ఆదివారం 23 ఫిబ్రవరి 2020
పనిచేసే రాష్ర్టాలను శిక్షిస్తారా?

పనిచేసే రాష్ర్టాలను శిక్షిస్తారా?

Feb 15, 2020 , 03:01:14
PRINT
పనిచేసే  రాష్ర్టాలను శిక్షిస్తారా?
  • మంచి రాష్ర్టాలను ప్రోత్సహించకుండా నిరుత్సాహపరుస్తున్నారు
  • రాష్ర్టాలకు ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వకపోతే 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అసాధ్యం
  • ఎఫ్పార్బీఎం పరిమితిని 5 శాతానికి పెంచాలి
  • కేంద్రం ధైర్యంగా, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి
  • విధానాల రూపకల్పనలో రాష్ర్టాలకు ప్రాధాన్యమివ్వాలి
  • ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇంక్లూజివ్‌ గ్రోత్‌తోనే అభివృద్ధి
  • ముంబై నాస్కామ్‌ సదస్సులో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్రం నుంచి రాష్ర్టాలకు ఇచ్చే పన్నులవాటాను 15వ ఆర్థికసంఘం 42 శాతం నుంచి 41 శాతానికి తగ్గించడం.. పనిచేసే రాష్ర్టాలను శిక్షించడమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. దేశంలో ఆర్థిక క్రమశిక్షణతో చక్కగా పనిచేస్తున్న రాష్ర్టాలను ఇలాంటి సిఫారసులు నిరుత్సాహపరుస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్రం పన్నులవాటాలో ఒక శాతం తగ్గించడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏకంగా రూ.4 వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నదని తెలిపారు. ‘బాగా పనిచేస్తున్న రాష్ర్టాలను శిక్షిస్తున్నట్టుగా మీరు (కేంద్రం) ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఇది రాష్ర్టాలను పూర్తిగా నిరుత్సాహపరుస్తున్నట్లే. ప్రగతిశీల రాష్ర్టాలు ఎందుకు నష్టపోవాలి’ అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. 


అక్షరాస్యత, వైద్యారోగ్యరంగాల వృద్ధి సూచికలో ముందున్నప్పటికీ.. కేంద్ర విధానాల వల్ల దక్షిణాది రాష్ర్టాలన్నీ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. రాష్ర్టాలకు ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వనప్పుడు 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యంకావడం సవాలేనని చెప్పారు. దేశాభివృద్ధికి ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇంక్లూజివ్‌ గ్రోత్‌ అనే ‘త్రీ ఐ’ మంత్రాన్ని పాటిస్తేనే సరికొత్త భారతావని నిర్మాణం సాధ్యపడుతుందని స్పష్టంచేశారు. శుక్రవారం ముంబైలో నాస్కామ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన లీడర్‌షిప్‌ ఫోరం (ఎన్టీఎల్‌ఎఫ్‌) 2020 కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. మార్చ్‌ టు 5 ట్రిలియన్‌ డాలర్స్‌ ఎకానమీ, రియాల్టీ ఆఫ్‌ యాంబీషియస్‌ అన్న అంశంపై టెక్‌మహీంద్రా ఎండీ సీపీ గుర్నానీ నిర్వహించిన చర్చలో మంత్రి ప్రసంగించారు. 


దేశం ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికవ్యవస్థ సాధన దిశగా పయనించాలంటే తీసుకోవాల్సిన చర్యలు, రూపొందించిన విధానాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. తెలంగాణ కొత్త రాష్ట్రమైనప్పటికీ.. వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, కేవలం సేవారంగంలోనే కాకుండా ఉత్పత్తి, వ్యవసాయరంగంలోనూ దేశ వృద్ధిరేటును మించి దూసుకుపోతున్న నేపథ్యంలో తెలంగాణ అనుభవాలను పంచుకోవాలని మంత్రి కేటీఆర్‌ను గుర్నానీ కోరారు. దేశాభివృద్ధిపట్ల తాను ఆశావహ దృక్పథంతో ఉన్నానని.. కేంద్రప్రభుత్వం భారీ లక్ష్యాన్ని అందుకోవాలంటే ధైర్యంతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. 


