గురువారం 28 జనవరి 2021
Telangana - Nov 27, 2020 , 01:45:50

ట్రంప్‌నూ దింపుతరేమో!

ట్రంప్‌నూ దింపుతరేమో!

  • గల్లీ పోరును ఢిల్లీ ఎన్నికలు చేసిన బీజేపీ
  • ప్రచారానికి మోదీ, అమిత్‌షా, నడ్డా!
  • 1,350 కోట్ల సాయం తీసుకొనే రండి
  • ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్‌ 

మనం కేంద్రానికి పన్నుల ద్వారా 2.72 లక్షల కోట్లు చెల్లిస్తే వాళ్లు మాత్రం మనకు ఇచ్చింది రూ.1.40 లక్షల కోట్లు మాత్రమే. అంటే ఇంకా రూ.1.30 లక్షల కోట్లు బాకీ ఉన్నరు.  తెలంగాణకు రూ.లక్ష కోట్లు ఇచ్చినం అని కేంద్రమంత్రి అమిత్‌ షా అంటుండు. ఎక్కడిచ్చిండో చూపించాలి. మనం చెల్లించిన పన్నులతో ఇతరరాష్ర్టాల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఇతర రాష్ర్టాల అభివృద్ధిలో మన తెలంగాణ ప్రజల చెమట ఉంది. అందుకే ఢిల్లీ పెద్దలు తెలంగాణ ప్రజలకు థ్యాంక్స్‌ చెప్పాలి. 

ఏపీని కూడా బీజేపీ మోసం చేసింది. అమరావతి నిర్మాణానికి తట్టెడు మట్టి, లొట్టెడు నీళ్లిచ్చి మోసం చేశారు. హైదరాబాద్‌లో పేదవాడికి ఢోకా లేకుండా చేశాం. కాంగ్రెసోళ్ల పరిస్థితి ఎటూ కాకుండాపోయింది. తెలంగాణకు టీఆర్‌ఎస్‌ పార్టీ పాలనే శ్రీరామ రక్ష. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం భద్రంగా ఉంటుంది. మతంకాదు.. జనహితం ముఖ్యం. ఉద్వేగాలు కాదు ఉద్యోగాలు ముఖ్యం. అభివృద్ధి వైపా.. అరాచకం వైపా ఆలోచించి ఓటేద్దాం.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ గల్లీలో జరిగే ఎన్నికలను బీజేపీ ఢిల్లీ ఎన్నికలుగా మార్చిందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి హస్తిన నుంచి గుంపులుగా కేంద్రమంత్రులు, ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు వస్తున్నారని, వారు ఉత్తి చేతులతో వస్తే మాత్రం ఇక్కడి ప్రజలు నిలదీస్తారని హెచ్చరించారు. వరదసాయం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ డిమాండ్‌ చేసిన రూ.1,350 కోట్లు తీసుకునే రావాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ సైతం వస్తున్నట్టు సమాచారం ఉన్నదని.. కొద్దిరోజులైతే అమెరికాలో  ఖాళీగాఉన్న డోనాల్డ్‌ ట్రంప్‌ను కూడా తీసుకొస్తారేమోనని ఎద్దేవా చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం అల్వాల్‌లోని ఇందిరాగాంధీ చౌరస్తా, యాప్రాల్‌ అంబేద్కర్‌ చౌరస్తాలో మంత్రి కేటీఆర్‌ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

బీజేపీ, కాంగ్రెస్‌కు ఓటెందుకేయాలో నిలదీయండి

ఈ ఆరేండ్ల పాలనలో కేసీఆర్‌ ప్రభుత్వం రైతాంగానికి, పరిశ్రమలకు, ఇండ్లకు 24 గంటల విద్యుత్‌ను ఇస్తున్నది. పేదలపై ప్రేమతోనే సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లో 20వేల లీటర్ల వరకు నీటిబిల్లు లేకుండా చేశారు. ఈ ఆరేండ్లలో ప్రశాంతంగా హైదరాబాద్‌ ఉన్నది కాబట్టే రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చా యి. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఇట్లా మేంచేసిన వంద పనులు చెప్తాం. కాంగ్రెస్‌, బీజేపీ వాళ్లు గల్లీగల్లీ తిరిగి ఓట్లడుగుతున్నరు. మరి వాళ్లు హైదరాబాద్‌కు ఏం చేసిండ్రో చెప్పమని అడగండి. 

1,350 కోట్ల వరదసాయంతో రండి

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి వరదలా వస్తు న్న కేంద్రమంత్రులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. కేంద్రమంత్రుల్లారా.. వెల్‌కం. హైదరాబాద్‌ బిర్యానీ తిని వెళ్లండి కానీ ఉట్టి చేతులు ఊపుకుంటా రాకండి. రూ.1,350 కోట్లు పట్టుకొని రండి. లేకపోతే ప్రజలు రానివ్వరు. నిలదీస్తరు.

