శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 15:08:22

స‌న‌త్‌న‌గ‌ర్ టూ బాలాన‌గ‌ర్‌.. ఆర్‌యూబీకి కేటీఆర్ శంకుస్థాప‌న‌

స‌న‌త్‌న‌గ‌ర్ టూ బాలాన‌గ‌ర్‌.. ఆర్‌యూబీకి కేటీఆర్ శంకుస్థాప‌న‌

హైద‌రాబాద్ :  సనత్‌నగర్‌లోని ఇండస్ట్రియల్‌ ఏరియాలో రూ.68.30 కోట్లతో చేపట్టనున్న రైల్వే అండర్‌ బ్రిడ్జి (ఆర్‌యూబీ) నిర్మాణ పనులకు రాష్ర్ట మున్సిప‌ల్, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్, ప‌శుసంవ‌ర్ధ‌క శాక‌ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ క‌లిసి బుధ‌వారం శంకుస్థాప‌న చేశారు. 

ప్రస్తుతం రెండు లేన్‌లుగా ఉన్న ఫతేనగర్‌ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిని సుమారు 400 మీటర్లు మేర రూ.45.04 కోట్లతో నాలుగు లేన్‌లుగా విస్తరించే నిర్మాణ పనులను కూడా మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.  ఇందులో రూ.36 లక్షలను హెచ్‌ఆర్‌డీ అధికారులు రైల్వే అధికారులకు చెల్లించారు. అప్పటి ట్రాఫిక్‌ రద్దీకి అనుగుణంగా నిర్మించిన ఫతేనగర్‌ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిపై ప్రస్తుతం వాహనదారులు  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో రెండు లేన్లుగా ఈ బ్రిడ్జిని విస్తరించడం ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించవచ్చన్న భావనలో ఉన్న ప్రభుత్వం ఈ పనులకు పూనుకుంది. 


ప్రస్తుతం సనత్‌నగర్‌ ప్రాంత ప్రజలు నర్సాపూర్‌ చౌరస్తా, జీడిమెట్లకు వెళ్లాలన్నా, జీడిమెట్ల నుంచి సనత్‌నగర్‌ వైపునకు రావాలన్నా ఫతేనగర్‌ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి మీదుగా సుమారు ఆరు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తున్నది. ఈ ఆర్‌యూబీ నిర్మాణంతో కేవలం 1.8 కిలో మీటర్లు ప్రయాణించి తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. దూరభారం తగ్గడమే కాకుండా ఫతేనగర్‌ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిపై ట్రాఫిక్‌ రద్దీ గణనీయంగా తగ్గనుంది. గడిచిన 30 ఏండ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్న సనత్‌నగర్‌ ప్రాంత వాసులు ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దృష్టికి తీసుకు వెళ్లారు. 


ఆర్‌యూబీ నిర్మాణం చేపట్టాలన్న విజ్ఞప్తి మేరకు స్పందించిన మంత్రి తలసాని మే 15న మేయర్‌ బొంతు రాంమోహన్‌, హెచ్‌ఆర్‌డీ, రైల్వే అధికారులతో కలిసి ఆర్‌యూబీ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఆర్‌యూబీ నిర్మాణ ప్రాధాన్యాన్ని మంత్రి తలసాని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌తో చర్చించి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ఆర్‌యూబీ నిర్మాణ పనులకు సంబంధించి ఇప్పటికే హెచ్‌ఆర్‌డీ అధికారులు రైల్వే అధికారులకు రూ.89.70 లక్షలు చెల్లించారు. 


logo