కేంద్రప్రభుత్వం నుంచి ఇలాంటి నిర్ణయాలనే దేశం ఆశించిందని.. కానీ ప్రజల ఆకాంక్షల మేరకు తీసుకోలేకపోయిందని తెలిపారు. రెండుమూడేండ్లుగా దేశ ఆర్థికవ్యవస్థ మందగమనంలో ఉన్నదని.. కేంద్రం ఒప్పుకొన్నా.. లేకపోయినా.. ఆర్థికగణాంకాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయని చెప్పారు. కేంద్రప్రభుత్వం శషభిషలు వదిలిపెట్టి రాష్ర్టాలకు మరింత ఆర్థికస్వేచ్ఛ ఇవ్వాలన్నారు. రాష్ర్టాలు వేగంగా ఎదిగితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న సత్యాన్ని గుర్తించాలని అన్నారు. టీం ఇండియా, ఫెడరలిజం వంటి     పదాలను ఆచరణలో చూపాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ముఖ్యంగా ఫిస్కల్‌ ఫెడరలిజాన్ని కేంద్రప్రభుత్వం అనుసరించాలని డిమాండ్‌చేశారు. అభివృద్ధి కార్య    క్రమాలకోసం భారీగా నిధులు ఖర్చుచేయనప్పుడు 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికవ్యవస్థ లక్ష్యం కష్టసాధ్యమని తెలిపారు. 


జీఎస్టీ పరిహారమివ్వాలి

జీఎస్టీ చట్టంలో పొందుపరిచినవిధంగా రాష్ర్టాలకు 14 శాతం పరిహారం చెల్లించాల్సి ఉన్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. న్యాయపరంగా ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. జీఎస్టీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రప్రభు త్వం త్వరలోనే బకాయిలను చెల్లిస్తుందన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్‌ వ్యక్తంచేశారు. 


కేంద్ర ఆర్థికనిబంధనల సరళీకరణతోపాటు పలు విధానాల రూపకల్పనలోనూ రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాధాన్యమివ్వాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. ముఖ్యంగా సేవారంగం, పర్యాటకం, విద్యావైద్యరంగాల్లో కేంద్రం.. రాష్ర్టాలకు పూర్తి స్వేచ్ఛనివ్వాలన్నారు. ఉమ్మడి జాబితాలో ఉన్న అనేక అంశాలను రాష్ట్రాలకు బదిలీచేయాలని డిమాండ్‌చేశారు. సులభమైన నిబంధనలున్నప్పుడే ఇతర దేశాలతో తయారీరంగంలో భారతదేశం పోటీపడగలుగుతుందని.. మనకన్నా చిన్నదేశాలైన బంగ్లాదేశ్‌ , వియత్నాం తదితర దేశాలు ఎలక్ట్రానిక్స్‌, టెక్స్‌టైల్‌ రంగాల్లో ముందున్నాయని తెలిపారు. కేంద్రం ప్రారంభించిన మేకిన్‌ ఇండియా.. అసెంబ్లింగ్‌ ఇన్‌ ఇండియాగా మారిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 


భారీ ప్రాజెక్టులు అవసరం

దేశ ఆర్థికవ్యవస్థ భారీగా వృద్ధిచెందాలంటే భారీప్రాజెక్టుల ఆలోచన చేయాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఇందులోభాగంగానే భారీగా సాగునీటి ప్రాజెక్టులతోపాటు ప్రపంచంలోనే పలు అతిపెద్ద ఫార్మా క్లస్టర్లలో ఒకటైన హైదరాబాద్‌ ఫార్మాసిటీ, దేశంలోనే అతి పెద్దదైన వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కుల ఏర్పాటుతో ప్రపంచంతో పోటీ పడేందుకు తెలంగాణ సిద్ధమవుతున్నదని చెప్పారు. వీటికున్న జాతీయ ప్రాధాన్యం దృష్ట్యా కేంద్ర సహకారం కోరినా ఇప్పటిదాకా మద్దతు ఇవ్వలేదని తెలిపారు. జాతీయ ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టులనే పట్టించుకోనప్పుడు ఇక భారీ ఆర్థికవ్యవస్థ ఏర్పాటు లక్ష్యం ఎలా నెరవేరుతుందని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. 


త్రీ ఐ మంత్ర

గతంలో ప్రధానమంత్రితో జరిగిన సమావేశంలో దేశాభివృద్ధికి త్రీ ఐ మంత్ర పాటించాలని సూచించిన విషయాన్ని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇంక్లూజివ్‌ గ్రోత్‌ అన్న మూడు అంశాల ద్వారానే  సరికొత్త భారత్‌ నిర్మాణం సాధ్య    మవుతుందని తెలిపారు. ఆవిష్కరణల రంగంలో ప్రపంచదేశాలతో పోటీపడేందుకు.. తెలంగాణ టీ హబ్‌ వంటి భారీ ఇంక్యుబేటర్‌ను నెలకొల్పిందన్నారు. దేశం వేగంగా ఎదుగుతున్నా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగం మాత్రం అనుకున్న మేర విస్తరించడంలేదనిచెప్పారు. మౌలికరంగంలో 2014కి ముందు తెలంగాణలో రూ.50 వేల కోట్లు ఖర్చుచేస్తే తాము అధికారంలోకి వచ్చిన ఐదేండ్లలోనే సుమారు రూ.1.60 లక్షల కోట్లు ఖర్చు చేసినట్టు మంత్రి కేటీఆర్‌ వివరించారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం వంటి భారీప్రాజెక్టులను చేపట్టి ఆర్థికప్రగతికి పాటుపడుతున్నామని తెలిపారు. పట్టణాలు, గ్రామాల మధ్య మరింత అంతరం లేకుండా సమాంతరంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నదని, వర్క్‌ఫోర్స్‌లో మహిళా భాగస్వామ్యం పెరుగాలన్న మంత్రి కేటీఆర్‌.. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన వీ హబ్‌ను ప్రస్తావించారు. 


