శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 12:14:09

రైతన్న కళ్ల‌లో మురిపెం కనపడుతున్న‌ది: కేటీఆర్‌

రైతన్న కళ్ల‌లో మురిపెం కనపడుతున్న‌ది: కేటీఆర్‌

హైద‌రాబాద్‌: ఈ ఏడాది వానాకాలం పంటల సాగులో దేశంలోనే తెలంగాణ మొద‌టిస్థానంలో నిల‌వ‌డంపై మంత్రి కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఒకనాడు సాగునీరులేక నెర్రెలు బారిన ఈ నేల, నేడు రైతుబంధు సీఎం కేసీఆర్ నేతృత్వంలో నదీ జలాలు పారగా వ్యవసాయంలో నూతన రికార్డులు సృష్టిస్తున్న‌ద‌ని అన్నారు. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణను సస్యశ్యామలం చేస్తుంటే, రైతన్న కళ్ల‌లో మురిపెం కనపడుతున్న‌దని ట్వీట్ చేశారు. 

గ‌త వానాకాలం పంట‌తో పొలిస్తే రాష్ట్రంలో 36.59 శాతం పెరిగింది. గ‌తేడాది వానాకాలంలో రాష్ట్ర‌వ్యాప్తంగా 1.02 కోట్ల ఎక‌రాల్లో పంట‌లు సాగ‌వ‌గా, ఈ ఏడాది 1.34 కోట్ల ఎక‌రాల్లో సాగుచేస్తున్నారు. ఈ ఏడాది 41.76 లక్ష‌ల ఎక‌రాల్లో వ‌రి పంటను సాగు చేయాల‌ని ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా నిర్ణ‌యించింది. అయితే దీనికంటే 5 లక్ష‌ల ఎక‌రాల్లో అధికంగా (46.55 ల‌క్ష‌ల ఎక‌రాల్లో) వ‌రినాట్లు ప‌డ్డాయి. అదేవిధంగా 60.16 లక్ష‌ల ఎక‌రాల్లో ప‌త్తి సాగు  ల‌క్ష్యంగా నిర్ణ‌యించ‌గా, 58.92 ల‌క్ష‌ల ఎక‌రాల్లో ప‌త్తిసాగు జ‌రిగింది. మిగిలిన పంట‌లు కూడా దాదాపు ప్ర‌భుత్వ ల‌క్ష్యానికి అనుగుణంగానే సాగ‌య్యాయ‌ని వ్య‌వ‌సాయ శాఖ గ‌ణాంకాలు పేర్కొన్నాయి.

వానాకాలం పంట‌ల‌సాగులో దేశంలో తెలంగాణ మొద‌టిస్థానంలో నిలిచింది. పంట‌ల సాగు వృద్ధిలో తెలంగాణ త‌ర్వాత 36 శాతంతో జార్ఖండ్‌, 35.14 శాతం పెరుగుద‌ల‌తో త‌మిళ‌నాడు రాష్ట్రాలు త‌ర్వాతి స్థానాల్లో నిలిచాయి.   

ప్ర‌భుత్వం మెరుగైన సాగునీటి వ‌స‌లు క‌ల్పిండ‌తోనే ఇది సాధ్య‌మ‌య్యింద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. రైతుబంధు అందించ‌డంతోపాటు, వ్య‌వ‌సాయ రుణాలు మాఫీ చేయ‌డం, స‌కాలంలో రైతుల‌కు ఎరువులు, విత్త‌నాలు స‌ర‌ఫ‌రా చేయ‌డం కూడా అధిక పంట‌ల సాగుకు దోహదం చేసింద‌ని పేర్కొన్నారు.  


logo