సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 02:15:24

హైదరాబాద్‌ ఫార్మా ప్రపంచ మేటి

హైదరాబాద్‌ ఫార్మా ప్రపంచ మేటి

  • ఈ రంగంలో ఉపాధి అవకాశాలు మెండు
  • వాటిని అందిపుచ్చుకొనేలా ప్రణాళికలు
  • డిజిటల్‌ డ్రగ్‌ డిస్కవరీలోనూ అవకాశాలు
  • డ్రోన్లతో ఔషధాల సరఫరాపై కృషిచేస్తున్నాం
  • డబ్ల్యూఈఎఫ్‌ వెబినార్‌లో మంత్రి కేటీఆర్‌

రెండు దశాబ్దాల క్రితం భారతదేశంలో ఐటీ పరిశ్రమ ఏ విధంగా లక్షలమందికి ఉపాధి అవకాశాలు కల్పించిందో.. అలాంటి అద్భుతమైన పరిస్థితులు ప్రస్తుతం ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌ రంగంలో వస్తున్నాయి. కరోనా సంక్షోభ సమయంలోనే కాక, ఆ తర్వాత కూడా ఈ రంగం అనేక అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ఇందుకు అవసరమైన అన్ని ప్రణాళికలను తెలంగాణ ప్రభుత్వం సిద్ధంచేసుకుంటున్నది. ఐటీ రంగంలో ఐదు అగ్రశ్రేణి కంపెనీలు తమ రెండో అతిపెద్ద క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటుచేశాయి. నోవార్టీస్‌ లాంటి ఫార్మా దిగ్గజ కంపెనీ సైతం ఇక్కడే తమ కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకొన్నది.

- ఐటీ మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా సంక్షోభం సమయంలో హైదరాబాద్‌ ఫార్మారంగం తన బలాన్ని మరోసారి చాటుకొన్నదని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. మంగళవారం ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) నిర్వహించిన వెబినార్‌లో మంత్రి కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్‌ నగరం ఇప్పటికే జీనోమ్‌వ్యాలీతోపాటు దేశంలోనే అతిపెద్ద మెడికల్‌ డివైజెస్‌ పార్క్‌, ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ అయిన ఫార్మాసిటీ వంటి ప్రాజెక్టులతో అగ్రగామిగా ఉన్నదని మంత్రి తెలిపారు. 

ప్రపంచంలోని మొత్తం వ్యాక్సిన్లలో 30 శాతానికి పైగా హైదరాబాద్‌ నగరం నుంచే ఉత్పత్తి కావడం తెలంగాణకు గర్వకారణమని చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత్‌ బయోటెక్‌ లాంటి కంపెనీలు వ్యాక్సిన్‌ తయారీలో ముందు వరుసలో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. రెండు దశాబ్దాల క్రితం భారతదేశంలో ఐటీ పరిశ్రమ ఏ విధంగా లక్షలమందికి ఉపాధి అవకాశాలు కల్పించిందో.. అలాంటి అద్భుతమైన పరిస్థితులు ప్రస్తుతం ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌ రంగంలో వస్తున్నాయని పేర్కొన్నారు. కరోనా సంక్షోభ సమయంలోనే కాక, ఆ తర్వాత కూడా ఈ రంగం అనేక అవకాశాలను అందిపుచ్చుకుంటుందని చెప్పారు. 

ఇందుకు అవసరమైన అన్ని ప్రణాళికలను తెలంగాణ ప్రభుత్వం సిద్ధంచేసుకుంటున్నదని వెల్లడించారు. ఐటీ రంగంలో ఐదు అగ్రశ్రేణి కంపెనీలు తమ రెండో అతిపెద్ద క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటుచేశాయని, నోవార్టీస్‌ లాంటి ఫార్మా దిగ్గజ కంపెనీ సైతం ఇక్కడే తమ కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకొన్నదని వివరించారు. మందుల తయారీ మాత్రమే కాకుండా భవిష్యత్తులో డిజిటల్‌ డ్రగ్‌ డిస్కవరీ వంటి రంగాల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం భాగస్వామ్యంతో తెలంగాణ ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రస్తావించారు. 

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంతో మెడిసిన్స్‌ ఫ్రం స్కై కార్యక్రమాన్ని అపోలో హాస్పిటల్స్‌ భాగస్వామ్యంతో చేపట్టి, అత్యవసర సమయాల్లో డ్రోన్లతో మందులను సరఫరాచేసే అంశంపై పని చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ వెబినార్‌లో ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ్ణ ఎల్లా, అపోలో హాస్పిటల్స్‌ జేఎండీ శోభన కామినేని, దివీస్‌ ల్యాబ్‌ ప్రతినిధి మధుబాబు, డబ్ల్యూఈఎఫ్‌ బిజినెస్‌ హెడ్‌ అదితివ్యాస్‌, లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శక్తి నాగప్పన్‌ తదితరులు పాల్గొన్నారు.


logo