మంగళవారం 02 జూన్ 2020
Telangana - May 09, 2020 , 13:41:28

ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌ చర్యలు : మంత్రి కేటీఆర్‌

ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌ చర్యలు : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : కరోనా కట్టడిలో కీలకపాత్ర వహిస్తున్న మున్సిపల్‌ కమిషనర్లను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. ఇదే స్ఫూర్తితో కరోనా కట్టడికి భవిష్యత్తులోనూ చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మున్సిపల్‌ శాఖపై మంత్రి కేటీఆర్‌ నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. పురపాలక కమిషనర్లు, అదనపు కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. భేటీలో మాన్సూన్‌ యాక్షన్‌ ప్లాన్‌పైనా మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ... రాష్ట్రంలో దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కరోనా వ్యాప్తిచెందే అవకాశం ఉందన్నారు. కావునా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. పట్టణాల్లో సరి, బేసి విధానంలో దుకాణాల నిర్వహణను పర్యవేక్షించాలన్నారు. వ్యాక్సిన్‌ వచ్చేవరకు కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉందన్నారు. కరోనా కట్టడికి అవసరమైన మార్గదర్శకాలను ఆరోగ్య, పురపాలకశాఖలు ఇవాళ విడుదల చేస్తాయని తెలిపారు. మాస్కుల వినియోగం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్ల వినియోగాన్ని కొనసాగించాలన్నారు. 

సీజనల్‌ వ్యాధుల నివారణకు చర్యలు...

సీజనల్‌ వ్యాధుల క్యాలెండర్‌ ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వానాకాలంలో వచ్చే డెంగీ తదితర వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. యాంటీ లార్వా యాక్టివిటీస్‌ కార్యక్రమాన్ని రేపట్నుంచే ప్రారంభించాలన్నారు. డెంగీ నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రతి పట్టణంలో మురుగుకాల్వలను శుభ్రంచేసి చెత్తను తరలించాలని చెప్పారు. ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుని వాటిని అమలు చేయాలన్నారు. ప్రతి పట్టణంలో మ్యాన్‌ హోల్‌ మరమ్మతులు పూర్తిచేయాలన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది రక్షణ కవచాలు, మాస్కులు లేకుండా పనిచేయరాదన్నారు. అలా కనిపిస్తే పూర్తి బాధ్యత మున్సిపల్‌ కమిషనర్లదేనని హెచ్చరించారు. పారిశుద్ధ్య కార్మికులకు వారానికోసారి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. రూ. 830 కోట్ల పట్టణ ప్రగతి నిధులతో చేపట్టిన పనులపై నివేదిక పంపాల్సిందిగా కమిషనర్లను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. 



logo