శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 23:10:57

యువతరం మార్గదర్శి

యువతరం మార్గదర్శి

తెలంగాణ ఉద్యమం అందించిన నేటితరం యువ నాయకుడు కేటీఆర్‌. ఈ డబుల్‌ మాస్టర్‌ డిగ్రీ హోల్డర్‌ అయిన ఇటు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా టీఆర్‌ఎస్‌ పార్టీ కోసం, అటు మంత్రిగా పరిపాలనలో తనదైన ముద్రవేస్తూ తెలంగాణ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారు. ఆధునిక భావాలు, గ్లోబల్‌ ఆలోచనలతో పట్టణ, పరిశ్రమలు, ఐటీ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారు. 44వ ఏట అడుగిడుతున్న ఈ యువనేత తెలంగాణకు భవిష్యత్‌ అనే విషయంలో ఎటువంటి సంశయం లేదు.

2006లో తెలంగాణ ఉద్యమంలో ప్రవేశించిన కేటీఆర్‌ కరీంనగర్‌ పార్లమెంట్‌కు జరిగిన ఉపఎన్నిక ప్రచార బాధ్యతలను తీసుకొని కేసీఆర్‌ అఖండ విజయంలో భాగస్వాములయ్యారు. ఉద్యమ సందర్భంలో పోరాటాల్లో ముందుభాగాన నిలిచారు. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలు మొదలుకొని నిన్నటి పురపాలక ఎన్నికల వరకు పార్టీని ఒంటిచేత్తో గెలిపించగల ఒక బలమైన నాయకునిగా పరిణతి చెందారు. పార్టీని నాయకులను సమన్వయం చేస్తూ, తన నైపుణ్యాలన్నింటినీ ఉపయోగించి మున్సిపల్‌ ఎన్నికల్లో అఖండ విజయానికి కారకులయ్యారు. పట్టణాభివృద్ధికి అవిరళ కృషి చేస్తున్నారు. మున్సిపల్‌ చట్టం ద్వారా పట్టణాల్లో అవినీతిరహిత బాధ్యతాయుత పాలనకు దారులు వేశారు. 

మున్సిపల్‌, పట్టణాభివృద్ధి వ్యాపార వాణిజ్య సాంకేతిక మంత్రిగా ఈ శాఖల్లో ఎన్నడూ జరగని అభివృద్ధికి, గుణాత్మక మార్పులకు కారణమయ్యారు. డైనమిక్‌ నాయకుడైన కేటీఆర్‌ డైనమిక్‌ హైదరాబాద్‌, డైనమిక్‌ తెలంగాణ నినాదాలతో చేస్తున్న కృషిని ఈ రోజు జాతీయ, అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాలు గుర్తించే పరిస్థితి వచ్చింది. కేటీఆర్‌ చొరవతో స్టార్టప్‌ల కోసం 2017లో ఇండియాలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌ కలిగిన టీహబ్‌ ఏర్పడింది. టీఎస్‌ ఐపాస్‌ విధానం ద్వారా పెద్ద వ్యాపారులకు సింగిల్‌ విండో పద్ధతిలో వ్యాపార అనుమతులను సులువుగా పొందే వెసులుబాటు కలిగింది. సులభ వాణిజ్యంలో ఇండియాలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహం ద్వారా పరిశ్రమలలో తెలంగాణ యువకులకు ఉద్యోగాలు లభించే విధంగా శిక్షణ కోసం ‘’టాస్క్‌'ను నెలకొల్పారు.

ప్రతి సంక్షోభం ఒక పరిష్కార మార్గం చూపుతుంది. విజ్ఞులు సంక్షోభ సమయంలోనూ సానుకూల ఫలితాలను రాబడుతారు. అదేవిధంగా కేటీఆర్‌ కూడా కరోనా సంక్షోభ సమయం లోనూ ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నారు. లుక్‌ఈస్ట్‌ పాలసీ ద్వారా హైదరాబాద్‌ తూర్పు ప్రాంతమైన ఉప్పల్‌, నాచారం, మల్లాపూర్‌, బీబీనగర్‌ ప్రాంతాలకు ఐటీని విస్తరింప చేస్తున్నారు. హైదరాబాద్‌కే పరిమితం కాకుండా తెలంగాణలోని మిగతా ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికలో భాగంగా కరీంనగర్‌లో దిగువమానేరు ప్రాజెక్ట్‌ చెంత దాదాపు 3000 మందికి ఉపాధి కల్పించే ఐటీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. దీనిద్వారా తెలంగాణ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించాలనే దృఢ నిశ్చయాన్ని చాటుకున్నారు. హైదరాబాద్‌లో రోడ్ల విస్తరణ, బ్రిడ్జిలు, స్పీడ్‌ వే లు, స్టీల్‌ బ్రిడ్జ్‌ల నిర్మాణాన్ని తన ప్రత్యక్ష పర్యవేక్షణలో పూర్తిచేస్తున్నారు. ఆహ్లాదకర కాలుష్యరహిత వాతావరణాన్ని కల్పించేం దుకు మూసి ప్రక్షాళనను కొనసాగిస్తున్నారు. కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో పార్టీ, పరిపాలన అనుభవాలతో కేటీఆర్‌ ఒక బలమైన నాయకునిగా పరిణతి చెందు తున్నారు. సామాన్య కార్యకర్తగా సాదాసీదాగా తన మనసులోని మాటను ఉన్నదు న్నట్టు మాట్లాడుతూ అందరితో కలిసి పోతున్న కేటీఆర్‌ నేటి తరానికి మార్గదర్శి.


స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షికోత్సవాలకు కేటీఆర్‌కు ప్రత్యేక ఆహ్వానాలందుతున్నాయి. గత ఆరేండ్లుగా హైదరాబాద్‌లో పారిశ్రామిక, వాణిజ్య, ఐటీ అభివృద్ధి కోసం చేస్తున్న కృషికి అందిన పురస్కారంగా దీనిని భావించాలి. ఈ సమావేశాన్ని వేదికగా ఆయన ఐటీతోపాటుగా బయోటెక్నాలజీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్‌, యానిమేషన్‌, జూట్‌లాంటి పరిశ్రమలకు హైదరాబాద్‌లో గల సానూకూల పరిస్థితులను, ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలను ప్రపంచ పారిశ్రామిక దిగ్గజ సంస్థల ప్రతినిధులకు ఈ వేదిక మీదుగా వివరించారు. 2020 సంవత్సరాన్ని కృత్రిమ మేధ సంవత్సరంగా ప్రకటించారు. 2020-2030 దశాబ్దాన్ని తెలంగాణ దశాబ్దంగా పేర్కొని భారత్‌లో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం అనే నినాదంతో ముందుకువెళ్తున్నారు కేటీఆర్‌.

డి.రాజారాం యాదవ్‌


logo