మంగళవారం 19 జనవరి 2021
Telangana - Jan 12, 2021 , 12:06:21

భ‌విష్య‌త్‌లో నీటి క‌ష్టాలుండ‌వు : మ‌ంత్రి కేటీఆర్

భ‌విష్య‌త్‌లో నీటి క‌ష్టాలుండ‌వు : మ‌ంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : గ‌్రేట‌ర్ ప‌రిధిలోని రహ్మత్‌నగర్‌లోని ఎస్‌పీఆర్‌ హిల్స్‌లో ఉచిత తాగునీటి ప‌థ‌కాన్ని రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ఇంటింటికి తిరిగి జీరో నీటి బిల్లుల‌ను పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు మ‌హ‌ముద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, మ‌ల్లారెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ పాల్గొన్నారు. 

ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేటీఆర్ ప్ర‌సంగించారు. హైద‌రాబాద్‌కు రెండు రోజుల ముందే సంక్రాంతి పండుగ వ‌చ్చింది. తాను చ‌దువుకునే రోజుల్లో తాగునీటి కోసం ఖాళీ బిందెల‌తో మ‌హిళ‌లు.. జ‌ల మండ‌లి ముందు ధ‌ర్నా చేసేవారు. ప్ర‌స్తుతం ఉచితంగా తాగునీరు అందించే స్థాయికి చేరుకున్నామ‌ని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు ఇవాళ ఉచిత తాగునీటి ప‌థ‌కాన్ని ప్రారంభించుకున్నామ‌ని పేర్కొన్నారు. ఇంటింటికి తిరిగి జీరో నీటి బిల్లులు ఇచ్చామ‌ని చెప్పారు. డిసెంబ‌ర్ న‌ల్లా బిల్లు క‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు అని కేటీఆర్ తెలిపారు. 

గ్రేట‌ర్ ప‌రిధిలో 9 ల‌క్ష‌ల పైచిలుకు కుటుంబాల‌కు ఉచిత తాగునీటి ప‌థ‌కం ద్వారా ల‌బ్ది చేకూరుతుంద‌న్నారు. ర‌హ్మ‌త్‌న‌గ‌ర్‌లో దోబీఘాట్ క‌ట్టిస్తామ‌న్నారు. 2048 వ‌ర‌కు హైద‌రాబాద్‌లో తాగునీటి క‌ష్టాలు లేకుండా ఏర్పాట్లు చేశామ‌న్నారు. 9,714 కోట్ల‌తో ల‌క్ష డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను నిర్మించామ‌ని తెలిపారు. 

పేద‌లంతా అభివృద్ధి చెందాలి..

కుల‌మ‌తాల‌కు అతీతంగా పేద‌లంతా అభివృద్ధి చెందాల‌న్న‌దే టీఆర్ఎస్ ధ్యేయ‌మ‌ని తేల్చిచెప్పారు. బ‌స్తీల్లోని పేద‌ల కోసం అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించామ‌న్నారు. బ‌ల‌హీన వ‌ర్గాల పిల్ల‌ల‌ను విదేశాల‌కు పంపి చ‌దివిస్తున్నామ‌ని గుర్తు చేశారు. రాష్ర్టంలోని బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు అండ‌గా ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు. 

ఏడేళ్ల కేసీఆర్ పాల‌న స్వ‌ర్ణ‌యుగం

క‌రోనా సంక్షోభంలోనూ సంక్షేమం ఆగ‌లేదు. ఏ ప‌థ‌కం కూడా ఆగ‌లేదు. కేసీఆర్ నాయ‌క‌త్వంలో సంక్షేమ రంగంలో స్వ‌ర్ణ‌యుగం వ‌చ్చింది. ప్ర‌భుత్వంపై రూ. 500 కోట్ల భారం ప‌డినా పేద‌ల కోసం భ‌రిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అధికారంలోకి రాకముందు అనేక క‌ష్టాలు ఉండేవి. త‌మ ఏడేండ్ల పాల‌న‌లో ప‌న్నులు పెంచ‌లేదు. రిజిస్ర్టేష‌న్‌, క‌రెంట్ బిల్లులు, ఇంటి ప‌న్నులు పెంచ‌లేదు. రాష్ర్ట ఆదాయాన్ని పెంచుతూ దాన్ని పేద‌ల‌కు పంచుతున్నామ‌ని తెలిపారు. ఎన్నిక‌లు లేన‌ప్పుడూ కూడా ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటూ సేవ చేస్తున్నామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.