గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 13:57:30

గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌పై నేను అలా అన‌లేదు : కేటీఆర్

గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌పై నేను అలా అన‌లేదు : కేటీఆర్

హైద‌రాబాద్ : న‌వంబ‌ర్ 11వ తేదీ త‌ర్వాత గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌లు ఉంటాయ‌ని తాను వ్యాఖ్యానించిన‌ట్లు కొన్ని మీడియా సంస్థ‌లు రిపోర్టు చేయ‌డంలో నిజం లేద‌ని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. జీహెచ్ఎంసీ యాక్ట్ ప్ర‌కారం న‌వంబ‌ర్ రెండో వారం త‌ర్వాత ఎన్నిక‌లు ఎప్పుడైనా రావొచ్చ‌ని, అందుకు పార్టీ నాయ‌కులు సిద్ధంగా ఉండాల‌ని మాత్ర‌మే తాను అన్నాన‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నిక‌ల షెడ్యూల్‌, నిర్వ‌హ‌ణ పూర్తిగా ఎన్నిక‌ల క‌మిష‌న్ ప‌రిధిలోని అంశ‌మ‌ని ఆయ‌న తెలిపారు. స‌ద‌రు మీడియా సంస్థ‌లు తాను అన‌ని మాట‌ల‌ను త‌న‌కు ఆపాదించ‌డం జ‌రిగింది.. అది స‌రికాదు అని కేటీఆర్ అన్నారు. 

నిన్న జ‌రిగిన స‌భ‌లో కేటీఆర్ ఏమ‌న్నారంటే..

‘నిబంధనల ప్రకారం నవంబర్‌ రెండో వారం తర్వాత ఎప్పుడైనా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రావొచ్చు. పోరుకు ఇప్పటి నుంచే సన్నద్ధమవ్వాలి. సర్వేలన్నీ తెలంగాణ రాష్ట్ర సమితికే అనుకూలంగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ 91 సీట్లు కచ్చితంగా వస్తాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 15 శాతం మంది కార్పొరేటర్ల పనితీరు మారాలి. జనంతో మమేకమై వారితో కలిసి పనిచేస్తేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. హైదరాబాద్‌ నగరాన్ని కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నాం. అందులో భాగంగానే గత ఐదేండ్లలో అభివృద్ధి కార్యక్రమాల కోసం 67వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశాం. తాగునీటి ఇబ్బందులను నివారించాం. ట్రాఫిక్‌ జాంలు లేకుండా, సాఫీగా సాగిపోయేలా రోడ్లను అభివృద్ధి చేశాం. పరిశ్రమల పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించాం. దీంతో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు నగరానికి తరలివచ్చాయి. ఈ వివరాలన్నింటినీ క్రోడీకరించి త్వరలోనే ప్రగతి నివేదిక విడుదల చేస్తాం. ధరణి పోర్టల్‌పై ప్రజలకు విస్తృత ప్రచారం కల్పిద్దాం. స్థిరాస్తి యాజమాన్య హక్కుల విషయంలో పారదర్శకంగా ఉండేలా వ్యవహరిద్దాం’ అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ నగర ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు హితవు పలికారు. మంగళవారం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో ఆయన సమావేశమయ్యారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు, ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధమవ్వాలంటూ మార్గదర్శనం చేశారు.


logo