బుధవారం 03 జూన్ 2020
Telangana - May 15, 2020 , 02:20:42

వచ్చే నెలే టీఎస్‌ బీపాస్‌

వచ్చే నెలే టీఎస్‌ బీపాస్‌

  • అన్ని నగరాలు, మున్సిపాలిటీల్లో అమల్లోకి
  • ఆన్‌లైన్‌లో అనుమతులకు చర్యలు
  • పక్షంరోజుల్లో కార్యాచరణ
  • మంత్రి కే తారకరామారావు ఆదేశం
  • సందేహాల నివృత్తికి టోల్‌ఫ్రీ నంబర్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: భవన నిర్మాణాలకు సులభంగా అనుమతినిచ్చే టీఎస్‌ బీపాస్‌ వ్యవస్థను జూన్‌ మొదటివారం నుంచి జీహెచ్‌ఎంసీతో సహా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. ఆయన గురువారం ఏసీ గార్డ్స్‌లోని మున్సిపల్‌ కాంప్లెక్స్‌లో పురపాలక శాఖ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులతో టీఎస్‌ బీపాస్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీఎస్‌ బీపాస్‌ వ్యవస్థలో భాగస్వామ్యులైన సిబ్బందికి శిక్షణ, అవగాహన కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలని సూచించారు. ఇందుకోసం ఒకట్రెండు రోజుల్లోనే జీహెచ్‌ఎంసీ పరిధిలోని జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగం, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేయాలని మంత్రి ఆదేశించారు. ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక ప్రజలు ఆన్‌లైన్‌లో అనుమతులుపొందేలా చర్యలు చేపట్టాలన్నారు. 

ఇందుకోసం మీ సేవ సెంటర్లతోపాటు పౌర సేవ కేంద్రాలు, వ్యక్తిగతంగా ఇంటర్నెట్‌ ద్వారా కానీ మొబైల్‌ యాప్‌ ద్వారా కానీ, ఇవేవీ అందుబాటులో లేకుంటే నేరుగా కానీ దరఖాస్తు చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పౌరులు ఎవరైనా దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులు ఎదుర్కొంటే అధికారులను సంప్రదించేందుకు ప్రత్యేక కాల్‌సెంటర్‌ను, లేదా పౌరులకు  అందుబాటులో ఉండే వ్యవస్థను తయారుచేయాలని తెలిపారు. ప్రస్తుతమున్న సాఫ్ట్‌వేర్‌పై సంతృప్తి వ్యక్తంచేసిన మంత్రి కేటీఆర్‌ క్షేత్రస్థాయినుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా మరింత సులభతరం చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని అధికారులకు సూచించారు. 

మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ.. టీఎస్‌ బీపాస్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయడానికి తనిఖీ బృందాలను రెండు రోజుల్లో ఏర్పాటుచేయాలని ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన రాష్ట్రంలోని అదనపు కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, టౌన్‌ప్లానింగ్‌ అధికారులతో  వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. టీఎస్‌బీపాస్‌పై ఎలాంటి సందేహాలున్నా 040-22666666 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీటీసీపీ డైరెక్టర్‌ కే విద్యాధర్‌ తదతరులు పాల్గొన్నారు.


87 మున్సిపాలిటీలు.. 1100 దరఖాస్తులు

ఈ సందర్భంగా 87 మున్సిపాలిటీల్లో టీఎస్‌ బీపాస్‌ విధానం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టామని, ప్రస్తుతం ఆయా మున్సిపాలిటీల నుంచి వస్తున్న దరఖాస్తులను పరిశీలిస్తున్నామని, కొన్నింటికి ఇప్పటికే అనుమతులిచ్చామని పురపాలకశాఖ అధికారులు మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. టీఎస్‌ బీపాస్‌ ద్వారా 1100 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ప్రస్తుతమున్న సాఫ్ట్‌వేర్‌, సపోర్టు వ్యవస్థకు సంబంధించిన కీలకమైన ఫీడ్‌బ్యాక్‌ క్షేత్రస్థాయి నుంచి లభించిందని, వచ్చే 15 రోజుల్లో వీటన్నింటినీ ప్రస్తుత వ్యవస్థకు అనుగుణంగా అవసరమైన కార్యాచరణ చేపడుతామని తెలిపారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌తోపాటు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, సీడీఎంఏ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

