మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 20, 2020 , 02:46:54

బల్దియాకు కేంద్రం బకాయి 1,434 కోట్లు

బల్దియాకు  కేంద్రం  బకాయి 1,434 కోట్లు

  • అడ్రస్‌లేని ఆర్థిక సంఘం కేటాయింపులు
  • భారీగా మౌలిక వసతులు కల్పిస్తున్న రాష్ట్రం
  • కేంద్రం మ్యాచింగ్‌ గ్రాంట్‌ రాక పనుల్లో జాప్యం
  • కరోనా, లాక్‌డౌన్‌తో రాష్ర్టానికి నిధుల కొరత
  • బకాయిలను వెంటనే విడుదల చేయండి
  • కేంద్ర ఆర్థికమంత్రికి మంత్రి కేటీఆర్‌ లేఖ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆర్థిక సంఘాల సిఫారసుల మేరకు రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల అభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదలచేయాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కే తారకరామారావు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని పట్టణ స్థానికసంస్థలకు కేంద్రప్రభుత్వం నుంచి రూ.1,434 కోట్లు రావాల్సి ఉన్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నదని, ఇందుకు పెద్దఎత్తున నిధులు విడుదల చేస్తున్నదని పేర్కొన్నారు. వీటికి సంబంధించి కేంద్రం నుంచి మ్యాచింగ్‌ గ్రాంట్‌ విడుదల కావడం లేదని తెలిపారు. కరోనా, లాక్‌డౌన్‌తో నిధుల కొరతను ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పనులు కొనసాగించడం ఇబ్బందిగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం వెంటనే బకాయిలను విడుదల చేయాలని కోరుతూ శనివారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. 15వ ఆర్థికసంఘం తెలంగాణలోని పది లక్షలకుపైగా జనాభా ఉన్న నగరమైన హైదరాబాద్‌కు రూ.468 కోట్లు, ఇతర పట్టణాలకు కలిపి రూ.421 కోట్లు కేటాయించిందని గుర్తుచేశారు. మొత్తంగా రూ.889 కోట్లు రావాల్సి ఉన్నదని తెలిపారు. ఈ కేటాయింపులను కేంద్రం సైతం అంగీకరించిందని, యాక్షన్‌ టేకెన్‌ రిపోర్ట్‌ను పార్లమెంట్‌లో కూడా ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. ఈ నిధులను రెండు సమాన విడుతల్లో ఈ ఏడాది జూన్‌, అక్టోబర్‌లో విడుదల చేయాల్సి ఉన్నా.. ఇప్పటివరకు మొదటి విడుత కింద హైదరాబాద్‌కు రూ.105.25 కోట్లు మాత్రమే విడుదల చేశారని తెలిపారు. మిగతా నిధులు సుమారు రూ.784 కోట్లు రాలేదని పేర్కొన్నారు.

పాత బకాయిలకే మోక్షం లేదు

రాష్ట్రంలోని పట్టణాలకు బేసిక్‌ గ్రాంట్‌గా రూ.2,711 కోట్లు ఇవ్వాలని 14వ ఆర్థిక సం ఘం (2015-20) కేంద్రానికి సూచించిందని మంత్రి కేటీఆర్‌ తన లేఖలో గుర్తుచేశారు. ఇం దులో కేంద్రం ఇప్పటివరకు రూ.2,502 కోట్లే విడుదలచేసిందని తెలిపారు. ఇంకా రూ.208 కోట్లు రావాల్సి ఉన్నదన్నారు. దీంతోపాటు పర్ఫార్మెన్స్‌ గ్రాంట్‌ కింద రాష్ర్టానికి రూ.677 కోట్లు రావాల్సి ఉండగా, రూ.235.8 కోట్లు మాత్రమే చెల్లించారని, కేంద్రం ఇంకా రూ.441 కోట్లు బకాయి ఉన్నదని వెల్లడించా రు. మొత్తంగా 14వ ఆర్థికసంఘానికి సంబంధించి రాష్ర్టానికి రూ.650 కోట్లు రావాల్సి ఉన్నదని పేర్కొన్నారు. అదే సమయంలో కొన్ని రాష్ర్టాలకు పూర్తిగా నిధులు చెల్లించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. 

ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధికే పెద్దపీట

కరోనా, లాక్‌డౌన్‌ నష్టాల నుంచి కోలుకోవడానికి రాష్ర్టాలు ముందుండి పోరాడుతున్నాయని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక, సామాజిక కార్యకలాపాలను గాడిన పెట్టేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నదని తెలిపారు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులున్నా.. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామన్నారు. అయితే వీటికి సంబంధించి కేంద్రం నుంచి మ్యాచింగ్‌ గ్రాంట్‌ రాకపోవడం పెద్ద అడ్డంకిగా మారిందని తెలిపారు. అదేసమయంలో కరోనాతో రాష్ర్టానికి నిధుల కొరత ఏర్పడటంతో పనులు వేగంగా ముందుకు సాగడంలేదని వివరించారు. కేంద్ర నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు. కేంద్రం వెంటనే స్పందించి 14వ ఆర్థికసంఘం బకాయిలు రూ.650 కోట్లు, 15వ ఆర్థికసంఘం బకాయిలు రూ.784 కోట్లు.. వెరసి రూ.1,434 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ను మంత్రి కేటీఆర్‌ కోరారు. ఈ లేఖను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌పురికి సైతం పంపించారు.


logo