మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Sep 26, 2020 , 12:04:02

ఆస్తుల న‌మోదులో ద‌ళారుల‌ను న‌మ్మొద్దు : మ‌ంత్రి కేటీఆర్

ఆస్తుల న‌మోదులో ద‌ళారుల‌ను న‌మ్మొద్దు : మ‌ంత్రి కేటీఆర్

  • అవినీతిని అంతం చేసేందుకే కొత్త రెవెన్యూ చ‌ట్టం
  • ఆక‌ర్ష‌ణీయ గ‌మ్య‌స్థానంగా హైద‌రాబాద్
  • హైద‌రాబాద్‌లో సుమారు 24.50 ల‌క్ష‌ల ఆస్తులు ఉన్న‌ట్లు అంచనా 

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో భూ వివాదాల‌ను శాశ్వ‌తంగా ప‌రిష్కారించాల‌నే సంక‌ల్పంతో ప్ర‌భుత్వం కొత్త రెవెన్యూ చ‌ట్టాన్ని తీసుకువచ్చింద‌ని రాష్‌ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.   హైదరాబాద్ ప్రజలు నిశ్చింతగా వారి ఆస్తి హక్కులను పొందేలా, సమస్యలను పరిష్కరించేలా, పేద, మధ్యతరగతి ప్రజలకు వారి ఆస్తుల పట్ల హక్కులు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నాము. ప్రభుత్వానికి ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదు.. ఆస్తుల న‌మోదుకు సంబంధించి ద‌ళారుల‌ను న‌మ్మొద్దు.. ఎవ‌రికీ ఒక్క పైసా కూడా ఇవ్వొద్ద‌ని కేటీఆర్ సూచించారు. ఈ మొత్తం ప్రక్రియ పారదర్శకంగా, ఉచితంగా జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సామాన్యుడిపై ఏలాంటి భారం పడకుండా సామాన్యుడికి అండగా ఉంటూ అవినీతికి పాతర వేస్తూ నూతన చట్టానికి ఆమోదం తీసుకున్నాము అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.


జీహెచ్ఎంపీ ప్ర‌ధాన కార్యాల‌యం నుంచి గ్రేట‌ర్ ప‌రిధిలోని రెవెన్యూ స‌మ‌స్య‌ల‌పై మంత్రి కేటీఆర్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మీక్షా స‌మావేశానికి మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, క‌మిష‌న‌ర్ లోకేశ్ కుమార్, హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్ శ్వేతా మ‌హంతి హాజ‌ర‌య్యారు. వివిధ నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేలు, కాల‌నీ సంఘాల ప్ర‌తినిధుల‌తో మంత్రి వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి చ‌ర్చించారు. 

హైద‌రాబాద్ గ‌త ఆరేళ్ల‌లో దేశంలోని ల‌క్ష‌లాది మందికి ఆక‌ర్ష‌ణీయ‌ గ‌మ్య‌స్థానంగా మారింద‌ని కేటీఆర్ తెలిపారు. ఒకవైపు పెట్టుబడులు మరోవైపు పరిపాలనా సంస్కరణలు, రాజకీయ స్థిరత్వంతో పెద్ద ఎత్తున హైదరాబాద్ విస్తరిస్తోంది. కొత్త రెవెన్యూ చ‌ట్టంతో ఎవ‌రికీ ఇబ్బందులు లేకుండా చేస్తామ‌న్నారు. సాగు భూముల‌పై హ‌క్కులు క‌ల్పించాల‌నే ల‌క్ష్యంతో ముందుకెళ్తున్నామ‌ని మంత్రి ఉద్ఘాటించారు. భ‌విష్య‌త్‌లో అన్ని రిజిస్ర్టేష‌న్లు ధ‌ర‌ణి పోర్ట‌ల్ ఆధారంగానే జ‌రుగుతాయ‌ని స్ప‌ష్టం చేశారు. వ్య‌వ‌సాయ‌, వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల‌కు వేర్వేరు రంగుల్లో పాసుపుస్త‌కాల‌ను ఇస్తామ‌ని చెప్పారు. హైద‌రాబాద్‌లో సుమారు 24.50 ల‌క్ష‌ల ఆస్తులు ఉన్న‌ట్లు అంచనా వేశామ‌ని మంత్రి తెలిపారు. ప్ర‌జ‌లు నిశ్చింత‌గా వారి ఆస్తిపై హ‌క్కుల‌ను పొందేలా ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని చెప్పారు. భ‌విష్య‌త్‌లో ఆస్తుల క్ర‌య‌విక్ర‌యాల్లో ఇబ్బందులు లేకుండా చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇందుకోసం శాశ్వత పరిష్కారం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. రానున్న 15 రోజుల పాటు ధరణి పోర్టల్ లో ఆస్తుల నమోదు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా చురుగ్గా పాల్గొనాలి అని కేటీఆర్ ఆదేశించారు.