దేశంలోనే ప్రప్రథమం

ఏ రాష్ట్రంలోనూ 21 రోజుల్లోనే ఇంటి నిర్మాణాలకు అనుమతినిచ్చే విధానం ఇంతవరకూ ఆరంభం కాలేదు. టీఎస్‌ బీపాస్‌ను అమల్లోకి తెచ్చేందుకు మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ భూములు, వక్ఫ్‌ స్థలాలు, లేఅవుట్లు, ఎల్‌ఆర్‌ఎస్‌, మంచినీటి కుంటలు.. ఇలా అన్నింటి వివరాలతో డీటీసీపీ (డైరెక్టర్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌) ఒక జాబితా రూపొందించింది. ఈ మొత్తం సమాచారాన్ని ప్రస్తుతం ఇంటిగ్రేట్‌ చేశారు. దీంతో, టీఎస్‌-బీపాస్‌కు సంబంధించిన ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. టీఎస్‌ బీపాస్‌కు సంబంధించిన దరఖాస్తు పత్రాన్ని ఇప్పటికే డీటీసీపీ సిద్ధం చేసింది. 

వాణిజ్య భవనాలు, బహుళ అంతస్తుల అపార్టుమెంట్లు, అపార్టుమెంట్‌ కాంప్లెక్సులు, మల్టీప్లెక్స్‌ థియేటర్లు, నివాసేతర భవనాలకు సులువుగా అనుమతి, ఎన్వోసీ  (నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం)లను అందజేస్తారు. ఇందుకోసం ప్రతి జిల్లాలో కలెక్టర్‌ నేతృత్వంలో సింగిల్‌విండో కమిటీ ఏర్పాటుచేస్తారు. వెయ్యి చదరపు మీటర్లు లేదా అంతకంటే అధిక విస్తీర్ణంలో భవనాలను నిర్మిస్తే.. అందుకు సంబంధించి సాంకేతిక అంశాలను పరిశీలించేందుకు దరఖాస్తు పత్రం డీటీసీపీకు వెళుతుంది. ఆయా వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాక స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌ ద్వారా అనుమతి ఇస్తారు.

టీఎస్‌ బీపాస్‌ ప్రత్యేకతలివి..

  • ఆధునిక పరిజ్ఞానం అందుబాటులో ఉండటంతో ఫీజులు సులువుగా చెల్లించవచ్చు. క్రెడిట్‌ కార్డుల ద్వారా ఫీజుల చెల్లింపు, ఆర్టీజీఎస్‌, గూగుల్‌ పే వంటివి అందుబాటులో ఉండటంతో స్థానిక సంస్థలకు సులువుగా రుసుములు చెల్లించవచ్చు. 
  • ఇంటి అనుమతి కావాలని కోరుకునేవారు.. ఇల్లు లేదా ఆఫీసు నుంచే ఇంటి డ్రాయింగులకు సంబంధించిన స్కానింగ్‌ పనులను చేసుకోవచ్చు. 
  • వేగంగా నిర్మాణాలు పూర్తయితే ప్రాజెక్టు వ్యయం తగ్గుతుంది. ప్రజలకు చౌక ధరకే ఫ్లాట్లు లభిస్తాయి. 
  • 21 రోజుల్లో అనుమతులు లభిస్తే.. నిర్మాణాలు త్వరగా పూర్తిచేయడానికి వీలుంటుంది. కొనుగోళ్ల శాతమూ పెరుగుతుంది. 


logo