సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 11, 2020 , 13:36:26

రాష్ర్ట పోలీసుల ప‌ని తీరు అద్భుతం : మంత్రి కేటీఆర్

రాష్ర్ట పోలీసుల ప‌ని తీరు అద్భుతం : మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : గ‌త ఆరేళ్ల‌లో రాష్ర్ట పోలీసుల ప‌నితీరు అద్భుతంగా ఉంద‌ని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌శంసించారు. శాంతి భ‌ద్ర‌త‌లు, ర‌క్ష‌ణ విష‌యంలో న‌గ‌రానికి మంచి పేరు తెచ్చారు అని కొనియాడారు. హైద‌రాబాద్‌ను విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్ద‌డంలో పోలీసుల పాత్ర కీల‌క‌మైన‌ది అని తెలిపారు. బంజారాహిల్స్‌లో అధునాత‌న టెక్నాల‌జీతో నిర్మిస్తున్న క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ రెండు నెల‌ల్లో అందుబాటులోకి వ‌స్తుంద‌న్నారు. ఈ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తుంద‌న్నారు. గ‌చ్చిబౌలిలో క‌మాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంట‌ర్‌ను హోంమంత్రి మ‌హ‌మ్మ‌ద్ అలీతో క‌లిసి ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గ‌త ప్ర‌భుత్వాల పాల‌న‌లో ప్ర‌తి సంవ‌త్స‌రం హైద‌రా‌బాద్‌లో ఒక వారం రోజులు క‌ర్ఫ్యూ ఉండేది. ఇప్పుడు క‌ర్ఫ్యూ లేదు. గొడ‌వ‌లు లేవు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ చాలా ప్ర‌శాంతంగా ఉంది. ఇందుకు తెలంగాణ పోలీసుల‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ట్లు మంత్రి ప్ర‌క‌టించారు. 

తెలంగాణ ఏర్ప‌డ్డ‌ప్పుడు ఎన్నో అనుమానాలు, భ‌యాలు ఉండేవి. ఆంధ్రా తెలంగాణ‌, ఆంధ్రా రాయ‌ల‌సీమ గొడ‌వ‌లు, మ‌త ఘ‌ర్ష‌ణ‌లు చెలరేగుతాయని అన్నారు. కానీ తెలంగాణ రాష్ర్టంలో అలాంటి ఘ‌ట‌న‌ల‌కు తావు ఇవ్వ‌లేదు. రాజ‌కీయ సుస్థిర‌త ఉన్న‌ప్ప‌టికీ, ఆర్థిక సుస్థిర‌త లేదు. ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే శాంతిభ‌ద్ర‌త‌లు స‌వ్యంగా ఉండాలి. శాంతిభ‌ద్ర‌త‌లు స‌వ్యంగా లేక‌పోతే.. ఎన్ని పెట్టుబ‌డులు తీసుకొచ్చినా లాభం ఉండ‌దు. ఇవాళ తెలంగాణ‌లో క్రైమ్ త‌గ్గింది. మ‌త ఘ‌ర్ష‌ణ‌లు లేనే లేవు. ప్రాంతీయ విద్వేషాలు, వివ‌క్ష‌త లేదు. ఈ ఆరున్న‌రేళ్ల‌లో రాష్ర్టంలో అనేక మార్పులు వ‌చ్చాయి. 2014లో సీఎం కేసీఆర్ తీసుకున్న కీల‌క నిర్ణ‌యాలే మార్పుల‌కు ప్ర‌ధాన కార‌ణం అని కేటీఆర్ తెలిపారు.

హైద‌రాబాద్‌లో 5 ల‌క్ష‌ల సీసీ కెమెరాలు

తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత రూ. 284 కోట్ల‌తో అత్యాధునిక పోలీసు వాహ‌నాలు కొనుగోలు చేశాం. ఒకనాడు తెలంగాణ‌లో రెండు పోలీసు క‌మిష‌న‌రేట్లు మాత్ర‌మే ఉండేవి. మ‌రో 7 క‌మిష‌న‌రేట్లు ఏర్పాటు చేసుకున్నాం. 100 పోలీసు స్టేష‌న్లు ప్రారంభించుకున్నాం. గ‌త ఆరేళ్ల‌లో పోలీసు శాఖ‌కు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చారు. దేశంలో ఉన్న సీసీ కెమెరాల్లో 65 శాతం హైద‌రాబాద్‌లోనే ఉన్నాయి. హైద‌రాబాద్‌లో 5 ల‌క్ష‌లకు పైగా సీసీ కెమెరాలు ఉన్నాయ‌ని తెలిపారు. దొంగ‌త‌నం చేసేందుకు నేర‌స్తులు భ‌య‌ప‌డుతున్నారు. ఒక వేళ దొంగ‌త‌నం జ‌రిగినా.. కేవ‌లం నాలుగైదు గంట‌ల్లోనే పోలీసులు కేసును ఛేదిస్తున్నారు. దీనికి కార‌ణం సీసీ కెమెరాలు అని తెలిపారు. న‌గ‌రంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్ర‌జ‌లు స‌హ‌క‌రించ‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు. అంబులెన్స్‌ల‌ను త్వ‌ర‌గా ఆస్ప‌త్రికి తీసుకెళ్లే మార్గం ఉంటే క‌నుగొనాల‌ని కేటీఆర్ కోరారు. 

మ‌హిళ‌ల భ‌ద్ర‌త కోసం షీటీమ్స్‌తో పాటు హాక్ ఐ యాప్‌ను రూపొందించారు. మ‌హిళ‌ల భ‌ద్ర‌త కోసం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నాం.. వారి భ‌ద్ర‌త‌కు ఇంకా ఏం చేయాలో ఆలోచించాలి. సైబ‌ర్ క్రైమ్‌ను నియంత్రించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. గ‌త 6 సంవ‌త్స‌రాల నుంచి శాంతిభ‌ద్ర‌త‌ల విష‌యంలో తెలంగాణ పోలీసులు చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తున్నారు. శాంతి భ‌ద్ర‌త‌ల‌కు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్య‌త ఇస్తున్నారు అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.