ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 17, 2020 , 22:13:49

ఉన్న ఊరును, కన్నతల్లిని మరువనోళ్లే గొప్పోళ్లు

ఉన్న ఊరును, కన్నతల్లిని మరువనోళ్లే గొప్పోళ్లు

-దమ్మన్నపేట ‘శ్రీమంతుడి’కి మంత్రి కేటీఆర్‌ అభినందనలు

-సొంతూరు అభివృద్ధికి నర్సింహారెడ్డి విరాళం రూ.25 కోట్లు

-మంత్రి కేటీఆర్‌కు రూ.1.50 కోట్ల చెక్కు అందజేత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పుట్టిన ఊరు మనకు ఎంతో ఇచ్చింది.. ఆ ఊరికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలనే సంకల్పానికి సరైన నిర్వచనం ప్రముఖ కాంట్రాక్టర్‌, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత కామిడి నర్సింహారెడ్డి. కన్నతల్లిదండ్రులను, పుట్టిన గ్రామాన్ని మరువకుండా తగిన సేవ చేస్తేనే జన్మసార్ధకమవుతుందని ఆయన నమ్ముతారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన పుట్టిన ఊరు వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని దమ్మన్నపేట అభివృద్ధికి రూ.25 కోట్లను విరాళంగా ప్రకటించారు. అందులో రూ.1.5 కోట్ల చెక్కును ఆయన సోమవారం రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు ఇంటికి వెళ్లి అందజేశారు. 

ఈ విరాళాన్ని వర్ధన్నపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి వినియోగించాలని కోరారు. ఈ సందర్భంగా కామిడి నర్సింహారెడ్డిని శాలువా కప్పి ఘనంగా సత్కరించిన మంత్రి కేటీఆర్‌.. ఆయన దాతృత్వాన్ని ప్రత్యేకంగా కొనియాడారు. ఉన్న ఊరును, కన్న తల్లిని మరవని వాళ్లే నిజమైన మనుషులని చెప్పారు. నర్సింహారెడ్డి లాగానే ఎన్నారైలు, ఇతర శ్రీమంతులు తమ గ్రామాల అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. నర్సింహారెడ్డి ఔదార్యం ప్రపంచానికే ఆదర్శమని అన్నారు. 

పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నదని, ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. వ్యాపారరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన కామిడి నర్సింహారెడ్డి సీఎం కేసీఆర్‌ చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమానికి ఆకర్షితులై దమ్మన్నపేట గ్రామానికి రూ.25 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. తానివ్వబోయే మిగిలిన నిధులతో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన ప్రణాళికను కేఎన్‌ఆర్‌ స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌, అధికారుల సలహా మేరకు రూపొందించారు. ఇప్పటికే గ్రామంలో కొన్ని అభివృద్ధి పనులు చేపట్టగా, త్వరలోనే మరిన్ని ప్రారంభించేందుకు కేఎన్‌ఆర్‌ సంస్థ ప్రతినిధులు ఏర్పాట్లుచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్‌, జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.


logo