శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 12, 2020 , 10:43:01

కంప్యాక్ట‌ర్ వాహ‌నాల‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

కంప్యాక్ట‌ర్ వాహ‌నాల‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌ : ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నిర్మాణ వ్యర్థాలు తరలించే ఆధునిక (కాంప్యాక్టర్‌) స్వచ్ఛ వాహనాలను, సంజీవయ్యపార్కు వద్ద ఆధునిక చెత్త ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ గురువారం ఉద‌యం ప్రారంభించారు. నెక్లెస్‌ రోడ్డు వద్ద మంత్రి కేటీఆర్ జెండా ఊపి స్వచ్ఛ వాహనాలను ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు మ‌హ‌ముద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌తో పాటు ప‌లువురు ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

కంప్యాక్టర్‌ వాహనాల ద్వారా భవన నిర్మాణాల వ్యర్థాలను తరలించనున్నారు. ఇందు కోసం జీహెచ్‌ఎంసీ 50 వాహనాలను ఏర్పాటు చేసింది. ఒక్కో వాహన సామర్థ్యం 20 క్యూబిక్‌ మీటర్లు కాగా, అందులో 15 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలను తరలించవచ్చు. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ నిబంధనల ప్రకారం వ్యర్థాలను పూర్తిగా కప్పి ఉన్న వాహనంలోనే తరలించాలి. ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల వద్ద సైతం చెత్త కనిపించకుండా తగిన ఏర్పాట్లు చేయాలి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కాంట్రాక్టు సంస్థ రాంకీ ఎన్వీరో సంయుక్తంగా పలు ఆధునిక విధానాలను చేపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆధునిక కాంప్యాక్టర్‌ వాహనాలు, చెత్త ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ను అందుబాటులోకి తెచ్చారు.