సంజయ్..మెదడుందా?

- సర్జికల్ స్ట్రైక్ ఎవరిపైన చేస్తారో తెలుసా?
- హైదరాబాద్‌లో అరాచకం సృష్టిస్తారా?
- పచ్చని నగరాన్ని పాకిస్తాన్‌తో పోలుస్తారా?
- హైదరాబాద్ దేశ సరిహద్దుల్లో లేదు
- మీ పాలనపై ప్రజలే సర్జికల్స్ట్రైక్చేస్తారు
- బండి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ‘జీహెచ్ఎంసీలో గెలిస్తే ఏం అభివృద్ధి చేస్తరో చెప్పమంటే.. సర్జికల్ స్ట్రైక్ చేస్తమంటున్నరు.. సోయి ఉన్న మాటేనా? మా హైదరాబాద్ ప్రజలపై సర్జికల్ స్ట్రైకా? ఓట్ల కోసం కోటి మంది హైదరాబాదీలను బలి తీసుకుంటారా?’ అని పురపాలకశాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌పై సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో సర్జికల్ స్ట్రైక్‌లు మాని.. దేశంలోని పేదరికం, అరాచకాలపైనా చేయాలని హితవు పలికారు. దమ్మున్న నాయకుడు కేసీఆర్ పాలనలోనే రాష్ట్రంలో శాంతియుతమైన హైదరాబాద్ సాధ్యమన్నారు. మనకు మతం ప్రధానం కాదని.. జనహితం ముఖ్యమన్నారు. మంగళవారం జీహెచ్ఎంసీ ప్రచారంలో భాగంగా గాంధీనగర్, రాంనగర్, బాగ్‌లింగంపల్లి చౌరస్తా, పటేల్‌నగర్ చౌరస్తాల్లో రోడ్‌షోల్లో పాల్గొన్నారు.
ఇది అహ్మదాబాద్ కాదు..
బీజేపీ నేతలకు విజన్ అనే పదానికి విలువ తెలిసి ఉంటే.. పేదరికంపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘నేను అడుగుతున్నా బీజేపీ ప్రభుత్వాన్ని.. దమ్ముంటే పేదరికంమీద, నిరుద్యోగంపైన, మత విద్వేషాలపైన, ఉత్తరప్రదేశ్‌లో ఆడబిడ్డలపైన దుర్మార్గం చేసిన వాళ్లపైన సర్జికల్ స్ట్రైక్ చేయ్యండి. తప్పుడు నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసినవారిపై చేయండి. అంతేకానీ మీ సొల్లుమాటలతో ఆగమాగం అయితందుకు ఇది అహ్మదాబాద్కాదు.. హుషార్ హైదరాబాద్.. ఇగ బండ్లమీద అడ్డగోలుగా తిరుగున్రి.. చలాన్లు మేం కడతం అని చెప్తున్నరు. ఒకాయన.. అసలు ఆ రూల్స్ తెచ్చిందే మీ మంత్రి నితిన్‌గడ్కరీ.. దానికి ఓటువేసి పాస్చేయించిందే మీ ఎంపీలు.. కనీసం ఆ చట్టం గురించి కూడా తెలియకుండా ఇప్పుడు మాట్లాడుతున్నరు’ అని విమర్శించారు. తన ట్విట్టర్ ఖాతాలోనూ మంత్రి కేటీఆర్ బీజేపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఓట్ల కోసం బండి సంజయ్ దిగజారి మాట్లాడుతున్నాడు. నాలుగు ఓట్ల కోసం ఇంతలా దిగజారాలా? కొన్ని ఓట్లు, సీట్ల కోసం మతిస్థిమితం కోల్పోయి బండి సంజయ్ మాట్లాడుతున్నాడు. పూలబోకేలాంటి హైదరాబాద్‌ను విచ్ఛినం చేయాలని చూస్తున్నాడు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉన్నది. చిచ్చుపెట్టాలని చూడొద్దు. సహచర ఎంపీ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సమర్థిస్తారా?’ అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
ప్రజలు అప్రమత్తం కావాలి
- జీహెచ్ఎంసీ మేయర్ బొంతు
బల్దియా ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ చౌకబారు రాజకీయాలు చేస్తున్నదని నగర మే యర్ బొంతు రామ్మోహన్ విమర్శించారు. సర్జికల్ ైస్ట్రెక్ పేరుతో ఆ పార్టీ నేతలు మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. హిందూ ముస్లింలు కలిసి మెలిసి బతుకుతుంటే నాలుగు ఓట్లు రాల్చుకునేందుకు బీజేపీ నాయకులు ప్రజలను విభజించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయాలె తప్ప ప్రజల్లో విభేదాలు సృ ష్టించే మాటలు సరికాదని హితవు పలికారు.
సోయి ఉండే మాట్లాడుతున్నడా?
ప్రచార సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ‘ఒకాయన మాట్లాడుతూ.. వాళ్లను గెలిపిస్తే హైదరాబాద్‌పై సర్జికల్ స్ట్రైక్ చేస్తరట. ఇది ఏమైనా సిగ్గుండే మాటనేనా? సోయి ఉండే మాట్లాడుతుండా? ఆయనకు ఏమైనా దిమాక్ ఉన్నదా? హైదరాబాద్ ఏడుంది భారతదేశంలో లేదా? పాకిస్తాన్లో ఉన్నదా? చైనాలో ఉన్నదా? ఇసొంటోళ్లను నమ్ముకొంటే కొంప కొల్లేరు అవుతది. ఏమైంది హైదరాబాద్‌కు. మతాలు తేడా లేకుండా కలిసి మెలిసి ఉంటున్నరని చేస్తవా? ఏం రోగం పుట్టింది? నాలుగు ఓట్ల కోసం పచ్చని హైదరాబాద్‌లో అగ్గి పెడుతరా? ఆరేండ్ల నుంచి కలిసి ఉన్న హైదరాబాద్‌లో చిచ్చు పెడితే చూస్తు ఊరుకుందామా.. ఓటుతో బుద్ధి చెప్తామా?’ అని మండిపడ్డారు.
తాజావార్తలు
- వీడీసీసీతో సమస్యలుండవ్
- పారిశ్రామిక వాడలో పచ్చదనం
- పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
- యువత క్రీడాస్ఫూర్తిని చాటాలి
- స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి
- సామాన్యుడిలా సంజయ్‌కుమార్
- వచ్చే నెల ఒకటి నుంచి ‘కేసీఆర్ కప్' టోర్నీ
- ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగానే పోటీలు
- ఊర చెరువుకు పైపులైన్ వేయించాలి
- రాయపేట రిజర్వాయర్ నుంచి నీటిని ఇవ్వాలి