బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 02:45:56

మన పత్తి బంగారం

మన పత్తి బంగారం

  • ఇక్కడి పత్తికి విదేశాల్లోనూ డిమాండ్‌
  • టెక్స్‌టైల్‌ రంగంలో  పెట్టుబడులకు రాష్ట్రం గమ్యస్థానం
  • మానవ వనరులకు ప్రభుత్వం ద్వారా శిక్షణ కార్యక్రమాలు
  • టెక్స్‌టైల్‌ అపారెల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమావేశంలో 
  • రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు
  • తెలంగాణలో పెట్టుబడులకు ఢోకాలేదు: వెల్‌స్పన్‌ సీఈవో

పరిశ్రమలోని అన్ని వర్గాలతో మాట్లాడిన తరువాత అవసరమైన అంశాలను క్రోడీకరించి టెక్స్‌టైల్‌, అపారెల్‌ విధానాన్ని తయారు చేశాం. టెక్స్‌టైల్‌ పరిశ్రమను ప్రాధాన్యరంగంగా గుర్తించిన నేపథ్యంలో గత ఆరేండ్లలో రాష్ర్టానికి చాలా పెట్టుబడులు వచ్చాయి. ప్రోత్సాహకాల విషయంలో పెట్టుబడిదారులకు టేలర్‌మేడ్‌ పాలసీని అందించడానికి అవసరమైన సదుపాయం ప్రభుత్వానికి ఉన్నది. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: టెక్స్‌టైల్‌ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన అవకాశాలున్నాయని పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ట్రంలో పండించే పత్తికి జాతీయంగా, అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌ ఉన్నదని పేర్కొన్నారు. సోమవారం ఇన్వెస్ట్‌ ఇండియా నిర్వహించిన టెక్స్‌టైల్‌ అపారెల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమావేశంలో మంత్రి కేటీఆర్‌, కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీతో కలిసి వెబినార్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టానికి టెక్స్‌టైల్‌, అపారెల్‌ రంగంలో ఉన్న సానుకూలతలను వివరించారు. 

రాష్ట్రంలో ఇప్పటికే 60 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు జరుగుతున్నదని తెలిపారు. ఇక్కడ లభించే పత్తి అంతర్జాతీయంగా అద్భుతమైన నాణ్యత కలిగిందని దక్షిణ భారత మిల్స్‌ అసోసియేషన్‌ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అమలుచేస్తున్న టీఎస్‌ఐపాస్‌ ద్వారా అతి తక్కువగా పదిహేను రోజుల్లోనే అన్ని అనుమతులు లభిస్తాయన్నారు. సానుకూల పారిశ్రామిక విధానాల ద్వారా సులభతర వాణిజ్యంలో రాష్ట్రం అగ్రస్థానంలో కొనసాగుతున్నదని వెల్లడించారు. పరిశ్రమలకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరాచేస్తున్నామని తెలిపారు. 

మిషన్‌ భగీరథ కార్యక్రమంలో భాగంగా 10% నీటిని ప్రభుత్వం కేటాయించిందని.. ఇందుకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో పైప్‌లైన్లు ఉన్నాయని చెప్పారు. పరిశ్రమలకు కావాల్సిన సిబ్బందికోసం రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చుతో యువతకు శిక్షణ ఇస్తున్న అంశాన్ని కూడా మంత్రి కేటీఆర్‌ పెట్టుబడిదారులతో ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టెక్స్‌టైల్‌, అపారెల్‌ విధానాన్ని పరిశ్రమలోని అన్ని వర్గాలతో మాట్లాడిన తరువాత అవసరమైన అంశాలను క్రోడీకరించి తయారుచేసినట్లు పేర్కొన్నారు. టెక్స్‌టైల్‌ పరిశ్రమను ప్రాధాన్యరంగంగా గుర్తించిన నేపథ్యంలో గత ఆరేండ్లలో రాష్ర్టానికి చాలా పెట్టుబడులు వచ్చినట్టు వివరించారు. దేశంలోని ఇతర రాష్ర్టాల మాదిరి ప్రోత్సాహకాల విషయంలో పెట్టుబడిదారులకు టేలర్‌మేడ్‌ పాలసీని అందించడానికి అవసరమైన సదుపాయం ప్రభుత్వానికి ఉన్నదని మంత్రి కేటీఆర్‌ వివరించారు. మన దేశంలో ఇప్పటివరకు తయారుచేయలేని పీపీఈ కిట్లను కరోనా సంక్షోభం నేపథ్యంలో తయారీ ప్రారంభించి ప్రపంచంలోనే అత్యధికంగా తయారుచేస్తున్న దేశాల్లో రెండోస్థానంలో నిలిచేలా చేసిందని అభినందించారు.

తెలంగాణ విధానాలు భేష్‌

  • కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ 


తెలంగాణ ప్రభుత్వం గత ఆరేండ్లలో తనదైన విధానాలతో.. పెట్టుబడుల ఆకర్షణలో పోటీ పడుతున్నదని కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఇతర రాష్ర్టాలతో పోటీగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాలు, ప్రోత్సాహకాలకు సంబంధించి మంత్రి కేటీఆర్‌ ప్రసంగాన్ని ఆమె ప్రశంసించారు. ఇతర రాష్ర్టాలకు మించి అవసరమైన సౌకర్యాలు కల్పించడంపై మంత్రి కేటీఆర్‌ మాటలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలో టెక్స్‌టైల్‌ రంగంలో పెట్టుబడిదారులకు విస్తారమైన అవకాశాలున్నాయని ఆమె తెలిపారు. ఏ రాష్ట్రంలోనైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చేవారికి కేంద్రం పక్షాన, ఇన్వెస్ట్‌ ఇండియా తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పాలసీలను , ఇతర అంశాలను ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా పెట్టుబడిదారులకు వివరించారు. 

అత్యంత అనుకూలమైన రాష్ట్రం

  • వెల్‌స్పన్‌ సీఈవో దీపాలీ గోయెంకా 

పరిశ్రమలు నడిపేందుకు అత్యంత అనుకూలమైన రాష్ట్రం.. తెలంగాణ అని వెల్‌స్పన్‌ సీఈవో దీపాలీ గోయెంకా తెలిపారు. పెట్టుబడిదారుల సదస్సులో తెలంగాణలో వెల్‌స్పన్‌ పరిశ్రమ ఏర్పాటు, అనుభవాన్ని దీపాలీ వివరించారు. టీఎస్‌ఐపాస్‌ వంటి విధానాలు క్షేత్రస్థాయిలోనూ పనిచేస్తున్న విషయాన్ని ఆమె తెలిపారు. తెలంగాణలో ఉన్నది అత్యంత దీర్ఘకాల దృక్పథం కలిగి ఉన్న పరిశ్రమ ఫ్రెండ్లీ నాయకత్వమన్నారు. ఈ రాష్ర్టానికి వచ్చే పెట్టుబడులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆమె తన అనుభవాలద్వారా పెట్టుబడిదారులకు ఆమె భరోసా ఇచ్చారు.

తాజావార్తలు


logo