మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 02:28:39

శభాష్‌ సాయిసృజన్‌

శభాష్‌ సాయిసృజన్‌

  • అమ్మ కష్టాన్ని చూసి వరి నాటు యంత్రం తయారీ
  • రూ.40 వేలతో రూపొందించిన బీటెక్‌ విద్యార్థి
  • అభినందించిన మంత్రి కేటీఆర్‌

తిమ్మాపూర్‌ రూరల్‌: వరి నాట్లు వేసే సమయంలో అమ్మ పడుతున్న కష్టాలను కండ్లారా చూశాడు. వాటిని తీర్చి తల్లి కండ్లలో ఆనందం చూడాలని సంకల్పించాడు. ఇంటి ధాబాపై చిన్న షెడ్‌ వేసుకొని ఆరునెలలపాటు శ్రమించాడు. కేవలం రూ.40 వేల ఖర్చుతో నాటువేసే యంత్రాన్ని రూపొందించి శభాష్‌ అనిపించుకుంటున్నాడు కరీంనగర్‌ జిల్లాకు చెందిన బీటెక్‌ విద్యార్థి సాయిసృజన్‌. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం నర్సింగాపూర్‌ గ్రామానికి చెందిన చిల్ల లావణ్య, తిరుపతి దంపతుల చిన్న కుమారుడు సాయిసృజన్‌ బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు. 

నాటు వేస్తున్నప్పుడు అమ్మ పడుతున్న ఇబ్బందులను తీర్చాలని భావించాడు. పాత ఎక్సెల్‌ ఇంజిన్‌, చైన్లు, రాడ్లు, ప్లాటినం, ఇనుప చువ్వలు, ఇతర పరికరాలు సేకరించాడు. ఇంటిపై షెడ్‌ వేసుకొని ఆరునెలలపాటు శ్రమించాడు. కేవలం రూ.40 వేలు వెచ్చించి నాటువేసే యంత్రాన్ని తయారుచేశాడు. మార్కెట్‌లో నాటువేసే యంత్రం ఖరీదు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఉంటుంది. ఇప్పుడు మార్కెట్‌లో ఉన్నవాటి కంటే ఎక్కువ వరుసలు, తక్కువ నిడివి ఉండేలా యంత్రాన్ని రూపొందించాడు. దీంతో వరికర్రల నడుమ స్థలం వృథాగా పోకుండా ఉండి, దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్థిక సహకారం ఉంటే తక్కువ ధరకే యంత్రాలను రూపొందించి రైతులకు ఇస్తానని సృజన్‌ చెప్తున్నాడు. 

విద్యార్థికి మంత్రి కేటీఆర్‌ హామీ


తయారుచేసిన నాటువేసే యంత్రం ఫొటోను శుక్రవారం ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుకు సాయిసృజన్‌ ట్వీట్‌ చేశారు. దీనికి కేటీఆర్‌ వెంటనే స్పందించారు. సాయిసృజన్‌ను అభినందించారు. టీఎస్‌ఐసీ, టీ-వర్క్స్‌ వారు వచ్చి కలుస్తారని విద్యార్థికి హామీఇచ్చారు. ఆ వెంటనే పరిశ్రమలశాఖ అధికారులు సైతం సృజన్‌కు ఫోన్‌చేసి.. యంత్రాన్ని పరిశీలించేందుకు ఇద్దరు సభ్యులను పంపుతామని చెప్పారు. యంత్రాన్ని రూపొందించిన సృజన్‌ను కుటుంబసభ్యులు, గ్రామస్థులు అభినందిస్తున్నారు


logo