బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 02:20:47

ఆరేండ్లలో అణాపైసా భారం మోపలేదు

ఆరేండ్లలో అణాపైసా భారం మోపలేదు

  • ఏ ఒక్క చార్జీలో పెరుగుదల లేదు
  • ఎఫీషియెన్సీని పెంచి ఆదాయాన్ని పెంచాం
  • కరోనాలో ఆదుకొన్నాం.. వరదలప్పుడూ జనంలోనే ఉన్నాం
  • ఎప్పటికీ.. జనంలోనే.. జనంతోనే..
  • మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ప్రజలపై ఒక్క పైసా భారం మోపలేదని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘ప్రజలకు ఈ విషయం తెలుసు. ఈ ఆరేండ్లలో ఒక్క పైసా ప్రాపర్టీ ట్యాక్స్‌ పెంచినమా? ఒక్క పైసా వాటర్‌ బిల్లు పెంచామా? ఒక్క పైసా కరెంటు బిల్లు పెంచామా? ఒక్క పైసా స్టాంప్‌డ్యూటీ పెంచామా? ఒక్క పైసా రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచామా? ఒక్క పైసా ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజులు పెంచామా? ఒక్క పైసా డెవలప్‌మెంట్‌ ఫీజు పెంచామా? ఏది కూడా పెంచలేదు. ఎఫీషియన్సీని పెంచి.. రాష్ట్ర ఆదాయం పెంచి.. సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదలకు పంచే కార్యక్రమాలు చేశామే తప్ప ఎక్కడా పొరపాటున కూడా పన్నులు పెంచలేదు.. ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా.. చార్జీల మోత మోగించలేదు. సామాన్యుడి నడ్డివిరిచే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు’ అని తెలిపారు. మంత్రి కేటీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

రూ.67 వేల కోట్లతో హైదరాబాద్‌ అభివృద్ధి 

గడిచిన ఆరేండ్లలో హైదరాబాద్‌ అభివృద్ధికి రూ.67 వేల కోట్లను  ఖర్చుచేశాం. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికను రెండుమూడు రోజుల్లో విడుదలచేస్తాం. విభాగాలవారీగా ఎంత ఖర్చుచేశామో అణాపైసాతో సహా లెక్కలుచెప్తాం. ఈ విషయంలో ప్రతిపక్షాలకు, మీడియాకు, ప్రజలకు ఎలాంటి అనుమానాలు ఉండొద్దు. పూర్తి పారదర్శకంగాచేస్తాం. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజల కష్టంలోనూ ఉన్నది.. సుఖంలోనూ ఉన్నది.. ప్రజలు కరోనాతో బాధపడుతున్నప్పుడు కంటైన్మెంట్‌ జోన్లకు వెళ్లింది మేము.. ధైర్యం చెప్పింది మేము. ఇంటింటికీ ఐసొలేషన్‌ కిట్లు ఇచ్చింది మేము. హైదరాబాద్‌లో వందేండ్లలో అత్యధికంగా వర్షం పడి.. ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. వందల టీంలు వెంటేసుకొని మోకాళ్ల లోతు నీళ్లలో తిరిగింది మేము. ధైర్యం చెప్పింది మేము. ఇప్పుడు పెద్దగొంతు వేసుకొని అరుస్తున్నవారెవరూ ఆనాడు లేరు. కరోనా వచ్చినప్పుడు కంటైన్మెంట్‌ జోన్లు వీళ్లకు కనిపియ్యలేదు.. వారికి ధైర్యం చెప్పలేదు.. వరదలొచ్చినప్పుడు అడ్రస్‌ కూడా లేరు. మేము ప్రజల దుఃఖంలో పాలుపంచుకొంటుంటే వారేమో ఓట్ల వేటలో ఉన్నారు. మేము ఏసీ రూముల్లో కూర్చొని డైలాగులు కొట్టలేదు.. పనిచేసినం. 

కఠినంగా కొత్త జీహెచ్‌ఎంసీ చట్టం... 

హైదరాబాద్‌ ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే.. కొంతపని చేసినం.. ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది. ఎస్సార్డీపీ మాదిరిగానే ఎస్‌ఎల్డీపీ చేయాలి. హైదరాబాద్‌లో దశాబ్దాలుగా నాలాల మీద వచ్చిన ఆక్రమణలను తొలిగించే వరకు మా ప్రభుత్వం ఊరుకోదు. తప్పకుండా కఠినంగా వ్యవహరిస్తాం. జనవరి లేదా ఫిబ్రవరిలో  సీఎం కేసీఆర్‌ ఆమోదంతో కొత్త జీహెచ్‌ఎంసీ చట్టం తీసుకొస్తాం. అందులో కఠిన నిబంధనలు పొందుపరుస్తాం. ఎవరైనా నాలాల మీద ఇళ్లు నిర్మిస్తే ఎలాంటి నోటీసు లేకుండా వాటిని కూల్చేలా నిబంధనలు తీసుకొస్తాం.

