మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 01:52:36

సేవకు కదిలిన దండు

సేవకు కదిలిన దండు

  • కేటీఆర్‌కు వినూత్నరీతిలో పుట్టినరోజు కానుక
  • పెద్దఎత్తున సేవాకార్యక్రమాలు
  • ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌'కు విశేష స్పందన
  • మొక్కలు నాటిన శ్రేణులు 
  • అన్ని జిల్లాల్లో రక్తదాన శిబిరాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/నెట్‌వర్క్‌: టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినోత్సవాన్ని ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఆలయాల్లో పూజలు చేశారు. కేకులు కట్‌ చేశారు. మొక్కలు నాటి, రక్తదానం చేసి కేటీఆర్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అక్కడక్కడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కేటీఆర్‌ బర్త్‌డే సందర్భంగా పేదలను ఆదుకునేందుకు చేపట్టిన ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌' కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.   పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌గుప్తా శుక్రవారం మంత్రి కేటీఆర్‌ను కలిసి బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ మోటర్‌ వెహికిల్స్‌ ఇన్‌స్పెక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌ పాపారావు మంత్రి కేటీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

పెద్ద ఎత్తున హరితహారం..

జనగామ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నేతృత్వంలో లక్షా 25 వేల మొక్కలు నాటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా హరితహారం కార్యక్రమం నిర్వహించింది. జిల్లాలోని అన్ని మండలాల్లో కలిసి సుమారు 4,07,100 మొక్కలను నాటారు. పాలమూరు యూనివర్సిటీ ఆధ్వర్యంలో దాదాపు లక్ష వరకు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి పాల్గొన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ టీ పాపిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ లింబాద్రి, వీసీ ప్రవీణ్‌రావు తదితరులు మొక్కలు నాటారు. ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి తెలంగాణ ప్రైవేటు డిగ్రీ, పీజీ యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వీసీ ప్రకాశ్‌, ప్రధాన కార్యదర్శి ఏ పరమేశ్వర్‌ తదితరులతో కలిసి బోడుప్పల్‌లోని జాహ్నవి కాలేజీ ఆవరణలో మొక్కలు నాటారు.  

రక్తదాన శిబిరాలు..

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నారాయణపురం లూర్దుమాత పాఠశాలలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కరీంనగర్‌ మేయర్‌ వై సునీల్‌రావు ఆధ్వర్యంలో స్థానిక ఎస్‌బీఎస్‌ ఫంక్షన్‌ హాల్‌లో తలసేమియా బాధితుల కోసం 50 మంది కార్యకర్తలు ప్రతిమ మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌కు రక్తదానం చేశారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచలో టీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకుడు జక్కుల నాగరాజు ఆధ్వర్యంలో 50 యువకులు, వేములవాడలో 30 మంది రక్తదానం చేశారు. 

ఎమ్మెల్యే ఆల రూ.2.80 లక్షల ఆర్థిక సాయం

మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం ఉంద్యాల గ్రామంలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తన సొంతంగా రూ. 2.50 లక్షల సాయాన్ని అందజేశారు. అలాగే చిన్నవడ్డెమాన్‌కు చెందిన సౌలురాజుకు ఉన్నత చదువుల కోసం రూ. 20 వేలు, అనారోగ్యంతో బాధపడుతున్న సారంగానికి దవాఖాన ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు ఆర్థిక సాయం చేశారు. మెదక్‌ జిల్లా కేంద్రంలోని నవాబుపేటలో కిష్టమ్మ అనే వృద్ధురాలికి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌ ఓ గదిని నిర్మించి ఇచ్చారు.

