బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 03:14:32

పాతబస్తీకి కొత్తందాలు

పాతబస్తీకి కొత్తందాలు

  • మూసీకి ఇరువైపులా నాలుగులేన్ల రోడ్డు
  • హైదరాబాద్‌లో ఇంటిగ్రేటెడ్‌ మోడల్‌ మార్కెట్లు
  • పాతబస్తీ అభివృద్ధిపై సమీక్షలో మంత్రి  కేటీఆర్‌

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఈస్ట్‌-వెస్ట్‌ కారిడార్‌లో భాగంగా మూసీనదికి ఇరువైపులా నాలుగులేన్ల రోడ్డు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నదని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పా రు. స్థలాల అందుబాటునుబట్టి హైదరాబాద్‌లో గజ్వేల్‌ తరహాలో ఇంటిగ్రేటెడ్‌ మోడల్‌ మార్కెట్లు, వాక్యూమ్‌ డీవాటర్డ్‌ సిమెంట్‌ కాంక్రీట్‌ (వీడీసీసీ) రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధంచేయాలని సూచించారు. పాతబస్తీలో చేపట్టిన అభివృద్ధి పనులపై మంత్రి కేటీఆర్‌ బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో స్థానిక ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీతో కలిసి అధికారులతో సమీక్షించారు. 

హైదరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక (ఎస్సార్డీపీ) కింద చేపట్టిన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, పాదచారుల వంతెనలు, రోడ్ల విస్తరణ తదితర పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. మంచినీటి సరఫరా పైప్‌లైన్ల నిర్వహణ, క్రీడా మైదానాలు, మెట్రోలైను నిర్మాణం, నాలాల విస్తరణ, ఎస్సార్డీపీ ప్రాజెక్టులు తదితరవాటికి అవసరమైన భూసేకరణ వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియలో వేగం పెంచేందుకు ఓ అధికారిని నియమించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు సూచించారు. రోడ్ల విస్తరణ కోసం ఆస్తులిచ్చేందుకు ముందుకొచ్చేవారికి వెంటనే నష్టపరిహారం చెల్లించి స్థలాలు స్వాధీనం చేసుకోవాలని చెప్పారు. ఇందుకు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల సహకారం తీసుకోవాలని పేర్కొన్నారు. 

మురుగు వ్యవస్థ ఆధునీకరణకు రూ.200 కోట్లు

తాగునీటి సరఫరాలో పైప్‌లైన్ల లీకేజీతో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. పాడైన పైప్‌లైన్ల స్థానంలో, చివరి ప్రాంతాలకు తాగునీటి సరఫరా కోసం కొత్త పైప్‌లైన్లు వేయాలని చెప్పారు. మురుగునీటిపారుదల వ్యవస్థ ఆధునీకరణలో భాగంగా నాలాల విస్తరణకు ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరుచేసిందని ఆయన తెలిపారు. ప్రజకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో పార్కుల్లో ఓపెన్‌ జిమ్‌లను ఏర్పాటుచేయాలని సూచించారు. లేఔట్‌ ఓపెన్‌ స్పేస్‌లు, పార్కుల్లో పబ్లిక్‌, షీ టాయిలెట్లు నిర్మించాలని ఆదేశించారు. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో మజ్లిస్‌ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, వాటర్‌బోర్డు ఎండీ దానకిశోర్‌ తదితరులు పాల్గొన్నారు. 

కేటీఆర్‌తో మంత్రుల భేటీ

మంత్రులు ఈటల, సబితారెడ్డి, సత్యవతి రాథోడ్‌.. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. అనంతరం టీఎస్‌పీఎస్సీ అధికారులు, సిరిసిల్లకు చెందిన పార్టీ కార్యకర్తలు కేటీఆర్‌ను కలిశారు.


logo