భూ సమస్యలు పరిష్కరిస్తున్నాం 

హైదరాబాద్‌లో అనేక భూ సంబంధ సమస్యలున్నాయి. పేద ప్రజలకు, మధ్య తరగతి ప్రజలకు స్థిరాస్తి మీద యాజమాన్య హక్కు కల్పించేలా.. వారు ఏ రకమైన భూముల్లో ఉన్నా ఇబ్బంది లేకుండా వారికి యాజమాన్య హక్కు కల్పించే బాధ్యత మాది. ఇది చేసేది కేవలం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ మాత్రమే. 

మెట్రో రెండో దశను పూర్తి చేసేది మేమే..

మెట్రో రెండో దశను ముందుకు తీసుకెళ్తాం.. మొదటి దశ పూర్తిచేసింది మేమే.. రెండో దశ పూర్తిచేసేది మేమే. ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీని చేసేది మేమే. ఎన్నో ఇండస్ట్రీలున్నాయి. వాటిని హైదరాబాద్‌ బయటకు తరలిస్తాం. హైదరాబాద్‌లో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్‌ పాలసీ తీసుకొచ్చాం. ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెడతాం. ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉపయోగించేలా ప్రజల్ని కూడా పోత్సహిస్తాం. 

నిజమైతే ఆశీర్వదించండి.. లేదంటే శిక్షించండి.. 

ఈ ఐదున్నరేండ్లలో మీరిచ్చిన అవకాశంతో, ఆశీర్వాదంతో అన్ని పనులు చేసినం.. అవన్నీ మీ కండ్లముందున్నాయి. మేము చెప్పింది అబద్ధమైతే.. తప్పైతే మమ్మల్ని శిక్షించండి. మేం చెప్పింది నిజమైతే ఆశీర్వదించండి. హైదరాబాద్‌ను ఇంకా ఎంతో అభివృద్ధిచేయాలి. నేను చెప్పిన పనులన్నీ చేయాలంటే మాకు మరోసారి అవకాశం ఇవ్వండి.


ఉచితంగా వైద్యం, వైద్య పరీక్షలు 

350 బస్తీ దవాఖానలు పెట్టినం. సమైక్య పాలనలో పేదవాడికి సుస్తీచేస్తే దిక్కులేని పరిస్థితి ఉండేది. అదే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పేదవాడు నేరుగా వెళ్లి వైద్యం చేయించుకొనేలా 350 బస్తీ దవాఖానలను ఏర్పాటుచేశాం. ప్రతిరోజు లక్షమంది ఈ దవాఖానలకు వెళ్తున్నారు. వైద్య పరీక్ష చేయించుకోవాలంటే ఈ రోజు ప్రైవేటు దవాఖానలకు, ల్యాబ్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదు. నారాయణగూడలో హబ్‌ ఏర్పాటుచేసి, నగరంలో 8 సెంటర్లు పెట్టి వేలమందికి వైద్య పరీక్షలు చేస్తున్నాం. ఈ విధంగా దేశంలో ప్రజలకు ఉచితంగా వైద్యపరీక్షలు చేయిస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణే. హైదరాబాద్‌లో చాలానే చేశాం. మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాళ్లు నిర్మించాం. మోడల్‌ మార్కెట్లు నిర్మించాం. వైకుంఠధామాలు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు, అధునాతన బస్సు షెల్లర్లు, పంచతత్వ వంటి పార్కులు, జంతువుల కోసం థీమ్‌ పార్కులు నిర్మించాం. 

8 వేల పబ్లిక్‌ టాయ్‌లెట్లు కట్టాం 


హైదరాబాద్‌లో ఒక మహిళ బహిర్భూమికి పోలేని దుర్భర పరిస్థితి ఉండేది. అలాంటిది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక ప్రత్యేకంగా షీ టాయ్‌లెట్లు, మొబైల్‌ టాయ్‌లెట్లను ఏర్పాటుచేశాం. మొత్తంగా 8వేల పబ్లిక్‌ టాయ్‌లెట్లను నిర్మించాం. ఓపెన్‌ జిమ్‌లు, లైబ్రరీలు ఇలా ఎన్నో ఏర్పాటుచేశాం. హైదరాబాద్‌లో ఒకప్పుడు ఎల్‌ఈడీ లైట్లే లేకుండె. మా ప్రభుత్వం వచ్చాక ఆరు నెలల్లోనే 4.70 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటుచేసింది. దీనివల్ల జీహెచ్‌ఎంసీకి 35-40 శాతం విద్యుత్‌ఖర్చు తగ్గింది. నగర రహదారులు, కాలనీల్లో ఎల్‌ఈడీ కాంతులు ప్రజలకు మరింత సౌకర్యాన్ని ఇస్తున్నాయి.