గురువారం 04 జూన్ 2020
Telangana - May 04, 2020 , 02:10:12

రెండూ అవసరమే జీవితము.. జీవనోపాధి

రెండూ అవసరమే జీవితము.. జీవనోపాధి

  • వ్యాక్సిన్‌ కనిపెట్టేవరకు..కరోనాతో సహజీవనం అనివార్యం
  • భారత్‌లోకి పరిశ్రమల ఆకర్షణకు ఇదే మంచి తరుణం
  • ఫార్మాసిటీకి రూ.4వేల కోట్లు కేంద్రం కేటాయించాలి  
  • ఉద్యోగుల్లో ఆరోగ్యభద్రతపై విశ్వాసం కల్పించాలి 
  • పీటీఐ వార్తాసంస్థతో రాష్ట్ర మంత్రి కే తారకరామారావు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా నివారణకు వ్యాక్సిన్‌, మందు వచ్చేవరకు ఆ వైరస్‌తో జీవించడం నేర్చుకోవాలని ఐటీ పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. కరోనాపై ప్రజలందరికీ స్పష్టమైన అవగాహన రావాల్సి ఉన్నదని పేర్కొన్నారు. కరోనా కారణంగా ప్రజల్లో జీవితమా.. జీవనోపాధా? అన్న మీమాంస ఉండటం సహేతుకం కాదని.. రెండూ ఉంటేనే అర్థవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆదివారం పీటీఐ వార్తాసంస్థతో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కరోనాకు వ్యాక్సిన్‌ను కనుక్కోవడానికి ఇప్పటికే ప్రయత్నాలు మొదలైనా.. దాని ప్రభావాన్ని నిరూపించాల్సి ఉంటుందని తెలిపారు. ఇందుకోసం సమయం పడుతుందని.. అప్పటిదాకా కరోనాతో కలిసి బతకడం తప్పనిసరి అని చెప్పారు. కరోనా నియంత్రణలో యావత్‌ ప్రపంచం భారతదేశాన్ని అభినందిస్తున్నదని చెప్పారు. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలుచేయడం ద్వారా కొవిడ్‌-19ను నియంత్రించగలిగామని తెలిపారు. 

భారత్‌లో పెట్టుబడులకు సర్వత్రా ఆసక్తి

ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ విజృంభించిన నేపథ్యంలో వివిధ దేశాలు, పెట్టుబడిదారులు సురక్షిత ప్రాంతాలను అన్వేషిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ క్రమంలో భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి పలువురు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. వివిధ కంపెనీలు తమ ఉత్పత్తి యూనిట్లను ఇతర ప్రాంతాలకు మార్చాలని చూస్తున్నాయని వెల్లడించారు. పరిస్థితులను గమనిస్తే పెట్టుబడులకు భారతదేశం మెరుగైనదనే భావన వ్యక్తమవుతున్నదని, కేంద్ర ప్రభు త్వం చురుకుగా వ్యవహరించి మనదేశానికి పెట్టుబడులు వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాల్సిఉన్నదన్నారు. రాష్ర్టాల్లో పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం నిధులు ఇవ్వాలని పేర్కొన్నారు. 

చైనా కంపెనీలను ఆకర్షించాలి

చైనా నుంచి వచ్చే పరిశ్రమలను ఆకర్షించడానికి ఇదే మంచి అవకాశమని చెప్పారు. ఉత్పాదకరంగంలో చైనా నుంచి బయట అవకాశాలకోసం చూస్తున్న కంపెనీల్లో సింహభాగం భారతదేశానికి వచ్చేలా చూడాలని సూచించారు. ఇందుకోసం భారీ పారిశ్రామిక పార్కులను ఏర్పాటుచేయాలని, కార్మికచట్టాలను మార్చాలని.. ఈవోడీబీలో భారతదేశం మొదటి ఇరవై దేశాల్లో ఒకటిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు లేఖ రాశానని వెల్లడించారు. అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలోని ఫార్మాసిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.4 వేల కోట్ల సహాయంచేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. ఫార్మాసిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నామని, కొవిడ్‌-19 నేపథ్యంలో వ్యాక్సిన్‌, డ్రగ్‌ ప్రాధాన్యం తెలిసిన తరువాత ఫార్మాసిటీ ప్రాముఖ్యం మరింత పెరిగిందన్నారు. ఫార్మాసిటీ కోసమే 900 మెగావాట్ల విద్యుత్తు అవసరం ఉంటుందని, ఇందుకోసం రూ.1200 నుంచి రెండువేల కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని చెప్పారు. నీటి అవసరాలకోసం మరో రెండువేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని తెలిపారు. 

ప్రపంచస్థాయి ప్రమాణాలతో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు

ప్రపంచస్థాయి ప్రమాణాలతో వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కును కూడా సిద్ధంచేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో వైరస్‌ నియంత్రణ జాతీయ సగటుకంటే, ఇతర రాష్ట్రాలకంటే మెరుగ్గా ఉన్నదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరిశ్రమలకు, ప్రభుత్వానికి ఉద్యోగుల్లో విశ్వాసం కల్పించడం పెద్ద సవాల్‌ అని పేర్కొన్నారు. వారికి ఆరోగ్యంపై విశ్వాసం కలిగితేనే విధుల్లోకి వస్తారన్నారు. దీనికోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మాస్కులు, శానిటైజేషన్‌, సామాజిక దూరం పాటించే విధంగా కార్యాచరణ సిద్ధంచేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 

ఉత్పాదకరంగంలో చైనా నుంచి బయట 

అవకాశాలకోసం చూస్తున్న కంపెనీల్లో సింహభాగం భారతదేశానికి వచ్చేలా చూడాలి. ఇందుకోసం భారీ పారిశ్రామిక పార్కులను ఏర్పాటుచేయాలి. కార్మికచట్టాలను మార్చాలి.. ఈవోడీబీలో భారతదేశం మొదటి ఇరవై దేశాల్లో ఒకటిగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.

- మంత్రి కేటీఆర్‌


logo