబాద్‌లో శాంతిభద్రతల కోసం రూ.1940.33 కోట్లను ఖర్చు చేశాం. రూ.9,700 కోట్లతో దేశంలోనే మొదటి సారిగా పేదల కోసం లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను నిర్మిస్తున్నాం. 430 కిలోమీటర్ల మేర పాదచారుల కోసం ప్రత్యేకంగా ఫుట్‌పాత్‌లు నిర్మించారు. పరిశ్రమలు, ఐటీ, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించిన ప్రభుత్వం టీఎస్‌ఐపాస్‌ ద్వారా రూ.2,115.93 కోట్ల పెట్టుబడులను రాబట్టింది. మొత్తంగా రూ.1,96,404 కోట్ల పెట్టుబడుల ఆకర్షించడంతో పాటు 15లక్షల ఉద్యోగాలను కల్పించాం. ప్రపంచ స్థాయి కార్పొరేట్‌ కంపెనీలకు హైదరాబాద్‌ రెండో కేంద్రంగా మారింది. చెరువుల సుందరీకరణ కోసం రూ.376.80 కోట్లు వెచ్చించాం. రూ.30.51 కోట్లతో నగరంలోని మొత్తం 250 బస్తీ దవాఖానలు ఏర్పాటుచేశాం. రూ.152.03 కోట్లతో అన్నపూర్ణ క్యాంటీన్‌లను ఏర్పాటు చేసి రూ.5 కే రుచికరమైన భోజనం అందింస్తున్నారు. రూ.34.66 కోట్లతో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకున్నాం. రూ.100 కోట్లతో వారసత్వ సంపదకు పూర్వవైభవం తీసుకువచ్చాం.