మూలధనాన్ని సేకరించి ఖర్చుచేయాలి

తెలంగాణ లాంటి వేగంగా ఎదుగుతున్న రాష్ట్రాలకు మూలధన లభ్యత ప్రధానసమస్యగా ఉన్నదని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. దేశం వేగంగా అభివృద్ధి చెందాలంటే మౌలికవసతుల కల్పన కోసం భారీగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఇందుకోసం అమెరికా , జపాన్‌ , యూరప్‌లోని పలుదేశాల మాదిరి చవకైన మూలధనాన్ని సేకరించి ఖర్చుచేయాలని సూచించారు. తెలంగాణ లాంటి పలు రాష్ట్రాల విధానాలు, వనరులు, వాతావరణం నచ్చి పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే విదేశీ కంపెనీలు, ఆర్థిక సంస్థలకు కఠినమైన కేంద్ర నిబంధనలు అడ్డంకులుగా మారాయని తెలిపారు. 


ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలు

ఇప్పటికే ప్రముఖ నగరాలన్నీ మౌలిక వసతుల సంక్షోభందిశగా పయనిస్తున్న నేపథ్యంలో ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలను విస్తరించాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. ఇందుకోసం నాస్కామ్‌ ప్రత్యేక చొరువ చూపాలన్నారు. దీంతో కంపెనీల నిర్వహణవ్యయం తగ్గడంతోపాటు ఆయా నగరాల్లోని అద్భుతమైన ప్రతిభ, మానవవనరులను ఉపయోగించుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీని విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నం మంచి ఫలితాలను ఇస్తున్నదని, వరంగల్‌ నగరానికి ఐటీ కంపెనీల నుంచి మంచి స్పందన వస్తున్నదని, మరిన్ని కంపెనీలు అక్కడికి రావాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. వ్యవసాయరంగంలో ఆదాయం పెంచాల్సిన, రెట్టింపు చేయాలన్న ఆర్థికలక్ష్యం దిశగా తెలంగాణ వేగంగా ముందుకుపోతున్నదని, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు, రైతు బీమా వంటి కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం ఈ విషయంలో కేంద్రంతోపాటు ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నాయని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు.


ఎఫ్పార్బీఎం పరిమితిని పెంచాలి

ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న రాష్ర్టాలకు అప్పులు చేసుకొనే పరిమితిని ఐదుశాతానికి పెంచాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. తెలంగాణ రాష్ర్టానికి ఇప్పుడున్న పరిమితిని 3.5 శాతాన్ని 5 శాతానికి పెంచాలన్నారు. ‘మరింత అప్పులను తీసుకొనేందుకు కేంద్రప్రభుత్వం మాకు వెసులుబాటును కల్పించాలి. కావాలంటే.. తీసుకొన్న అప్పులను కేవలం ఉత్పాదకరంగంలో మాత్రమే వినియోగించాలని.. ఉచిత పథకాల కోసం వాడవద్దని షరతు విధించండి. అందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని కేటీఆర్‌ కేంద్రప్రభుత్వానికి స్పష్టంచేశారు. విదేశీ పెట్టుబడులను రాష్ట్రప్రభుత్వాలు నేరుగా తీసుకొచ్చేవిధంగా అనుమతించాలని డిమాండ్‌చేశారు. కేంద్రం విషయంలో ఫార్మాస్యూటికల్‌ పార్కులకు మద్దతు ఇవ్వడంలేదన్నారు. మౌలిక వసతుల కల్పనకోసం నిధులను సేకరించి ఖర్చుచేస్తే అప్పులు పెంచుతున్నారంటూ చేస్తున్న వాదన పాత సంప్రదాయ ఆలోచన అని.. అభివృద్ధి చెందిన ఆర్థికవ్యవస్థలు పెద్దఎత్తున ఖర్చుచేసినందునే అభివృద్ధి సాధ్యపడిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.


logo