బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 22, 2020 , 21:31:03

'దె‌య్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లుంది బీజేపీ తీరు'

'దె‌య్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లుంది బీజేపీ తీరు'

హైద‌రాబాద్ : ఆరేండ్ల టీఆర్ఎస్ పాల‌న‌పై బీజేపీ చార్జిషీట్ విడుద‌ల చేసిందని.. బీజేపీ తీరు ఎలా ఉందంటే.. ద‌య్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లుంద‌ని రాష్ర్ట మంత్రి కేటీఆర్ అన్నారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో భాగంగా జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం యూసుఫ్‌గూడలో కేటీఆర్‌ ఎన్నికల ప్రచారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. యూసుఫ్‌గూడ కార్పొరేటర్‌గా రాజ్‌కుమార్‌ పటేల్‌ను, వెంగళ్‌రావునగర్‌ నుంచి దేదీప్యారావు, షేక్‌పేట్‌ నుంచి సత్యనారాయణ యాదవ్‌, సోమాజీగూడ నుంచి వనం సంగీత శ్రీనివాస్‌ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా అభ్య‌ర్థించారు. రాష్ట్రం ఏర్పడేనాటికి ఆంధ్రా, తెలంగాణ పంచాయతీ అయితదా? హైదరాబాద్‌లో కరెంట్‌ ఉంటదా? ఉద్యోగాలు వస్తాయా? పెట్టుబడులు కొత్తవి కాదుకదా.. ఉన్నవి కూడా పోతయట అని ఇలా నానా రకాలుగా ఆనాడు ప్రచారం చేశారు. మంచినీళ్లకు ఎంత గోస ఉండె. వారం, పద్నాలుగు రోజులకు కూడా నీళ్లు రాని పరిస్థితి చూశాం. ఆనాడు కరెంటు ఉంటే వార్తా. 

ఆరేండ్ల తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతుందన్నారు. కరెంట్‌ పరిష్కారం అయింది. మంచినీళ్ల సమస్య పరిష్కారం అయింది. ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేసుకుంటున్నమ‌న్నారు. పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, కేసీఆర్‌ కిట్‌, అన్నపూర్ణ సెంటర్ల ద్వారా రూ. 5కే భోజనం. పేదవాడికి సుస్తీ చేస్తే బస్తీ దావాఖానాల‌ ‌ఏర్పాటు, సీసీ టీవీ కెమెరాలు, ఎల్‌ఈడీ లైట్లు, షీటీమ్స్‌, భరోసా సెంటర్లు ఏర్పాటు చేసుకుని ఆడబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ర్టం దూసుకుపోతుంటే కేంద్రం సాయం చేయాల్సిందిపోయి అడిగినా క‌నిక‌రం చూప‌లేద‌న్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో ఈ ఆరేండ్లలో కనీసం రూ.6 రూపాయల పనియైనా కేంద్రం చేసిందా అని ప్ర‌శ్నించారు. దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది బీజేపీ నేతల తీరు అని పేర్కొన్నారు.