పాలంపేటకు ఎమ్మెల్సీ పోచంపల్లి రూ.70 లక్షల గిఫ్ట్‌ 

‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌' కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం పాలంపేట గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. రూ.70 లక్షలతో గ్రామ అంతర్గత రోడ్లను సీసీ రోడ్లుగా మార్చేందుకు తన నిధుల నుంచి మంజూరు చేశారు. మండల కేంద్రానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త చిట్టిమల్ల రమణాచారి భార్య పద్మ కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా.. ఆ కుటుంబానికి రూ.80వేల చెక్కును అందించారు. రామగుండం ఎమ్మెల్యే చందర్‌ సొంత ఖర్చులతో ఓ నిరుపేద వృద్ధుడి ఇంటి నిర్మాణానికి తొలి విడతగా రూ.25 వేలను అందజేసి భూమి పూజ చేశారు. పాలంపేటలోని రామప్ప ఆలయంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వీ ప్రకాశ్‌, జెడ్పీ చైర్మన్‌ జగదీశ్వర్‌, వికలాంగుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్‌ వాసుదేవరెడ్డి తదితరులు పూజలు చేశారు.

చిన్నారి శస్త్రచికిత్సకు ఎమ్మెల్యే బొల్లం సాయం

కేటీఆర్‌ జన్మదినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీనగర్‌కు చెందిన దివ్యాంగ చిన్నారి శస్త్రచికిత్స కోసం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ రూ.5 లక్షల చెక్కు అందించారు. బాలాజీనగర్‌కు చెందిన ఎండీ అన్వర్‌, అనిత కూతురు హబీబా(6)కు పుట్టుక నుంచి మూగ, వినికిడి సమస్య ఉన్నది. శస్త్రచికిత్స చేస్తే సమస్య పోతుందని.. ఇందుకు రూ.10 లక్షల ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. కూలీకి వెళ్లే ఆ దంపతులు అంత ఖర్చు భరించలేని స్థితిలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ను ఆశ్రయించారు. ఎమ్మెల్యే సీఎం సహాయ నిధి నుంచి రూ.5 లక్షలు మంజూరు చేయించారు. మరో రూ.5 లక్షల కోసం చిన్నారి తల్లిదండ్రులు సామాజిక మాధ్యమంలో దాతలకు విజ్ఞప్తి చేయగా.. విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌ ఆదుకోవాలని ఎమ్మెల్యే బొల్లంకు సూచించారు. ఎమ్మెల్యే బొల్లం శుక్రవారం రూ.5 లక్షల చెక్కును అందజేశారు. ఆర్థిక సహాయం చేసిన మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యేకు జీవితాంతం రుణపడి ఉంటామని చిన్నారి తల్లిదండ్రులు పేర్కొన్నారు. 

అప్పుడే పుట్టిన శిశువుకు కేటీఆర్‌ పేరు

నారాయణపేట జిల్లా మాగనూరు పీహెచ్‌సీలో శుక్రవారం జన్మించిన ఓ శిశువుకు మంత్రి కేటీఆర్‌ పేరు పెట్టారు ఆ తల్లిదండ్రులు. మండలంలోని కొత్తపల్లికి చెందిన రేష్మా మాగనూరు దవాఖానలో శుక్రవారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కేటీఆర్‌ జన్మదినోత్సవం రోజు తమకు కొడుకు పుట్టినందున కేటీఆర్‌ పేరు పెట్టామని రేష్మా, మహ్మద్‌ రఫీ దంపతులు సంతోషంగా చెప్పారు. అంతకుముందు దవాఖానలో పండ్లు పంపిణీ చేసిన టీఆర్‌ఎస్‌ నాయకులు రేష్మాకు కేసీఆర్‌ కిట్‌ను అందజేశారు. 

మొక్క నాటిన బీజేపీ కార్పొరేటర్‌ జితేందర్‌

అభిమానానికి పార్టీతో సంబంధం లేదని నిరూపించారు కరీంనగర్‌కు చెందిన 55వ డివిజన్‌ కార్పొరేటర్‌ పెద్దపల్లి జితేందర్‌. మంత్రి కేటీఆర్‌ బర్త్‌డే సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డితో కలిసి గ్రంథాలయ ఆవరణలో మొక్కనాటి అభిమానాన్ని చాటుకున్నారు.  


logo