బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Oct 23, 2020 , 01:30:36

కార్మిక నేతకు కడపటి వీడ్కోలు

కార్మిక నేతకు కడపటి వీడ్కోలు

  • అధికార లాంఛనాలతో నాయిని అంత్యక్రియలు
  • పలువురు నేతల నివాళి.. పాడెమోసిన మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌
  • కడచూపుకోసం దవాఖాననుంచి వచ్చిన నాయిని నర్సింహారెడ్డి సతీమణి అహల్య

హైదరాబాద్‌/బంజారాహిల్స్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర తొలి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. దివంగత నేతకు అంతిమ వీడ్కోలు పలుకడానికి రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు, కార్మికులు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంతిమసంస్కారాలు ముగిశాయి. గౌరవ సూచకంగా పోలీసులు వందనం సమర్పించి మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. బుధవారం అర్ధరాత్రి కన్నుమూసిన నాయిని పార్థివ దేహాన్ని గురువారం తెల్లవారుజామున 5.45 గంటలకు బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-12లోని మంత్రుల నివాసానికి తీసుకొచ్చారు.

నాయిని మృతి వార్త తెలుసుకున్న పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, అభిమానులు ఆయన నివాసానికి చేరుకొని నివాళి అర్పించారు. హోంమంత్రి మహమూద్‌ అలీ ఉదయం నుంచి నాయిని నివాసం వద్దే ఉండి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. కరోనా బారినపడి కొంతకాలంగా జూబ్లీహిల్స్‌లోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్న నాయిని సతీమణి అహల్యను వైద్యసిబ్బంది అంబులెన్స్‌లో ఇంటికి తీసుకొచ్చారు. కరోనా సోకడంతో భార్యాభర్తలు ఇద్దరూ దవాఖానలో చికిత్స పొందారని, ఇటీవల నాయినికి నెగెటివ్‌ రావడంతో కోలుకుంటున్నారని అంతా భావించామని, ఇంతలోనే తమను వదిలిపెట్టి వెళ్లిపోయారంటూ బంధువులు ఆవేదన వ్యక్తంచేశారు. తాను అంత్యక్రియలకు వస్తానంటూ అహల్య కోరడంతో వీల్‌చైర్‌ సాయంతో మహాప్రస్థానం శ్మశానవాటికకు తీసుకెళ్లారు.


మంత్రులు, ప్రజాప్రతినిధుల నివాళి

నాయిని పార్థివ దేహానికి పలువురు మంత్రులు, రాజకీయ ప్రముఖులు, అధికారులు పూలమాలలువేసి నివాళి అర్పించారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, మంత్రులు మహమూద్‌ అలీ, ఈటల రాజేందర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, దానం నాగేందర్‌, మాగంటి గోపీనాథ్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ అంజనీకుమార్‌, శాసనమండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత కే జానారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ప్రజా గాయకుడు గద్దర్‌ తదితరులు నివాళి అర్పించారు.

పాడెమోసిన మంత్రులు

మహాప్రస్థానంలో నాయిని అంత్యక్రియలకు మంత్రులు ఈటల, కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, సబితా ఇంద్రారెడ్డి, తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నేత కే కేశవరావు, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, విప్‌ బాల్క సుమన్‌ తదితరులు హాజరయ్యారు. అంతియ యాత్ర మహాప్రస్థానానికి చేరుకోగానే మంత్రి కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌ వెళ్లి పాడె మోశారు. నాయిని కుమారుడు దేవేందర్‌రెడ్డి తండ్రి చితికి నిప్పంటించారు. అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, కుమార్తె మమతారెడ్డి తదితరులు భౌతికకాయం వద్ద భోరున విలపించారు.