శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 30, 2020 , 17:45:50

స్టార్టప్ వ్యవస్థాపకులకు కేటీఆర్ అభినందన.. 'డాడ్' పుస్త‌కావిష్క‌ర‌ణ‌

స్టార్టప్ వ్యవస్థాపకులకు కేటీఆర్ అభినందన.. 'డాడ్' పుస్త‌కావిష్క‌ర‌ణ‌

హైద‌రాబాద్ : ఈ యువకులు నలుగురు నడచిన దారిలో నడవాలనుకోలేదు. తామే కొత్త దారులు వేయడానికి బయలుదేరారు. తమకున్న అలోచనలను రంగరించి అంకుర పరిశ్రమలు (స్టార్టప్స్) నెలకొల్పారు. ఇప్పుడిప్పుడే తొలి ఫలితాలను సాధిస్తున్నారు. తెలంగాణ కీర్తిని దశదిశలా చాటుతున్నారు. ఈ న‌లుగురు ప్ర‌తిభావంతులు బుధ‌వారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిశారు. వీరిని మంత్రి అభినందించి వెన్నుతట్టారు.

వరంగల్‌కు చెందిన అరుణ్ కుమార్ రాపోలు ఇంజినీరింగ్ పూర్తి అయ్యాక కొన్నాళ్లు యానిమేషన్, గేమింగ్ కంపెనీల్లో పనిచేశాడు. తరువాత తానే స్వ‌యంగా ఏ- థీరం అనే యానిమేషన్ అంకుర పరిశ్రమను స్థాపించాడు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మనదేశంలో తొలి మోషన్ క్యాప్చర్ సినిమా "ధీర" రూపొందించాడు. పూర్తిగా తెలంగాణలో తయారైన ఈ సినిమా 12 భాషల్లో విడుద‌లైంది. అమెజాన్ ప్రైంలో ఈ నెల విడుదల అయ్యి విశేష ప్రజాదరణ పొందుతోంది. టీ-హబ్, వీహబ్, టీ-వర్క్స్, తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటు చేసి దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా స్టార్టప్ ఎకో సిస్టం తెలంగాణలో అభివృద్ధి చేశారని అరుణ్ కుమార్ ఈ సంద‌ర్భంగా  ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను కొనియాడారు. 

వివిధ భారతీయ భాషల్లో డిజిటల్ పబ్లిషింగ్ ప్లాట్‌ఫారం కహానియా (Kahaniya) వ్యవస్థాపకుడు పల్లవ్ బజ్జూరి, నానో డిస్ట్రిబ్యూషన్ సంస్థ "ఎక్స్‌ప్రెస్" (Expres) ఫౌండర్ శ్రీనివాస్ మాధవం, డిజిటల్ క్యాంపస్ ప్లాట్‌ఫారం "స్టూమాగ్జ్" (stuMagz) వ్యవస్థాపకుడు శ్రీచరణ్ లక్కరాజు కూడా మంత్రిని కలిసి తమ అంకుర సంస్థల ప్రస్థానం గురించి వివరించారు. ఈ సందర్భంగా శ్రీచరణ్ లక్కరాజు రచించిన "డాడ్" అనే పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ యువత నూతన ఆలోచనలతో అంకుర పరిశ్రమలు (స్టార్టప్స్) స్థాపించి విజయాలు సాధించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.


logo