గురువారం 21 జనవరి 2021
Telangana - Dec 06, 2020 , 01:13:48

రాష్ట్రమంతా ఐటీ విస్తరణ

రాష్ట్రమంతా ఐటీ విస్తరణ

  • రేపు ఖమ్మంలో ఐటీ టవర్‌ ప్రారంభం
  • త్వరలో కొంపల్లిలో ఐటీ పార్క్‌కు శంకుస్థాపన
  • వరంగల్‌ నగరానికి మరిన్ని ఐటీ కంపెనీల రాక
  • మహబూబ్‌నగర్‌పై కూడా పలు సంస్థల ఆసక్తి
  • ఈవోడీబీలో అగ్రస్థానమే లక్ష్యంగా  కృషి
  • ఐటీ, పరిశ్రమలశాఖపై సమీక్షలో మంత్రి కేటీఆర్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఐటీ పరిశ్రమను హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలతోపాటు రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణినగరాలకు విస్తరించేందుకు వేగంగా చర్యలు తీసుకొంటున్నట్టు ఐటీ పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఐటీ విస్తరణకోసం వేగంగా అడుగులు పడుతున్నాయని చెప్పారు. వివిధ నగరాలకు ఐటీ విస్తరణ, పరిశ్రమల రాక.. మౌలిక సౌకర్యాల కల్పన తదితర అంశాలపై శనివారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు,  పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఇప్పటికే వరంగల్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం నగరాలకు ఐటీ పరిశ్రమ విస్తరించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లుచేస్తున్నామని పేర్కొన్నారు.  సోమవారం ఖమ్మంలో ఐటీ టవర్‌ను ప్రారంభిస్తున్నామని ఆయన వెల్లడించారు. వరంగల్‌లో ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని, రెండో దశలో మరిన్ని ఐటీ కంపెనీలు వరంగల్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా  ఉన్నాయని పేర్కొన్నారు. వీటికి అవసరమైన మౌలిక వసతులను, ఇతర సదుపాయాల కల్పన విషయంలో టీఎస్‌ఐఐసీ కార్యాచరణపై వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ఒకటి, రెండు ప్రముఖ కంపెనీలు త్వరలో వరంగల్‌ నగరానికి వస్తాయని ఆ కంపెనీలతో ఐటీశాఖ చర్చలు జరిపిందన్నారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దివిటిపల్లి ప్రాంతంలో అనేక ఐటీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని, వాటికి సంబంధించి కూడా పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.  

హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాల్లో విస్తరణ 

ద్వితీయ శ్రేణి నగరాలతోపాటు హైదరాబాద్‌ మహానగరంలోని ఇతర ప్రాంతాలకు ఐటీ పరిశ్రమ విస్తరించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ‘గ్రోత్‌ ఇన్‌ డిస్పర్షన్‌ (గ్రిడ్‌) పాలసీకి మంచి స్పందన వస్తున్నదని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఉప్పల్‌, నాచారం వంటి ఇండస్ట్రియల్‌ ఏరియాల్లో ఐటీ పార్కుల నిర్మాణానికి సంబంధించి జరుగుతున్న కార్యాచరణ పురోగతిపై ఆయన అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి తమ ఆసక్తిని తెలియజేసిన కంపెనీల, ఐటీ పార్కులు నిర్మించేందుకు అవసరమైన సంపూర్ణ సహకారాన్ని ప్రభుత్వం తరఫున ఆయా కంపెనీలకు అందించాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ని కోరారు. దీంతోపాటు కొంపల్లి ప్రాంతంలో ఒక ఐటీ పార్క్‌ నిర్మాణానికి సంబంధించిన అవసరమైన భూసేకరణ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని టీఎస్‌ఐఐసీ ఎండీ. నర్సింహారెడ్డిని మంత్రి ఆదేశించారు. ఇప్పటికే జిల్లా రెవెన్యూ యంత్రాంగంతోపాటు హెచ్‌ఎండీఏ సహకారంతో కొంపల్లిలో ఐటీ పార్క్‌ కోసం స్థలాన్ని గుర్తించామని, త్వరలోనే అక్కడ శంకుస్థాపన చేసేందుకు సిద్ధంచేస్తామని నర్సింహారెడ్డి మంత్రి కేటీఆర్‌కు వివరించారు. 


ర్యాంకింగ్‌లో అగ్రస్థానం కోసం 

పరిశ్రమలశాఖ ఇప్పటికే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్‌లో అగ్రస్థానాన్ని సాధించేందుకు కసరత్తు చేస్తున్నదని పరిశ్రమలశాఖ కమిషనర్‌ మాణిక్‌రాజ్‌.. మంత్రి కేటీఆర్‌కు వివరించారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీతోపాటు ఇక్కడి నాయకత్వం పరిశ్రమల విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణకు ఎప్పుడూ ప్రాధాన్యమిస్తుందని, ఇక్కడి వాతావరణం పెట్టుబడులకు అత్యంత స్నేహపూర్వకంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. గతేడాది కొన్ని సాంకేతిక కారణాల వల్ల తక్కువ ర్యాంక్‌ వచ్చిన నేపథ్యంలో ఈసారి అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌కు సూచించారు. ఈ మేరకు ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్‌ కోసం అవసరమైన అన్ని సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలుచేస్తున్న విషయాన్ని మంత్రి కేటీఆర్‌కు  పరిశ్రమలశాఖ కమిషనర్‌ తెలియజేశారు. కచ్చితంగా ఈసారి ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్‌లో రాష్ట్రం మంచి స్థానాన్ని సాధిస్తుందని ఆయన మంత్రి కేటీఆర్‌కు తెలిపారు.

రేపు ఖమ్మంలో పర్యటన

ఖమ్మం జిల్లాలో నూతనంగా నిర్మించిన ఐటీ టవర్‌ను సోమవారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. దీంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారనిచెప్పారు. ఇల్లెందు సర్కిల్‌ వద్ద ఐటీ హబ్‌ను ప్రారంభించి అక్కడే ఏర్పాటుచేసిన సభలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగిస్తారన్నారు. 


logo