నమ్మితే చెవిలో పువ్వు పెడతరు

మోదీసాబ్‌ అప్పుడు చెప్పిండు. అదరూ జన్‌ధన్‌ ఖాతాలు తెరవండి. ఆ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తా అన్నడు. మరి మీ ఖాతాల్లో ఎవరికైనా జమ అయినయా? ఆ డబ్బులు వచ్చినోళ్లు బీజేపోళ్లకు ఓటువేయండి.. రానోళ్లు టీఆర్‌ఎస్‌కు ఓటెయ్యండి. ఢిల్లీలో ఓ విలేకరి ‘ రూ.15 లక్షలు ప్రజల ఖాతాల్లో వేశారా?’ అని కేంద్రమంత్రి అమిత్‌షాను అడిగితే ఆయన ‘ఓతో జుమ్లాథా..’ అన్నడట. ఆయింత జీహెచ్‌ఎంసీ ఎన్నికలయ్యాక మన కిషనన్నను అడిగితే ఆయన కూడా ‘ఓతో జుమ్లాథా.. జనం చెవుల పువ్వు పెట్టినం’ అంటడేమో జాగ్రత్త. వాళ్లకు విషయం లేదు..విషం చిమ్మడమే తెలుసు. విద్వేషాలు రెచ్చకొట్టి.. మతం పేరిట రాజకీయాలు చేయడం తెలుసు. నాలుగు ఓట్లు, నాలుగు సీట్లు కోసం ఎంతకైనా దిగజారడం తెలుసు. 


గిన్నిచేసి గా ఒక్కటి ఇడిషిపెడ్తమా? 

లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు తయారుగా ఉన్నయ్‌. మా అక్కచెల్లెళ్లకు వాటిని ఇచ్చే జిమ్మేదారి మాది. కరోనా కష్టం వస్తే కంటైన్‌మెంట్‌ జోన్లలో తిరిగింది మనం. వరదలు వస్తే మోకాలులోతు నీళ్లలో తిరుగుతూ అండగా ఉన్నది మనం. మీకోసం గిన్ని చేసినోళ్లం. గా ఒక్కటి చేయమా? ఇంక మూడేండ్లు మన ప్రభుత్వమే ఉంటది. త్వరలోనే చేస్తాం. ఇండ్లుఇచ్చేది కేసీఆర్‌ ప్రభుత్వమే. ఢిల్లీ నుంచి వచ్చే టూరిస్టులతోటి ఊదుకాలదు.. పీరు లేవది. గల్లీ పార్టీ టీఆర్‌ఎస్‌ కావాలా? ఢిల్లీ లొల్లిపార్టీ బీజేపీ కావాల్నా? సిల్లీ పార్టీ కాంగ్రెస్‌ కావాల్నా? 

హైదరాబాద్‌లో తమిళ, తెలుగు అనే 

భేదాల్లేవు. తమిళ సోదరులు ఇక్కడే స్థిరపడి మాలో భాగంగా కలిసి ఉన్నరు. అన్నదమ్ముల్లా ఉంటూ కలిసి పనిచేసుకుంటున్నం. హైదరాబాద్‌లో ఉన్న అన్ని రాష్ర్టాలవాళ్లూ మాలో భాగంగానే కలిసి ఉన్నరు. గడిచిన ఆరేండ్లలో హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. గల్లీ గల్లీలో సీసీ కెమెరాలు పెట్టుకున్నాం. సీసీ రోడ్లు వేసుకున్నాం. పిల్లలకు కొలువులొచ్చేలా కంపెనీలు తెచ్చుకున్నాం. ఇంకా అభివృద్ధి చేసుకుందాం. 

ప్రధాని మోదీ రూ.20 లక్షల కోట్ల కరోనా ప్యాకేజీ ప్రకటించారు. ఆ 20 లక్షల కోట్లకు ఎన్ని సున్నాలుంటయో కూడా నాకు తెలియదు. దగ్గరున్నోళ్లను అడిగిన. ఈ మొత్తం దేశ ప్రజలకు పంచితే మనిషికి ఎంత వస్తయో చెప్పుమన్న. 132 కోట్ల మంది భారతీయులకు ఒక్కొక్కరికి రూ. 15,384 వస్తయి అన్నరు. ఇక్కడ ఎవరికైనా వచ్చాయా..? ఆరేండ్ల క్రితం రూ.15 లక్షలు అకౌంట్లో వేస్తమన్నరు. ఎవరికైనా వచ్చాయా? logo