ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 27, 2020 , 18:14:12

మూసీ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

మూసీ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌ : మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌పై మంత్రి కేటీఆర్‌ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సుధీర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ... మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి సీఎం కేసీఆర్‌కు స్పష్టమైన ఆలోచన ఉందన్నారు. సీఎం ఆలోచనను కార్పొరేషన్‌ ముందుకు తీసుకుపోవాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో మూసీలో పేరుకుపోయిన చెత్త, పిచ్చి మొక్కలను దశలవారీగా తీసివేసే కార్యక్రమం కొనసాగించాలని తెలిపారు. తద్వారా దోమల బెడదను కొంత మేరకు తగ్గించగలిగే అవకాశం ఉందన్నారు. 

మూసీ వెంబడి ఫెన్సింగ్‌ వేయడంతో పాటు మూసీలో చెత్త వేయకుండా, కబ్జాలకు గురికాకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వీటి పర్యవేక్షణకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు. మూసీని అభివృద్ధి చేయడంతో పాటు సుందరీకరించడంపై రెవెన్యూ, హెచ్‌ఎండీఏ, జలమండలి విభాగాలతో కలిసి సమన్వయం చేసుకోవాలన్నారు. మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చేపట్టబోయే భవిష్యత్‌ ప్రణాళికలపై చర్చించేందుకు త్వరలోనే మరోసారి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.logo