శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 05, 2020 , 01:51:21

సమన్వయంతో ముందుకు

సమన్వయంతో ముందుకు

  • ఆర్వోబీ, ఆర్‌యూబీల నిర్మాణం పూర్తిచేద్దాం
  • రైల్వే అధికారులను కోరిన మంత్రి కేటీఆర్‌
  • జీహెచ్‌ఎంసీ పరిధిలోని పనులపై సమీక్ష 

హైదరాబాద్‌/ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైదరాబాద్‌ పరిధిలో చేపట్టిన రైల్వే బ్రిడ్జిల పనులను సమన్వయంతో వ్యవహరించి వేగంగా పూర్తిచేసేందుకు కృషిచేద్దామని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు రైల్వేశాఖ అధికారులను కోరారు. జీహెచ్‌ఎంసీ రోడ్డు పనులతోపాటు హైదరాబాద్‌ జలమండలికి సంబంధించి మౌలిక ప్రాజెక్టుల పనులు దక్షిణ మధ్యరైల్వేతో ముడిపడి ఉన్న నేపథ్యంలో సోమవారం జీహెచ్‌ఎంసీ కమాండ్‌ కంట్రోల్‌ రూంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా , ఇతర అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. నగర పరిధిలో రోడ్డు విస్తరణ, లింక్‌రోడ్లు, స్లిప్‌ రోడ్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే పరిధిలో ఉన్న పనుల్లో వేగాన్ని పెంచేందుకు కృషిచేయాలని చెప్పారు. 

ప్రస్తుతం లాక్‌డౌన్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎస్సార్డీపీ, సీఆర్‌ఎంపీ, స్లిప్‌ లింకు రోడ్డు పనులను పూర్తిచేసేందుకు యత్నిస్తున్నట్టు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పలుచోట్ల రైల్వే ఓవర్‌ బ్రిడ్జి, రైల్వేఅండర్‌ బ్రిడ్జిలకు సంబంధించిన పనులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆయా పనులను పూర్తిచేసేందుకు దక్షిణ మధ్య రైల్వే సహకారం కావాలని మంత్రి కోరారు. వచ్చే వర్షాకాలంలోగా సాధ్యమైనన్నిఎక్కువచోట్ల ఈ పనులను పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. ఆర్వోబీ, ఆర్‌యూబీల పూర్తికి చేపట్టే పనులకు అవసరమైన అన్నిరకాల అనుమతులను ప్రాధాన్యంగా గుర్తించి జారీచేయనున్నట్టు చెప్పారు.

భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్తగా ప్రతిపాదిస్తున్న స్లిప్‌ , లింక్‌రోడ్లు విస్తరణ, ఆర్వోబీలపై రైల్వే అధికారులతో కలిసి సర్వే నిర్వహించాలని సూచించారు. దక్షిణ మధ్య రైల్వేతో సమన్వయానికి పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ను నియమిస్తున్నట్టు తెలిపారు. రైల్వేక్రాసింగ్స్‌ వద్ద ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై నిపుణులు కమిటీని ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, జలమండలి ఎండీ దానకిశోర్‌, చీఫ్‌ ఇంజినీర్‌ వసంత తదితరులు పాల్గొన్నారు.logo