ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 02, 2020 , 02:02:07

ఓటు నమోదులో పట్టభద్రులు

ఓటు నమోదులో పట్టభద్రులు

  • మొదటిరోజే నమోదుచేసుకొన్న మంత్రి కేటీఆర్‌
  • దరఖాస్తులు అందజేసిన పలువురు మంత్రులు
  • ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు కూడా..
  • ఆన్‌లైన్‌లోనూ వెల్లువలా పట్టభద్రుల దరఖాస్తులు

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: వరంగల్‌- నల్లగొండ- ఖమ్మం, హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలోని గురువారం ఓటర్ల నమోదు కార్యక్రమం ప్రారంభమయింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌ ) పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు మొదటిరోజే తన ఓటుహక్కును నమోదు చేసుకున్నారు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఓటుహక్కు కోసం ఆర్డీవో, తాసిల్దార్‌ కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేశారు. ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకొన్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రగతిభవన్‌లో జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌కు ఓటుహక్కు దరఖాస్తు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ..గ్రాడ్యుయేట్లు అందరూ తమ పేరును కచ్చితంగా ఓటరు లిస్ట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హులైనవారందరూ ఓటరుగా నమోదయ్యేలా టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు చొరువ చూపాలని చెప్పారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పాల్గొన్నారు. 

పలువురు ప్రముఖులూ తొలిరోజే..

ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలోని పలువురు ప్రజాప్రతినిధులు తొలిరోజే తమ ఓటుహక్కును నమోదు చేసుకున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు దరఖాస్తులు చేసుకొన్నారు. మంత్రులు మహమూద్‌అలీ, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీలు కే కేశవరావు, రంజిత్‌రెడ్డి, బండా ప్రకాష్‌, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నవీన్‌కుమార్‌, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, కే లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గాదరి కిశోర్‌, శానంపూడి సైదిరెడ్డి, రవీంద్రకుమార్‌ ఓటుహక్కును నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటరు నమోదు అంశంపై గురువారం టీఆర్‌ఎస్‌ సెల్‌ ప్రతినిధులు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌తో చర్చించారు. 


logo