ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 12:51:45

సెలయేర్ల వెంబడి విరివిగా మొక్కలు నాటాలి : మంత్రి కేటీఆర్‌

సెలయేర్ల వెంబడి విరివిగా మొక్కలు నాటాలి : మంత్రి కేటీఆర్‌

రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలోని వాగులు, చెరువులు, నదులు, కుంటల పక్కన విరివిగా మొక్కలు నాటాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ నేడు ప్రారంభించారు. ఆవునూరు-వెంకటాపూర్‌ దగ్గర మానేరు వాగులో హరితహారంలో భాగంగా వీరు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ...

హరితహారం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో జరుగుతోందన్నారు. రాజన్న సిరిసిల్లలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు కోటి 40 లక్షల మొక్కలు నాటినట్లు వెల్లడించారు. సిరిసిల్లలో 19.85 శాతం అడవులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అడవులు 33 శాతానికి పెంచాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆలోచన అన్నారు. సీఎం ఆలోచన మేరకు రాష్ట్రంలో అడవులను పెంచాలన్నారు. 


సంక్షోభంలోనూ ఆగని సంక్షేమం...

సిరిసిల్ల నియోజకవర్గాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆలోచన అని తెలిపారు. నర్మాల నుంచి మానేరు వాగు నీటితో కళకళలాడుతోందన్నారు. ఎగువ మానేరు నుంచి మధ్యమానేరు వరకు 11 చెక్‌డ్యాంలు నిర్మించనున్నట్లు వెల్లడించారు. 

కరోనాతో ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. అయినా సంక్షోభంలోనూ ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగలేదన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతులకు రైతుబంధు అందజేసినట్లు తెలిపారు. వ్యవసాయాన్ని పండుగలా చేయాలని సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారన్నారు. ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కోనుగోలు చేసినట్లు చెప్పారు. తెలంగాణ దేశానికి ధాన్యాగారంగా మారిందని ఎఫ్‌సీఐ సైతం ప్రశంసించిందన్నారు. 


logo