మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 22, 2020 , 01:26:58

సార్‌.. నిన్ను మరువం

సార్‌.. నిన్ను మరువం

  • తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్నే త్యాగంచేసిన మహనీయుడు
  • ఆచార్యుడి సేవలను స్మరించుకున్న మంత్రి కేటీఆర్‌
  • ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా హరీశ్‌రావుసహా పలువురు మంత్రుల నివాళి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ కోసం తపించి, తన జీవితాన్నే త్యాగంచేసిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ అని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ఆదివారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరిస్తూ, ‘మిమ్మల్ని ఎప్పటికీ మరువం’ అంటూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌చేశారు. ‘తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన సిద్ధాంతకర్త, బంగారు తెలంగాణకు బాటచూపిన మహాత్మా, నీ స్ఫూర్తిని చెదరకుండా మా గుండెలనిండా పదిలంగా ఉంచుకున్నాం, జయహో జయశంకర్‌ సార్‌' అని మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌చేశారు. ‘మీరు లేని లోటు పూడ్చలేనిది’ అంటూ మాజీ ఎంపీ కవిత ట్వీట్‌చేశారు. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ తమ నివాసాల్లో  జయశంకర్‌సార్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రాష్ట్ర సాధనే ఆశగా, శ్వాస గా సార్‌ జీవించారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేస్తున్నారని పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌ భవన్‌లో..

టీఆర్‌ఎస్‌భవన్‌లో ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహానికి మంత్రి ఈటల రాజేందర్‌ పూలమాలవేసి నివాళులర్పించారు. మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌, నీటి వనరుల అభివృద్ధిశాఖ చైర్మన్‌ వీ ప్రకాశ్‌, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి కూడా సార్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వ్యవసాయవర్సిటీలో వీసీ ప్రవీణ్‌రావు.. జయశంకర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ఇంటర్‌ విద్యా జేఏసీ చైర్మన్‌ డాక్టర్‌ మధుసూదన్‌రెడ్డి, టీఎన్జీవో హైదరాబాద్‌ సిటీ అధ్యక్షుడు రాయికంటి ప్రతాప్‌ తదితరులు పుష్పాంజలి ఘటించారు.


logo